పుట:హాస్యవల్లరి.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

228

యాచన నిమిత్తం వచ్చిన ఒక అవధాన్లు, రాముడుగారితో,

అ - చూశారూ, పంతులుగారు! మీదయ! ఘనా, జటా, తల్లకిందులుగా కత్తిమీద అప్పగించగలవాణ్ణి.

రా - మచ్చుచూతాం, కేశవనామాలు తల్లకిందులుగా కానీండి ప్రస్తుతం.

అ - (చెప్పలేక, తెల్లపోక) చిత్తం. ముందు తమరు ఏ ఏ నామాలో చెప్పండి, తరవాత వెనకనించి చెబుతాను.

రా - (తెల్లబోతూ) నాదాకా ఎందుకు మావాణ్ణి పిలుస్తానుండండి. అమ్మా ! నాకు నామాలే రావనా?

ఆ - నామాలు రావనికాదు, పంగనామాలు వచ్చుననీ!

229

భోజనాలపందిట్లో పరిషించిన కాస్సేపటికి.

ఒక మొగపెళ్ళివాడు - (హేళనగా) ఈ ఉసిరీపచ్చడి ఏం ఫకడుగా ఉందండీ! నాలిక్కి రాచుకునేసరికి అమాంతంగా జిహ్హ వెనక్కి లాక్కుపోతోంది. ఎందుకు చేసినట్టిదీ?"

ఒక ఆడపెళ్ళివాడు - బహుశా, వడ్డించడానికే అయిఉంటుంది.

230

సామాన్య ప్లీడరైన గిరిశాస్త్రిగారు రాత్రి పదకొండు గంటలకి బయటికి వచ్చి, అరుగుమీద జనం పడుకుని ఉండడం కనిపెట్టి.

గి - ఎవరువారు?

ఒకడు - మేం పార్టీలమండి.

గి - అయ్యో వెఱ్ఱిమొహాలా! నన్ను లేపకపోయారా?

ఒ - వకాల్తానామా ఇవ్వడానికి రాలేదండి.

గి - మరి?

ఒ - అదుగో ఆ యెదురుగుండా ఉన్నాయనికి ఇచ్చేశామండి.

గి - పగలు మీకు కళ్ళు కనిపించి నా బల్ల దుష్టికి రాలేదూ? ఇప్పుడు స్థలంకోసం వచ్చిపడ్డారా? ఛంపేస్తా, లేచిపోరేం? మీ మొహంమండా! కర్రిల్లాతేవే!

231

సోమన్నగారి ఇంట్లో ఆబ్దీకానికి భోక్తలైన వీరయ్యా సుబ్బయ్యా లేచిం తరవాత, పారణ నైవేద్యం పెట్టవలసి, సోమన్న తనభార్యతో,

సో - చూడవే, అరిసిముక్క పట్రా ఓటీ!

భా - అల్లాకాదు, బెల్లంముక్క ఇదిగో, ఉంచండి .

అనగా ఆ ఇచ్చినదానితో ఏదో కానిచ్చి, ఇకబ్రాహ్మలు అక్షతలు పెట్టుగుని వెళ్ళి పోతూండగా, తను అదివరకే ఇంట్లోకి వెళ్ళి, వండిన ఎనభై రెండు ఆరిశెల్లోనూ ఒకటి మాత్రమే వీరయ్యా తతిమ్మా ఎనభై ఒకటి సుబ్బయ్యా తినేసి పారేశారని తెలుసుగుని, సోమన్న, వచ్చి, నడుంకట్టుగుని సుబ్బయ్య పాదాలమీద పడి,

సో - బాబూ! నిన్ను బుద్దితక్కువచేత భోక్తగా ఉండమన్నాను. ఇహ నా జన్మలో పిలవను. అనంతరంగూడా నిన్ను పిలవనని మావాడు ఒట్టు వేసుగోకపోతే నేను పోనేపోను.

సు - మీనాన్న నాలో ప్రవేశించి చూపెట్టిన మహిమకి నన్ను స్తోత్రాలెందుకోయ్, వెర్రివాడా!

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

51

హాస్యవల్లరి