కాళిదాస చరిత్ర
కాళిదాసుని జన్మవృత్తాంతము
మూడవ కధ
అమౄతము సంపాదింపవలెనని
దేవతలు రాక్షసులుగలసి పాలసముద్ర
మును మధింపదలచిరి. అందునిమిత్తము వారు మందరపర్వతము గవ్వముజేసి, యాదిశేషుని గవ్వపుతాడుగాజేసి, యొకప్రక్క దేవతలు, మఱియొకప్రక్క రాక్షసులు బాముత్రాడు పట్టుకొని తఱచనారంభించిరి. అప్పుడాపర్వతము సముద్రములో గ్రుంగిపోయెను. అప్పుడు దేవదానవులు శ్రీమహావిష్ణును వేడుకొనగా నతడు కూర్మావతారమెత్తి క్రుంగిపోయున కొండక్రిందనిలిచి వారికి అయముచెసెను. అప్పుడు పాలసముద్రములో హాలాహలవిషము పొడమెను. అదిలోకములం గాల్చు చుండ దేవదానవులు భయపడి శివునిం బ్రార్దించిరి. భక్తవత్సలుడగు పరమేశ్వరుడు డా హలాహలవిషము మ్రింగి తనకంఠమున బెట్టుకొనెను. తరువాత క్షీరసాగరములో దేవదానవులు కోరినట్లు చావులేకుండ జేయునట్టి యమృతముపుట్టెను. ఆయమృతము సమానముగా బంచుకొనుటకై పాళ్లుతెగక దేవదానవులుపోరాడిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు జగన్మోహినీ రతీదేవికన్న, భారతీదేవికన్న, రమాదేవికన్న నెక్కువ చక్కనిరూపముగలిగి సురాసురలను భ్రమింపజేసెను. అనేక సంవత్సరములు జితేంద్రియుడై, మన్మధుని సంహరించి, మృత్యువునుగెలిచి, లోకైకపూజ్యుడైన శంకరుడు విష్ణు మాయలోబడి జన్మోహినీ రూపమునుజూచి మోహించి యొడలుదెలియక యామెవంటబడి యెట్టకేలకు నామెతో గొంతకాలము విహరించెను. అప్పుడు వారికి గాలభైరవుడు జన్మించెను.