కాళిదాస చరిత్ర
పైబడుచున్నాడని భావించిరి. ఆసభలోనున్న దుర్వాసమహాముని పుంజికస్దలయొక్క హోయలు, హావభావములు జూచి మనోవికారము గలిగి సభాస్దారులు నవ్వునట్లు కొంతసేపు వికృతపు చేష్టలు చేసిచేసి యెట్టకేలకు మనస్సు పట్టజాలక బ్రహ్మవిష్ణు మహేశ్వరు లచ్చట సాక్షాత్కరించియుండిరని సందియము లేక, వసిష్ట భారద్వాజాంగీరస ప్రముఖులు జూచుచున్నారనుశంకలేక చివాలున దన యాసనమునుండి లేచి రంగస్దలముమీదికి విసవిస బరువెత్తి పుంజికస్దలయున్న యెడకు బోయెను. అదివఱకే వాని వికృతచేష్టలు కనిపెట్టుచున్న పుంజికస్దల యతని వాలకము జూచి భయపడి శరీరము గడగడనడక నేమియు జేయునదిలేక తనకేదో మహాపద సంభవించునని శంకించి శంకర వేషముతో నున్న తన మనోహరుడెగుహంసుని 'రక్షింపుము-రక్షింపు ' మని కౌగలించుకొనెను. సభయంతయు మిక్కిలి కలుత జెందెను. కొందఱు తమ యాసనంబుల నుండి లేచిరి. కొందఱు దుర్వాసుని నివారింపబోయిరి. సరస్వతీదేవి దుర్వాసుని మనోదౌర్భల్యముంజూచి పక్కున నవ్వెను. నాటకముచెడిపోయెను. భరతమహాముని తన ప్రయత్నము గిఘ్నమైనదని విచారించెను. ముఖ్యముగా నతనికి పుంజికస్దలమీద గోపము వచ్చెను. "వేలకొలది సభికులుండగా దుర్వాసుడు వచ్చి నిన్ను మ్రింగుననుకొంటివా? ఏల నీవు వేషములోనుండి హంసుని గౌగలించితివి? నీ మూలమున నాటకముచెడిపోయినది" అని భరతుడు పుంజిస్దలను గనులెఱ్ఱజేసిచూచి "నీవు భూలోకంబున మనుష్యాంగనవై పుట్టు" మని శపించెను. అక్కడనుండి కోపములు శాపములుగా మాఱెను. తన్నుజూచి సరస్వతి నవ్వినందున దుర్వాసుడు మండిపడి కన్నుల నుండి విస్ఫులింగములు చెదర కోపాదేశమున మాటలు తడబడ, శారదాదేవి నుద్దేశించి యిట్లనియె-- "ఓ వాణీ! సృష్టికర్తయైన బ్రహ్మదేవుని రాణినగుటచేతను, విద్యలకధిపతిదేవత నగుటచేతను, నీవు