పుట:హాస్యవల్లరి.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రా - మీ దయవల్ల గ్రామఫోనువాళ్ళు నాచుట్టూ తిరిగి తిరిగి పోతూంటారండి.

ఒ - ఏమాత్రం ఉన్నాయి తమరి రికార్డులు?

రా - రేటు కుదరక నేను ఇవ్వను పొమ్మన్నాను.

ఒ - ఎవ్వరూ అనుకోలేదు! చివరకి నాకూ తెలియదే!

రా - తెలియకపోవచ్చు. “నాకూ” అంటే ఏమిటి అక్కడికి మహా మీరు!

ఒ - నేనా! నేను ఇండియా మొత్తానికి గ్రామఫోను కంపెనీ ఏజెంటుని.

271

కొండయ్య - యాక్టరంటే రాజయ్యే యాక్టరు! రాజు మొదలు ఆఖరికి వెధవముండ వేషమైనాసరే ఒప్పిస్తాడు.

చేన్లు - మరేపాపం. అందులో, విశ్వప్రయత్నమూ చేసి సకలశ్రమా పడతాడు! పడాలికూడానూ!

కొం - వేషాలు వేసుకోడానికా నువ్వంటూంటా?

చే - మరే రాజులాంటి వేషాలు.

272

శాస్త్రిగారు జనాన్ని పోగుచేసి ఒక దొంగని తాచుపాముని పట్టినట్టు బరిమీద పట్టుగుని, కుళ్ళబొడిచి, వాడి కాలిగూడు సడలగొట్టి, వాణ్ణి సాగనంపుతూ,

శా - పశువా! బుద్ధితెచ్చుగు బతుకు! నడు!

దొ - (చచ్చిచెడిలేచి కుంటుంగుంటూ) మరినాకు నడిచే యేత్తులేదండీ!

273

పాలయ్య - బెజవాడ వెళ్ళొచ్చావురా శేషాచలం?

శే - ఆ.

పా - పని?

శే - పనే.

పా - బస?

శే - బంధువులున్నార్లే.

పా - ఎవర్రా!

శే - ఆ! నాకు ఇస్తారనుకోలేదూ!

పా - ఊఁ ఊఁ.

శే - ఆపిల్ల అత్తారు.

274

మెల్లకన్ను రత్నాకరం ఒక గొప్ప రాణివేషంలో ఉండి భర్తృవియోగం అభినయిస్తూ,

రాణి - (విచారంతో) నా నాధుని తిరిగి కాంచు భాగ్యము నాకబ్బునా! హా దైవమా! నాకన్నులెట్టి దౌర్భాగ్యపు కన్నులూ!

ఒక సభ్యుడు - మరే. అందులో ఓటి మెల్లకూడానూ!

ఒక కుర్చీదాసు - సైలెన్సు ప్లీజు!

సభ్యుడు - ఈమాటకి వెనకేసుగు రావడంకూడానా! బాగానే ఉంది గుడ్డిలో మెల్లకి తల్లకిందులు!

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

62

హాస్యవల్లరి