పుట:10031upanishhats033596mbp.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తతివారైన మహామహోపాధ్యాయ శ్రీపరవస్తు వేంకట రంగాచార్యులయ్యవారలుఁ గారి వలన నేను విన్న వేదాంతార్థ రహస్యముల వల్లను, ఇతరగ్రంథముల వ్యాసంగమువల్లను, నిస్సమాభ్యధికుండై యపార కరుణానిధియై యుండు పరమాత్మ నుపాసించుటయె కర్తవ్య మను నా యభిప్రాయమును బలపఱిచి నాకు మిక్కిలి యానందమును గలిగింప, సంస్కృత భాషలో నుండు నట్టి వేదాంత వాక్యములకు తెనుఁగున సరియైన గీతములు రచియింపించిన బ్రహ్మవిద్య గాన పూర్వకముగా నందఱకును తెలిసి కొన సులభ మగునని తలంచి నేను ప్రార్థింపఁగా ఆ శ్రీపరవస్తు వంశకలశాబ్ధి కళానిధియగు మహామహోపాధ్యాయ శ్రీవేంకట రంగాచార్యులయ్యవారలుఁ గారు సిద్ధార్థ నామ సంవత్సరమునం దొడంగి యెనుబదినాల్గు గీతములు రచియించిరి. అందు బహుతర గీతములకు సంగీత విద్యాధురంధరులని పేరెన్నికగన్న ధార్వాడ మాధవరావు పంతుల వారును, కొద్ది గీతములకు సంగీతవిద్యాతత్త్వజ్ఞులును వీణావాదనప్రవీణులునగు గుమ్ములూరి వెంకట శాస్త్రులుఁగారును,