పుట:1857 ముస్లింలు.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857కు సంబంధించి 'ఉత్తర భారతం కేంద్రక (North Indian cetric) వాదనకు ఐదవ అధ్యాయమైన ' ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు' బద్ధలు కొడుతుంది. పోరాటం ఉత్తర భారతదేశానికే పరిమితమమైందనీ, దక్షిణ భారతం దీనికి స్పందించలేదనీ ఒక dominant అపోహ యిప్పటికీ బలంగా ప్రచారంలో ఉంది. ఉత్తర భారత ఆధిపత్య వాదులు తమ ఆధిపత్యాన్ని పదిలంచేసుకోడానికి ఈ విషయాన్ని బాగా ఉపయోగించుకుంటూ వస్తున్నారు. సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ ఈ అధ్యాయంలో అందించిన సమాచారం ముందు ఇక ఈ వాదన మోకరిల్లాల్సిందే !
ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో హిందూ-ముస్లింలలో వెల్లివిరిసిన ఐక్యతను సోదాహరణంగా వివరిస్తుంది ఆరవ అధ్యాయం. ఈ అధ్యాయంలో చాలా అపూర్వం అనదగిన విషయాలను రచయిత పాఠకులకు అందించారు. అప్పట్లో మతాలకు అతీతంగా ఈస్ట్‌ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా హిందూ-ముస్లిం ప్రజానీకం మధ్య వ్యక్తమైన బలమైన స్నేహభావాన్ని అనేక ఉదాహరణలతో వివరించారు. ప్రభువుల నుండి ప్రజల వరకు మతాలకు అతీతంగా మమేకమై ఉమ్మడి శత్రువు విూద సాగించిన పోరులోని విశేషాంశాలు పాఠకుల్ని ఆకట్టుకుంటూ ఆ model ను నేడు అనుసరించాల్సిన ఆవశ్యకతను పరోక్షంగా నొక్కి చెబుతుంది. మతతత్త్వ భావజాలం అనేక మాధ్యమాల ద్వారా విశృఖలంగా వ్యాపిస్తూ హిందూ-ముస్లింల మధ్య అగాధాలు యేర్పడుతున్న నేటి దుష్కర సందర్భంలో 1857 నుండి ఐక్యతా పాఠాలు నేర్చు కోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
వలసవాదుల దోపిడీ విధానాలపై సమరశంఖం పూరించిన రాజులు-రాణులు, ప్రజల పట్ల ఎంత హింసాత్మకంగా కంపెనీ ప్రభుత్వం వ్యవహరించిందో వివరించే ఏడవ అధ్యాయం 'నాగరికతా' రాయబారులూ, ప్రచారకులూ అని డంబాలు పలికిన ఆంగ్లేయుల అసలు నాగరికతా బండారాన్ని బయటపెడ్తుంది. ప్రజలను terrorise చేయడమనేదాన్ని వలసవాదులు ఒక 'విధానం'గా ఎలా రూపొందిచుకున్నారో తేటతెల్లం చేస్తుంది.
స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో ఆంగ్లేయులకు తొత్తులుగా వ్యవహరించిన వారు తర్వాతి కాలంలో 'పదహారణాల జాతీయనాయకులు' గా ఎలా అవతారమెత్తారో ఎనిమిదవ అధ్యాయం వివరిస్తుంది. ఈ అధ్యాయం త్యాగాలొకరు చేస్తే భోగభాగ్యాలనుభవించేది యింకోరా అని ప్రశ్నిస్తుంది.