పుట:హాస్యవల్లరి.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సు - హు, ఇప్పుడు కళ్ళుకనబడకపోవడం మామూలైపోయింది. ఏంచేతొచ్చింది నాయనా నీకీ దురవస్థా?

బి - అదివరకు మూగాణ్ణి, అది కిట్టుక ఇల్లా అయాను.

124

భార్య - ఇదిగోనండి! మీకు మల్లెదండ కట్టించాను, బహుమతీగా.

భర్త - దేనికి?

భా - ఈ వాళ తమరు పెళ్ళాడిన రోజుమరీ?

భ - ఒహో, సరె. నువ్వు పెళ్ళాడినరోజు వచ్చినప్పుడు కూడా నాకు కాస్త జ్ఞాపకం చెయ్యేం! యధాశక్తిగా ప్రతిమర్యాద చెయ్యాలి.

125

కారణాంతరంవల్ల కృష్ణారావుగారు నూతిలోపడగా నలుగురూ పోగై, తాళ్ళతో కట్టినతట్ట నూతులోకిదింపి,

ఒకడు - ఇహ తట్టలోకి జేరుకోవయ్యా, పెళ్ళికూతుర్లాగా!

కృ - (నూతులోంచి) ఉండండెహెయ్, మీసిగ్రొయ్యా, ఫొడుం పీల్చుగోవాలి.

126

సుబ్బరాజు - కామోజీ! మన అరుణాచలం దొరలా వేషం వేసి అందరికి షేక్‌హాండు ఇస్తూంటాడూ, వీడి హృదయం ఎలాంటిదోయ్?

కా - మంచిదే!

సు - అయినా?

కా - కాని, షేక్‌హాండు అనంతరం మనవేళ్ళు ఒకమాటు మళ్ళీ లెక్క చూసుగోడం అంతకన్న మంచిది.

127

పంటులు - ఒకటోవాడు! 'సుందరము' అనేమాట వాక్యంలో ఉపయోగించు.

ఒ - “మీ ముఖము సుందరము"

పం - భేష్, రొండోవాడు! నువ్వు 'సుందర తరము' ఉపయోగించి చెప్పు.

రొం - “మీ ముఖము పండుకోతి ముఖముకన్న సుందర తరము”

పం - ఓరి కొండముచ్చు వెధవా! .

128

గుర్రాజుగారు బంట్రోతు కూర్మయ్యతో,

గు - ఒరేయి, నాకు ఆనందంగా ఉన్నప్పుడు జ్ఞాపకం చెయ్యి, జీతం ప్రమోషను చేస్తాను. అని అన్న, వారం రోజులకి కూతురికి చాలా సుస్తీగా ఉండి, ఆ అమ్మాయిని పడుకోపెట్టిన గది వాసనగా ఉండడంవల్ల అగరు పుల్లలు తెమ్మని, చిల్లరలేక రూపాయిచ్చి కూర్మయ్యని పంపగా, కూర్మయ్య 'అగరు' మాట మరిచిపోయి ఓరూపాయి పుల్లలు పట్టించుకు రాగా,

గు - (దీనంగా) హారి! ఇదేమిరా? (అని చిరునవ్వు నవ్వగా)

కూ - చిత్తం! ప్రమోషన్, మహప్రభో!

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

28

హాస్యవల్లరి