కాళిదాస చరిత్ర
కాళిదాసుని వృత్తాంతమును గుఱించిన రెండవకధ
మాళవదేశమున వైజయంతమను పట్టణము కలదు. ఆ నగరసమీపమున నొక్క మహారణ్యము గలదు. ఆవనమధ్యంబున నొక పుణ్యాశ్రమంబుగలదు. ఆయాశ్రమమున మహానుభావుడగు త్రికాలవేది యను ముని ఘోరతపంబు జేయుచుండెను. అతని తపం బసాధారణంబు అతని నియమం బలోకసామాన్యంబు. అతనిప్రభావమమేయము అతడు భూతభవిష్యద్వర్తమానముల నిజతిసోమహత్వమున నెఱుగుటచేత నతనికి ద్రికాలవేదియను సార్దకనామము గలిగెను. అతని యుగ్రతపమునకు భయపడి మహేంద్రుడు మేనా మొదలగు నప్సరసలను రావించి భూలోకంబునకరిగి వానితపోవిఘ్మంబు గావింపుమని యానతిచ్చెను. ముని తపోవిఘ్నమునందు దేవకన్యలు మిక్కిలి యారితేరినవారయ్యు, నామహాముని ప్రభావంబును, స్వభావంబును, దఱచుగా వినియుండుటంజేసి వానిని సమీపింప వెఱచిరి. వారిలో జక్కదనంపుటిక్కయు, నెఱజాణయు, నిండుజవ్వనియు నైన మనోరమయను నచ్చరవెలంది తన చెలికత్తెలగు రంభా మేనకాదులు గనుంగొని వారి పిఱికిదనంబు నదిక్షేపించి "మీరామునిచంద్రునకు భయపడితిరేని నిలువుడు. నేను మీసహాయములేకయే మహామండలమున కరగి యామునిసత్తము చిత్తము గరగించి తపోభ్రష్టుని గావించెద. ఇట్లు చేయనైతినేని ననీపేరం బిలువబొకుండు" అని దేవతాసన్నిధానమున గాఢ ప్రరిజ్ఞచేసి, యిందునిమెప్పువడసి, యతనిచేత ననేకాభరణంబులు బహుమానముగా బడసి, వానికడ సెలవుగైకొని, భూలోకంబున కరిగి, యయ్యాశ్రమంబుజొచ్చి , మండుచున్న యగ్నివలె మహాతేజశ్శాలియైన త్రికాలవేదిని గనుంగొని, మెల్ల మెల్లగ నాతని యనుగ్రహంబు వడసి, నాతనికి జలంబులు ఫలంబులు దెచ్చియిచ్చుచు