ఈ పుటను అచ్చుదిద్దలేదు
159
కాళిదాసు చరిత్ర
కొనుము. నన్నుమాత్రము బ్రతుకని"మ్మని వేడుకొనెను. అందుకు మందబుద్ది యిట్లనియె-- "నాకు ధనముకావలెను. నీవిప్పుడు వేయి వరాలు నాకిచ్చిననను బిమ్మట నేనాసొమ్మునపహరించినానని నీవుగ్రామమున చెప్పదలచినచో జెప్పుము" అనవుడు నా మరణబాధపడుచునే మేధాశాలి యొకశ్లోకము రచియించి యది వానికి జెప్పినచో దానియర్దము గ్రహించి వాడు తనవాని కది యెఱిగింపండని శంకించి శ్లోకముయొక్క నాలుగుపాదములలోని మొదటి యక్షరముల నొకమాటగా "అప్రశిఖ" యని కూర్చి యా మాట తనవారితో జెప్పమనిజెప్పెను. దానియర్దము సామాన్యులకు దెలియకపోయినను దేవతావరప్రసాదముగల మహాపండితులకు దెలియవచ్చునని వాని యభిప్రాయము. అప్రశిఖ యను నామాటను గ్రహించి మందబుద్ధి ఖడ్గముతో వాని శిరస్సు చేదించి వానియొద్దనున్న ధనమంతయు జననీజనకులకిచ్చి మెల్లగా మేధాశాలి యింటికి జని వాని తల్లిదండ్రుల కిట్లనియె--
"అయ్యో! నేనును మీవాడాను నన్నదమ్ముల వలె నుంటిమి. కాశీనుండి బైలుదేఱి వచ్చుచుండగా మార్గమధ్యమున దారుణమైన సన్నిపాతజ్వరముచేత నతడు వారము దినములు బాధపడి ప్రాణములు విడచెను. ఆ సంధిలో నెన్నోసార్లు తల్లిదండ్రులను దలచికొనెను. జననీజనకులకు నమస్కారములను జెప్పుమనెను. అయ్యో! నాకన్నుల చందమామ పోయినది. నాపంచప్రాణములలో నొకటి గతించినది. నాకుడిచేయి పడిపోయినది. అటువంటి మిత్రుడు నా కీజన్మమున దొరకునా? నేను మందభాగ్యుడను. దేవుడు మందబుద్ధినైన నన్నైనను జంపుకొనిపోక కుశాగ్రబుద్దియై సత్కీర్తి సంపాదించిన నా మిత్రు నేల గొంపొవలె? నాఖర్మము అయినను నేనే మీకొమారుడుగా నుండెద.