పుట:హాస్యవల్లరి.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

మంగమ్మగారు పక్కింటి వెంకమ్మగారితో,

మం - మామేనమామ పెళ్ళాం వచ్చిందమ్మా మొన్న చూచి వెళ్లడానికీ! ఇల్లా కారప్పూసేనా పట్రాలేదుష్మీ? ఉత్తమనిషి చక్కావచ్చింది.

వెం - అల్లానా! కిందనమాటు మనం మాట్లాడుకోడంలో ఆవిడ ఉత్తమనిషి కాదన్నారు.

141

సత్యభామ - (దొంగ ప్రియుడితో) మనోనాయకా, జీవితేశ్వరా! మీఫోటోగ్రాపు ఓటివ్వరూ నాకూ?

ప్రి - అదెవరేనాచూస్తే నీ దగ్గిర ప్రమాదం కాదూ.

స - ఇంతపిరికివారు ఎల్లాపనికొస్తారండీ! పోనీ, ఫోటోతీసే వాడితో ఫోటో మీకుమల్లే తియ్యద్దని చెబుతాలెండి.

142

బసవన్న - చంద్రంబావోయ్, ఎల్లానూ వెడుతున్నావు గనక, రామారావుని చాలాచాలా అడిగానని చెప్పు, వాణ్ణెరుగుదువా?

చ - ఎరగనోయ్, కర్మం?

శ - సరేలే. పోనీ అల్లాయితే అడగలేదని చెప్పు.

143

పూటుగా పులిహార లాగి, అది మారు తెచ్చినప్పుడు పుచ్చుగోడానికి కాళీ లేదని చెప్పి, తరవాత మళ్ళీ రొండుపుంజీల బూర్లు గుమ్మరించినా కిక్కిరుమనకుండా ఊరుకున్న పున్నయ్యతో."

నాగయ్య - ఇందాకా కాళీ లేదనవుటయ్యా.

పు - సరిసరి. నీకు శరీరశాస్త్రంలో ఓనమాలే తెలియవే!

పొట్టలో పులిహారసంచీ వేరూ, బూర్లకోశం వేరూ!

144

సంయుక్తపరగణాలల్లో ఒక గ్రామస్తుడు తన స్నేహితుడితో ముచ్చటిస్తూ.

ఒక - ఎగేసేవాడికి రోజులు, కాని, విధివిధాయకంగా పని చేసేవాడు ఇప్పట్లో కంట్రకుడు.

స్నే - ఏం జరిగిందేమిటి?

ఒక - మొన్న జనాభా లెక్కల్లో నాకు ఒక చిన్న “బ్లాకు” ఇచ్చారు!

స్నే - ఇస్తే?

ఒక - అది, ఏడింటికి మొదలెడితే, పదినిమిషల్లో పూర్తి అయింది.

సే - అయిపోతే?

ఒక - లెక్కసమాప్తి మరి రాత్రి పన్నెండింటికిగా! ఈ ఈలోపున మరిఎవరేనా నీళ్ళాడేరేమో, లేకపోతే పోయారేమో కనుక్కోవద్దూ? కాని, గర్భిణీవాళ్ళు ఆ బ్లాకులో లేనే లేరు. అదికనుక్కో అక్కర్లేక పోయింది.

స్నే - ఇక ఎవరేనా పోయారేమో అని నువ్వు కనుక్కుంటోచ్చావుగావును!

ఒక - ఓ మాటా? ఎంత సేపటికీ పన్నెండు కాదాయిరి. అయిదుమాట్లు “ఎవరేనా పోయారండీ, ఇక్కడా”? అంటూ కేకేస్తూ తిరిగేటప్పటికి జనానికి నా మీద అసహ్యం పుట్టింది.

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

31

హాస్యవల్లరి