స్ఫూర్తినిచ్చేవిధంగా స్వాతంత్య్రోద్యమ కాలంలో భారత 'జాతీయవాదులు' భారతదేశ చరిత్రను వ్యాఖ్యానించి జాతీయ అస్తిత్వ ప్రకటనకై ప్రయత్నం చేశారు. స్వాతంత్య్రానంతరం భారత జాతిని 'సృష్టించే' లక్ష్యంతో రాజ్యం (Indian state) గతం విూద 'ప్రత్యేక' దృష్టిని సారించి భారత జాతి 'ఏకత్వ' నిరూపణకై పలు తంటాలు పడుతోంది. తమ క్షుద్ర రాజకీయ పన్నాగం పారించడానికి గత నాలుగు దశాబ్దాలుగా 'హిందూత్వ' కాలనాగులు 'చరిత్ర' ను ఎంతగా కాటేస్తున్నాయో మనందరికీ బాగా తెలిసిన విషయమే ! ఒకవైపు ఆధిపత్య వర్గాలు తమ పెత్తనానికి వత్తాసు పలికే విధంగా చరిత్రను మలచి దాన్నే 'సామాజిక చరిత్ర' గా నిరూపిస్తూ వస్తోండగా యింకోవైపు సామాన్య ప్రజల పక్షం వహించే మేధావులు మార్క్సిస్టు సిద్ధాంతాన్ని చారిత్రక వ్యాఖ్యానానికి జోడించి ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కన్పించకుండా పోయిన చరిత్ర నిర్మాతలైన సామాన్య ప్రజల చరిత్రను రచించే ప్రయత్నం చేస్తున్నారు.
వివిధ అస్తిత్వ ఉద్యమాలు విజృంభిస్తున్న సందర్భంలో చైతన్యవంతులవుతోన్న అట్టడుగు వర్గాల, అంచులకు నెట్టివేయబడిన కులాల ప్రజలు తమ వాస్తవ చరిత్ర ప్రాధాన్యతను గుర్తించి తమ చరిత్రను తామే సృజియించుకుంటున్నారు; తమ చరిత్రను తామే త్రవ్వి సొంతం చేసుకుంటున్నారు. వాస్తవ సొంత చరిత్ర పునాదిగా వర్తమాన, భవిష్యతుల్ని సొంతంగా నిర్మించుకోడానికి ఉద్యుక్తులవుతున్నారు. చరిత్ర నిర్మాణంలో తమ ఉనికిని పట్టించుకోని ఆధిపత్య చరిత్రల్లోని డొల్లతనాన్ని ప్రశ్నించడం ద్వారా పెత్తందారీ వర్గాల ఆధిపత్యాన్ని నిలదీస్తున్నారు. సమాజ సంపద సృష్టికర్తలైన దళితులు, వెనుకబడిన తరగతులు, ఆదివాసీలు, స్త్రీలు, మత'మైనార్టీలు' సొంత చారిత్రక చైతన్య ప్రేరణతో గొంతు లిప్పుతున్నారు: మాక్కూడా 'ఘనమైన' చరిత్ర ఉందనీ, ఈ సమాజ నిర్మాణంలో తాము కూడా గణనీయమైన పాత్రపోషించామనీ దీన్ని అందరూ గుర్తించి గౌరవించాలనీ నొక్కి చెబుతున్నారు.
ప్రస్తుత పుస్తక రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్ రచనలన్నీ ఈ నేపథ్యంలో వస్తున్నవే. తీవ్ర అణిచివేతకూ, నిర్మూలనకూ గురవుతున్న ముస్లిం సమాజానికి ఈయనందీస్తున్న అక్షరాయుధాలకు ప్రస్తుత పుస్తకం ఒక కొత్త చేర్పు. 1857 పోరాటంలో ముస్లిం సమాజం పోషించిన బృహత్తర పాత్రను వివరించడం దీని ప్రధాన లక్ష్యం. పోరాటంలో ముస్లింల బలిదానాలను ఒకవైపు వివరిస్తూ యింకోవైపు అన్యాపదేశంగా ముస్లింలకు సంబంధించిన అనేక యితర విషయాలను నశీర్ చర్చకు పెడుతున్నారు.
పుట:1857 ముస్లింలు.pdf/13
Appearance
ఈ పుట ఆమోదించబడ్డది