కాళిదాసు చరిత్ర
3
మరల జన్మింపకపోవుటచేత జిటికెనవ్రేలి తరువాత వ్రేలికి ‘అనామికా యనుపేరు కలిగునది.
ఈ విధముగా సమస్తకవులు, సమస్త పండితులు మెచ్చుకొనఁదగినట్టి మహాకవిత్వముగల మహాకవి కాళిదాసుయొక్క చరిత్రము మనకు దెలియకపోవుట మిక్కిలి విచారకరము. దేశచరిత్రలు మనలోలేకపోవుటచేత నిటువంటి ప్రసిద్ద మహాకవుల వృత్తాంతములు మనకుఁ దెలియకపోవుట సంభవించెను. కాళిదాసుని గురించి యిప్పుడు చెప్పుకొనుచున్న కథలు, వ్రాయబడుచున్న కథలు, కేవలము పుక్కిటిపురాణములే కాని నిజమైనవికావు. కాని, యవి మనోహరములుగ నుండుటచే జనసామాన్యముచేత నాదరింపఁబడుచున్నవి. అందుచేత జనులు చెప్పుకొనుచున్న కథలనుబట్టి కాళిదాసచరిత్రము వ్రాయవలయును.
కాళిదాసుఁడు విక్రమార్కుని సభలోని వాఁడైన పక్షమున విక్రమార్కశకము క్రీస్తునకుముందు 56వ సంవత్సరమునఁ బ్రారంభమైనది గనుక కాళిదాసుఁ డిప్పటికి రెండువేల సంవత్సరముల క్రిందటివాఁడై యుండవలెను. కొందఱు పండితులు గుప్తవంశమునందలి ప్రధమ చక్రవర్తియైన చంద్రగుప్త విక్రమాదిత్యుని యాస్థానము నందుఁ గాళిదాసుఁడు కవియై యుండెనని వ్రాయుచున్నారు. అట్లైన నతఁడు క్రీస్తుతరువాత 350వ సంవత్సర ప్రాంతముల నుండవలెను. అనఁగా నిప్పటికి 1600 సంవత్సరములక్రింద నుండియుండవలయును. లోకులు చెప్పుకొనునట్లు కాళిదాసుఁడు భోజరాజు నాస్థానముననే యుండిన పక్షమున భోజరాజు క్రీస్తుతరువాత 1000 సం॥రము మొదలుకొని రమారమి 1050 వఱకు మాళవదేశమును బరిపాలించెను. గావునఁ గాళిదాసమహాకవి యిప్పటి కించుమించుగా 900 ఏండ్ల కింద నుండియుండవలెను. ఇద్దరు కాళిదాసు లున్నారని కొందఱు పండితుల