పుట:10879telugukaavy034400mbp.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అవతారిక

ప్రకృతమందు హిందూబాలికలకు ప్రత్యేకముగా వారల నిమిత్తము స్థాపింపబడిన పాఠశాలలయందును రాణివాసపు యువతులకు అంతఃపురములందును స్వకీయభాష గరపు బడుచున్నది. ఉదారలగు కొందరు యూరోపియను స్త్రీలు వారలకు లలితములగు శిల్పవిద్యలను గూడ బ్రేమతో నేర్పుచున్నారు. కవితాశక్తియు లలిత శిల్పకౌశలంబునే కాక ఉద్యాన వనారోపణము భూరుహంబుల బెంచి పూపించుట ఫలింప జేయుట మున్నగు దోహదక్రియలు మొదలుగాగల వృక్షాయుర్వేద కృత్యములయందు నైపుణంబునుగల విదుషులు పూర్వ కాలముననుండి నేటికిని అంతఃపురములందు గలిగియుండుట యెల్లరకు దెల్లంబే. ఈయంశము కాళిదాసాదికృత ప్రబంధములవల్లనేకాక కృష్ణదేవ మహారాయల యాంధ్ర కావ్యోచ్ఛ్రయ కాలమందు బ్రకాశించిన యాంధ్రకవుల ప్రబంధములవల్లను గూడ మనకు దెలియ వచ్చుచున్నది. ఆరాయల యౌరసపుత్రి మోహనాంగి యనునామె మరీచిపరిణయమను మనోజ్ఞమైన కావ్యమును రచియించె.