పుట:1857 ముస్లింలు.pdf/11

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఎంత ఎక్కువంటే ఈ 'తిరుగుబాటు' ను వలసపాలకులు ఏకంగా 'ఇస్లామిక్‌ తిరుగుబాటు' గా చిత్రీకరించేటంతటి గొప్ప పాత్రన్న మాట! ముస్లింలను ఈ 'తిరుగుబాటు' కు ప్రధాన బాధ్యులుగా భావించబట్టే వాళ్ళను ఎంతో క్రూరంగా అణిచలివేగలిగారన్న విషయాన్ని నశీర్‌ సోదాహరణంగా తెలిపారు. ఆంగ్లేయుల దారుణ కృత్యాల విలయనృత్యాన్ని చూస్తే గుండెలు బద్ధలౌతాయి. ఉరికొయ్యలకూ, ఫిరంగి కుహరాలకూ బలైపోయిన వారి కథలు మనల్ని కన్నీరు పెట్టిస్తాయి.
సాధారణంగా దక్షణ భారతదేశంలో ఈ పోరాటం జరగలేదని అంటుంటారు; ఇది వాస్తమేనని మనమింతవరకూ నమ్మాం; అలా నమ్మించారు. కానీ ఇది ఎంతటి తప్పుడు అవగాహనో సాక్ష్యాధారాల్తో నిరూపిస్తుందీ పుస్తకం. హైదరాబాదులోని బ్రిటీష్‌ రెసిడెన్సీ పై పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ లాంటి వారి నాయకత్వంలో ప్రజలు ఎంత వీరోచితంగా దాడి చేశారో నశీర్‌ విపులంగా వివరించారు. నిజాం రాష్ట్ర భౌగోళిక హద్దులకే ఈ పోరాటం పరిమితం కాలేదు; ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు కూడా ప్రాకిందనీ, షేక్‌ పీర్‌షా (కడప) లాంటి అంధులైన యోధులు సైతం మాతృభూమికై ప్రాణాలొడ్డారనీ ఈ పుస్తకం ఘోషిస్తుంది. వివిధ వర్గాలు, ప్రాంతాలు, జండర్‌ నేపధ్యాలకు చెందిన ముస్లింల జీవన బలిదానాలనూ, మాతృ భూమికై పోరాడుతూ ఆ తల్లి ఒడిలో ఒరిగిపోయిన విధానాన్నీ దృశ్యీకరిస్తుందీ పుస్తకం. భారతదేశాన్ని వలసపాలకుల సర్పసంకెళ్ళ నుండి విముక్తి కావించడానికి తమ శక్తికొద్ది పోరాడి, బలైన ముస్లిం బిడ్డల అమూల్య బలిదాన కథనాల గని నశీర్‌ ఎంతో శ్రమకోర్చి మనకిచ్చిన ఈ పుస్తకం.
చరిత్ర సృష్టించిన 1857కు సంబంధించిన 150 సంవత్సరాల సంబరాలను భారత ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో నశీర్‌ ఈ పుస్తకం రాయడం హర్షించదగిన విషయం. అంతకు మించి మతోన్మాద క్షద్రశక్తులు విభజనరేఖల్ని గీసి, అగాధాలను తవ్వి భయవిహ్వల వాతావరణం సృష్టిస్తున్న సందర్భంలో ఈ పుస్తకం రావడం ఇంకా సంతోషించాల్సిన విషయం.
నేను నాదేశాన్ని (భారతదేశాన్ని) ప్రేమిస్తాను అని భావించే ప్రతి ఒక్కరూ చదవదగ్గ జ్ఞానకిరణం ఈ పుస్తకం. ఎంతో ప్రేమతో ప్రమాణవాక్యం రాయండని నన్నుకోరిన మిత్రులు సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌కు ధన్యవాదాలు.