పుట:1857 ముస్లింలు.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ పుస్తకంలో ఎవరినైౖనా ప్రత్యేకంగా ఆకట్టుకొని చెంప ఛెళ్ళుమనిపించే ప్రశ్నల వర్షాలు కురిపించేది చివరదైన తొమ్మిదవ అధ్యాయం.1857 పోరాటంలో పాల్గొని సర్వమూ కోల్పోయి, తర్వాతి కాలంలో కూడా వలసవాదుల దాష్టీకానికి గురైన ముస్లింల చరిత్ర తగినంత ప్రచారానికి నోచుకోక విస్మరణకు గురవుతోందన్న బలమైన ప్రశ్నాస్త్రాన్ని మన మీదికి ఎక్కుపెడుతూ, చరిత్ర రచనా శాస్త్రానికి సంబంధించిన పలు కోణాలను స్పృశిస్తుంది. అయిష్టంగా పోరాటంలో పాల్గొనాల్సిన వచ్చిన ఝాన్సీలక్ష్మీ బాయికి అంత ప్రచారం ఎందుకు లభించినట్టు? కత్తి చేతబట్టి గుర్రం విూద ఠీవిగా కూర్చోని ఉండే ఆమె విగ్రహాలు అన్నిచోట్లా ఎందుకు తామరతంపరగా వెలిసినట్టు? ఝాన్సీ రాణి కన్నా మరింత అంకిత భావంతో, సాహసంతో ఆంగ్లేయులను ధిక్కరించిన బేగం హజరత్‌ మహల్‌కు అంత ప్రాధాన్యత, ప్రచారం ఎందుకు లభించలేదు? Popular memory లో లక్ష్మీబాయికి అంత పటిష్ట స్థానం ఎలా, ఎందుకు లభించింది లాంటి ప్రశ్నలు మనసుల్ని ముసురు కుంటాయి. దీన్ని లోతుగా పరిశీలిస్తే స్వాతంత్య్రోద్యమ కాలంనాటి మన 'జాతీయ' నాయకుల మనసుల్ని శోధించే అవకాశం కలుగుతుంది. జాతీయోద్యమ నాయకులు చేతనంగానో, అచేతనంగానో 'హిందూ' Iconsని మాత్రమే జాగ్రత్తగా సొంతం చేసుకున్న పోరపాటు రాజకీయం బయటపడుతుంది; 'హిందూ' imagery ని బలంగా ముందుకు పెట్టి ప్రచారం చేసిన అసలు 'జాతీయత' బండారం బయటపడుతుంది.శౌర్యప్రతాపాలను ప్రతీకగా లక్ష్మీబాయిని తయారు చేయడంలో ఎవరికీ అభ్యంతరాలు ఉండకూడదు గానీ, అంతకన్నా సాహసంతో వ్యవహరించిన హజరత్‌ మహల్‌ కనీసం ప్రస్తావనార్హం కాకపోవడం మాత్రం తప్పక కలవరపరుస్తుంది.
'హిందూ' రంగుతో ప్రసారమైన అగ్రవర్గ, అగ్రవర్ణ జాతీయ భావన వల్ల ముస్లిం సమాజమే కాకుండా 'దళిత' సమాజం కూడా తీవ్ర అన్యాయానికి గురైంది. అందుకే మన 'ప్రామాణిక' చరిత్ర పుస్తకాల్లో గానీ, పాఠ్యపుస్తకాల్లో కానీ, దళిత పోరాటకారుల ప్రస్తావన అస్సలు ఉండనే ఉండదు. ఒక వేళ ఎవరైనా ఉంటే 'followers' (అనుచరులు) గా మాత్రమే ఉంటారు కానీ, leaders ('నాయకులు') గా ఉండరు! ఎందుకుండరనేది బహిరంగ రహస్యమే !! ఈ విధంగా అందరూ మనసుపెట్టి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరముందని నొక్కి నిశ్శబ్దకుట్రను బద్ధలు కొట్టమని మనల్ని తొందరపెడ్తుంది ఈ అధ్యాయం.