పుట:హాస్యవల్లరి.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కామేశ్వరరావుగారి వాక్యాల్లో పదాల తీరు, ఉచ్చారణను బట్టి వుంటుంది. ఈ తీరు వ్యావహారికపు తెలుగును, కొంత వడిగా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి రచనల్లో మాత్రమే చూస్తాం. మాట్లాడేటప్పుడు పదాల ఊనిక (Stress) బట్టి వాక్య నిర్మాణంలో సాగదీత, పదం విరుపు, వుండి - ఉద్దేశించిన భావానికి అదనపు బలాన్ని సమకూరుస్తాయి.

దీనికి తోడు - ఆయన తన పాత్రలకు పెట్టే పేర్లు - వనమయ్య, పనసయ్య, ధనాధన్, మిరియం, అలారం, లక్షారావు, శీనయ్య, పానకాలు, సివాలమ్మ - వంటివి చెప్పే విషయానికి అతికినట్టుంటాయి.

మరొక ముఖ్య విషయం; భమిడిపాటివారి రచనల కాలం, ప్రధానంగా 1920-1945 మధ్య. కనక - ఆ కాలంనాటి తెలుగు వ్యవహారంలోని నుడికారం ఎక్కువ. చాలా వరకు మనుషులు మధ్యతరగతికి చెందినవారైనా - వ్యవసాయం, ఇతర వృత్తులవాళ్లు, క్రింది తరగతివాళ్లు కూడా ప్రముఖంగా కనిపిస్తారు. తూర్పు గోదావరి మాండలికంలో వాడే కొన్ని పదాలు ఇవాళ పాతబడ్డాయి. అయితే - అవి సరఫరా చేసే హాస్యం దొడ్డది.

ప్రస్తుతం ఈ సంపుటంలో - 'కాలక్షేపం' పేరిట భమిడిపాటివారు సంకలనం చేసిన రెండు భాగాల ఛలోక్తులు (Jokes), గుసగుస పెళ్ళి - ఇతర కథల భాగం చేరాయి. కాలక్షేపం-1 అనే గ్రంథం తొలిసారిగా 1928 లో వెలువడగా-కాలక్షేపం-2 అనే గ్రంథం 1948 లో వెలువడింది. 'గుసగుస పెళ్ళి' పేరిట తొమ్మిది కథల సంపుటి తొలిసారి 1945 లో వచ్చింది.

'కాలక్షేపం' ఛలోక్తులు (Jokes) రెండు భాగాలు కలిపి మొత్తం - 480.

స్టూడెంట్ - టీచర్ సంబంధమైనవి, సంగీత సంబంధమైనవి, నాటకాలు - నటుల సంబంధమైనవి, భోజన సంబంధమైనవి, పెళ్లిళ్ల సంబంధమైనవి. వైదిక వృత్తిని, సైనిక సంబంధం గలవి - రకరకాల విన్యాసాలు చదువరిని పలకరించి - దరహాసం నుంచి అట్టహాసం వరకు అలరిస్తాయి.

కథల్లో - ఒక్క “జూదం - బ్రాకెట్” అనేది మినహా - అన్ని హాస్య "ఘన - జటలు” చూపించినవే - "దోమరాజా” అనేది కూడా వేరు తీరు.

భమిడిపాటివారి కథలశైలి “చెప్పే” తరహాది “వ్రాసే” తరహాది కాదు. అంటే, ఎవరైనా హాస్యస్ఫోరకంగా - ఆ - Tonal modulations - అర్థం చేసుకుని “వినిపిస్తే” ఎక్కువ రక్తికడతాయి -

మిగతా రచయితలందరికంటే, హాస్య రచయిత చూపు వేరుగా వుంటుంది. బాణాలు సంధించి విసిరినా, చదువరి గిలగిలలాడుతూనే, కిలకిలమంటాడు.

భమిడిపాటి కామేశ్వరరావుగారు ఈ విద్యలో ద్రోణాచార్యులు.

విశాలాంధ్రవారి పూనికకు నా అభినందనలు.

- ఇంద్రగంటి శ్రీకాంతశర్మ

సికింద్రాబాద్,

02.11.2008, ఆదివారం

v