పుట:హాస్యవల్లరి.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

సావిత్రినాటకం ఆడటంలో యమధర్మరాజు ఓపద్యం చదవగా,

ఒకడు - వన్సుమోర్!

పక్కవాడు - ఓయి నీ మొహంమండా, మళ్ళీ ఎందుకయ్యా చదవమనండం? నీమాట పట్టుగుని వాడు ఇందాకటికంటె గట్టిగా పద్యం మళ్ళీ చదివితే, ఇహ అక్కడికి మేమంతా వినవలిసిందే?

155

బల్లకట్టులేని మురుక్కాలవకి అడ్డంపడుతూ,

చంద్రుడు - జాగర్తోయ్! సత్తెన్న శాస్త్రీ!

స - నీ జాగ్రత్త నువ్వుపడుదూ! నాకేమిటీ! నేను గోదావదిలో నాలుగైద్సారులు ఈదిన ముండావాణ్ణి! మొన్న రథసప్తమికి అక్కడేఉన్నా!

చం - అల్లాన్టో య్, చెప్పావుకావేం? అయితే మొన్న రథసప్తమినాటిది ఎన్నో ఈత?

156

నాగయ్యని దవడలెంపకాయ కొట్టినందుకు వెంకట్రామయ్యకి అర్ధరూపాయి జుల్మానా విధించాం అని జడ్జీగారు తీర్పుచెప్పిన ఉత్తరక్షణమే వెంట్రామయ్య వెళ్ళి నాగయ్యని సాగదీసి ఇంకొకటికొట్టగా,

జడ్జి - ఏమిటది?

వెం - రూపాయి, ఇదిగోనండి!

జ - మా సమక్షమందు ఏమిటి అల్లరి?

వెం - ఆల్లరీ లేదండి, చిల్లరీ లేదండి? క్షమించాలి.

157

ఒకశర్మగారు ఒక హైస్కూలికి వెళ్ళి, అక్కడ హెడ్‌మేష్టరుతో,

శ-మిమ్మల్నేనా, హెడ్‌మేష్టరనేది?

హె - అవునండి. కూచోండి. ఏం!

శ - ఏం లేదండి మావాణ్ణి థర్డుఫారంలో జేర్చాలి.

హె - (బల్లమీద ఒక చిన్నకాగితంముక్క చూస్తూ) థర్డుఫారం! సీట్లు లేవండి.

శ- అంటే ఏమిటిబాబూ?

హె - సీటా? సీటంటే కూచునేది.

శ - అదా! తమరు అతిమర్యాదకోసం దేవుళ్ళాడతారుగాని. మావాడికి కూచోడానికి అసనంకూడా ఎందుకండీ? నిక్షేపం అల్లా కిందేకూచుని రాసుగుంటాడూ!

158

భోగయ్య - (కోపంవచ్చి పెళ్ళాంతో) ఛీ ఛీ! వారం రోజులుదాకా నాతో మాట్లాడకూ!

పె - తరవాత నాకు మళ్ళీతప్పదూ?

భో - (మరీకోపంతో) ఛీ ఛీ! నాతో అసలు మాట్లాడకూ.

పె - మాట్లాడకుండా కనిపిస్తూండం కావాలీ మళ్ళాను!

భో - (మండిపడి) అయితే ఏడు కూచుని!

పె - అప్పుడేనా?

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

34

హాస్యవల్లరి