కాళిదాస చరిత్ర
నవయవనములుదాల్చిన క్రొకాఱుమెఱుంగవలెను. జైతన్యము గలిగిన పసిడిబొమ్మవలెను, దళుకుతళున మెఱయుచున్న దీపముల కాంతి నడుమ దేదీప్యమాన ప్రభలతో వెలయుచున్న యామత్తకాళినీమ తల్లియొక్క యొయ్యారము, లావణ్యము, తారుణ్యము జూచు భాగ్యములేక యానిర్భాగ్యుడు బావురుపిల్లులు పోరాడు నట్లు పెద్ద గుఱ్ఱువెట్టి కుంబకర్ణుని తమ్ముడో యనునట్లు గాఢనిద్ర పొవుచుండెను. ప్రాణేశ్వరుడు వివాహమందలి నిరంతర వైదికవిధులచేత నలసిసొలసి యుండుటచేత కాబోలు నించుక కునుకుపట్టి యుండునని తలంచి యా రాజనందన యొకమూల గొంతసేపు నిలువంబడి యెంతసేపటికి నాతనికి మెలుకువరామి నొకపీఠముపై గూరుచుండి వీణాగానముచేత నతనికి మెలుకువ వచ్చునేమో యని వీణం జేకొని హాయిగా వాయింపజొచ్చెను. పెండ్లికుమారుడు నిద్రలొ నడుమ నడుమ 'ఓరీ! గంగులు పందిపిల్లపోయె పందిపిల్లబోయె కొట్టుకొట్టు పట్టుపట్టు" మని యొకసారియు"గంజినీళ్లు గంజినీళ్లు" యని యొక మాఱును బలవరించెను. ఆపలవరించుటవిని బాలిక "ఏమిది? ఇట్లు పలువరించుచున్నాడేమి?" యని భయము , నాశ్చర్యము మల్లడిగొన నేదొ యూలొచించుచు మనసు మనసులో లేక వీణ మఱింతగట్టిగా వాయించెను. అడవిలొ బెబ్బుల యొక్కయు, సింగములయొక్కయు, బొబ్బరింతలకు మెలుకువరాని యాపురుషునకు వీణాగాన మొక లెక్కయా? కుక్కలమొఱుగులేగాని బైరవరాగ మెన్న డాతని చెవిని బడియుండలేదు. నిద్రలో శంకరాభరణ ములవలె బుసకొట్టుటేగాని శంకరాభరణము వాని కర్ణ గోచరముకాలేదు. "పశుర్వేత్తిశిశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి" యనగా శిశువు, పశువు, పామునుగూడ గాన రసమును గ్రహించును. గానము పశువుల కానందము కలిగించును. గానము పశువుల కానందము గలిగించునా? అంత మనోహరముగా