పుట:1857 ముస్లింలు.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సమాజం ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వం ఏమీ చేయట్లేదని ముస్లిం సమాజం 'మేధావులు' సణగొచ్చుగానీ ఆ బాధ్యత ప్రభుత్వం మీదకన్నా తమ మీదే ఎక్కువగా ఉందన్న విషయం యిప్పటికైనా గుర్తిస్తే మంచిది.
ఈ విషయంలో 'దళితులు' ఒక Model ని కూడా తయారుచేసి ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో 1857 పోరాటంలో పాల్గొన్న మహిళలైన ఊదాదేవి పాసి, ఝల్కోరీబాయి మొదలైన 'వీరాంగన'లను Icons గా చేసి ప్రచారంలో పెట్టి దళిత సమాజ ప్రేరణ కోసం బృహత్తరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి తామెందుకు ఈ విషయంలో వెనుకబడ్డారో ముస్లింలు తమను తాము ప్రశ్నించుకోవాలి.
పోరాటంలో మౌల్వీలు (ఇస్లాం ధార్మిక పండితులు) నిర్వహించిన పాత్రను మూడవ అధ్యాయం చర్చిస్తుంది. మౌల్వీల గూర్చి సమాజంలో ఒక మూసపోత ఆలోచన ఉంది. వారు కేవలం ధార్మిక విషయాలకే పరిమితమౌతారనీ, సెక్యులర్‌ విషయాల్లో శ్రద్ధ చూపించరనీ పలువురు భావిస్తుంటారు. ఇంకొంచెం ఔత్సాహికులైన 'ఆధునికతా'వాదులు ముస్లిం సమాజం వెనుకబడడానికి కారణం ఈ మౌల్వీలే అనే తొందరపాటు నిర్ణయాలకు వస్తుంటారు. ఈ అధ్యాయం ఈ తప్పుడు అవగాహనలకు సమాధానం చెబుతుంది. 1857 పోరాటంలోనూ, తర్వాత 'జాతీయోద్యమం' లోనూ మౌలానాలు పోషించిన పాత్ర సరియైన ప్రచారానికి నోచుకోకపోవడం వల్ల మౌలానాల పాత్రను మనం సరిగ్గా అర్ధం చేసుకోలేక పోతున్నాం. దియోబంద్‌కు చెందిన మౌలానాలు కానీ, యితరులు కానీ, మాతృభూమి కోసం చేసిన త్యాగాలు సంస్మరణీయమైనవి. మరి నేటి మౌల్వీలు వారినుండి ఏమాత్రం ప్రేరణ పొందుతున్నారనేది 'అల్హంకా సూరా' అంతటి ప్రశ్న.
1857 పోరాటానికి కలంతో అండందలందించిన కలం యోధులను గూర్చి నాల్గవ అధ్యాయం వివరిస్తుంది. పోరాటయోధులలో ఉత్సాహం నింపడంలో ఉర్దూ జర్నలిజం ప్రబల పాత్రను పోషించింది. 'హిందూ-ముస్లిం' పోరాటకారులందరూ 'ఉర్దూ' లో వచ్చిన ఈ సాహిత్యం ద్వారా ప్రేరణ పొందారు. 'హిందువులు' సైతం తమ ప్రకటనలను 'ఉర్దూ'లోనే యిచ్చారు. అంటే 'ఉర్దూ'ను ముస్లింల తలలకు అంటగట్టి, మతం రంగు పులిమి తర్వాత్తర్వాత మతతత్వీకరించి 'భారతీయ' భాషా వినాశనానికి 1857 తర్వాతే బీజాలు పడ్డాయని మనకు స్పష్టమౌతుంది.