ఈ పుట అచ్చుదిద్దబడ్డది
80
కాళిదాస చరిత్ర
ఈశ్లోకచతుష్టయము నాకర్షించి భోజరాజు బ్రహ్మానందబరిత స్వాంతుండై సింహాసనముదిగి కాళిదాసమహాకవి చరనారవిందములకు దండప్రణామ మాచరించి చేతులు జోడించి యిట్లనియె—- “కవీంద్రా! రసము చిలుకుచున్న యీనాలుగుశ్లోకములకు నారాజ్యమునందు నాలిగుదిక్కులును నీకిచ్చివేసితిని. నీవు కవిరాజువేగాక రాజువుకూడ నైతివి కాబట్టి యీరాజ్యమేలుకొనుము. నేను శ్రీకాళికానగరమునకుం బోయి విశ్వేశ్వరధ్యానపరాయణుడనై గంగాతీరమున గాలముగడిపెదను“ అని బైలుదేరబోవుచుండ నప్పుడు కాళిదాసుడు “దేవా! ఇదిధర్మమా? సింహాసనము మీది. దర్భాసనము మాది భూమండలముమీది,కమండలముమాది, రత్నగర్భులుమీరు. దర్భలు మావి. మహీమండల పరిపాలనము మూర్ధాభిషిక్తులగు మహారాజులకుం జెల్లుగాని శమదమసంపత్తిగల బ్రాహ్మణులకుజెల్లునా ! శ్లోకములతో లోకముల నేలజాలుదుమా! గంటము పట్టగలముగాని, ఖడ్గముబట్టగలమా! శాస్త్రములేగాని, శస్త్రములుమాస్వాధీనములా! కావున మీరే వసుంధరా పరిపాలనము జేసి మాబోంట్లను రక్షింపవలయు నని ప్రార్దించుచున్నాడ“ నని వినయమున విన్ంస్వించెను. మంత్రులు, సామంతులు, తక్కిన సభాసదులు మహారాజుముందర నిలిచి రాజ్యస్వీకారము చేయవలయు నని కోరిరి. అప్పుడు రాజు “కాళిదాసునకు నిచ్చితినే మరల నేనెట్లు గ్రహింపగలుగుదు!”ననివారితో బలుక వారందఱు నేకగ్రీవముగా కాళిదాసునకు విశేషధనమిచ్చి రాజ్యము మరల మీరు క్రయమునకు బుచ్చుకొనుడు. దానితో నాదోషముపసమించు”నని హితోపదేశము చేసిరి. అది యుక్తముగా నున్నదని యంగీకరించి రాజు కాళిదాసునకు ధనకనకవస్తువాహనములు విరివిగా నిచ్చి దన యాస్దాన కవీశ్వరులలో నగ్రగణ్యుడుగ నొండవలసిందని యాతనిం గోరెను.