పుట:హాస్యవల్లరి.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కా - ఏమంటాడు?

స - మొన్న మా ముసలమ్మ ఆబ్దీకంట.

కా - అయితే!

స - నేను పెద్దవాణ్ణికాదూ! “నువ్వు అది అక్కడ పెట్టావా లేదా?” అని రాశాడు.

కా - నువ్వు పెట్టావా.

స - ఆ. “నువ్వుక్కడ పెట్టేసిఉండి తీరాలి లేకపోతే వీలు లేదంటుంన్నారు. గ్రహించవలెను.” అనికూడా రాశాడు సూరన్న.

268

ఒక పిల్లవాడితండ్రి ఒక మేష్టర్ని కలుసుగుని,

తం - మావాడు మీవద్ద చెప్పుగుంటున్నాడండి. -

మే - మీ ఇంటిపేరు.

తం - ఆదివారపువారు.

మే - ఒహో మందేశ్వరుడా! మీవాడు! సరే. ఏం? ఇప్పుడూ!

తం - వాడు బహు సుకుమారండి.

మే - అవును పాపం. చాలామంది పిల్లలూ అంతే.

తం - అందులో వీడు మరీనండి, తమరెరగరు. తమరు ఓ ముక్క చెప్పవలసిందేగాని ఏమీ ఇల్లా చెయ్యి వెయ్యాయిస్తుకాదండి వాడి వొంటిమీద!

మే - నిజమేమరీ! నేరం మీవాడిదై తప్పనిసరి వొచ్చినప్పుడు తప్ప.

తం - అప్పుడైనా అంతేనండి.

మే - ఏం? ఎల్లా?

తం - నేరం మావాడిదే అయినా, బళ్ళో ఇంకా ఇతర పిల్లకుంకలు ఉంటారు కాదూ, వాళ్ళల్లో ఒకణ్ణో ఇద్దర్నో పచ్చడి కింద దంచండి, దంచితే మావాడు హడిలిపోయి మళ్ళీ నేరం అన్నమాట చెయ్యడు.

269

హరిశ్చంద్రనాటకం జరుగుతూండగా, దేవయ్య కొంతసేపు జోగుతూ చూసి, ఉలిక్కిపడి పక్కకుర్చీ అయనతో,

దే - ఏమిండీ!

ప - అయ్య!

దే - ఆ పావురాయిలసీను ఇంకారాదేం? ఎగేశారాయేంటీళ్ళు!

ప - తొందర పడకండీ!

దే - తొందరేంటయ్యా! నువ్వూ ఆళ్ళబాపతో, లేకమోతే నీది ఫ్రీ టిక్కంటో

ప - ఉండవయ్యా! ఇందాకా వాటికోసం వెళ్ళిన కుంభకర్ణుణ్ణి రానిస్తావా?

దే - ఎప్పుడు? వొచ్చెల్లాడేం? సెప్పకుండా,

ప - మూడునిమిషాలైంది, వాడొచ్చినా మీకు మెణుకువ లేదు.

దే - అయితే సరే.

270

రావుజీగారి గాత్రపాట పూర్తి అయిన వెంటనే అనేకులు ఆయన్ని అభినందిస్తూండగా,

ఒకశ్రోత - ఆహాహా! ఎన్నాళ్ళకి విన్నామండీ గానం! ఇల్లాంటిపాట ఇండియాలో లేదు.

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

61

హాస్యవల్లరి