పుట:హాస్యవల్లరి.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తల్లి - సంటోడిమీద కేక లెందుకురా ఎదవకొడకా!

పెద్ద - నేనా యెదవకొడుకుని? అడిగోత్తానుండు నాన్ననీ!

101

నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ గుటకలువేసి మునిగి చావడానికి సిద్ధమై గిజగిజా తన్నుకుంటూన్న,

చలమయ్య - బాబోయి - సచ్చాను - గట్టుకి లాగండి - బాబోయి! "

అని ఒక్కొక్కమాటే అంటూండగా, చాలాదూరాన్నించి ఇది చూస్తూ రెండంగల్లో అక్కడికి పరిగెట్టి, తన “కెమిరా” కర్రలు నిలబెడుతూ,

గంగారామ్ - అట్టె ట్టె ట్టె! అల్లానే ఉండు. బాబ్బాబు! ఒక్క చిటిక! కదలకు. వన్, టూ, త్రీ!

102

అయ్యవార్లు - నీకు కాళ్ళెందుకురా, గురవా?

గు - ముల్లు విరిగితేనండీ, తీసుగోడానికండి!

అ - ఛీ! నువ్ రా వెంకన్న!

వెం - గురవడు చెప్పిందండీ, మరేమోనండీ, శుద్దండీ, తప్పండి.

అ - సరే తరవాత!

వెం - బూజసులు తొడుక్కునేందుకు కాదండీ?

అ - ఏడిసినట్టేఉంది. నువ్ రా పాపిగా!

పా - ఏదేనా తొక్కితేనండీ, కడుక్కోడానికండి!

అ - ఓరి అపాత్రుడా! ఎరక్కపోయి అడిగాను. కూచో.

103

గొప్ప వేషంలో ఉన్న ఒక పెద్దమనిషి ఒక కాఫీహోటల్లోకి జొరబడి, కొసిరివేయించుగున్న పెరుగుతో వెరసి ఆరు ఆవడలు పుచ్చుగుని, తరువాత,

పె - ఏమయ్యా, వడ్డించే ఆయన!

వ - (వచ్చి) ఇంకేం కావాలండి!

పె - ఈవేళ చేసిందయితే, ఓఅణా 'వగైరా' పట్రా?!

వ - (చప్పరించి) పోవయ్యా! గడుసుదనం!

పె - బల్లమీద రాసుంటేనే?

వ - అదా అర్థం ? వెళ్లవయ్యా !

పె - అల్లాయితే ఏమిటి నువ్వనేమాట ఏమున్నాయి?

వ - ఇడ్లీఉంది, కాఫీఉంది.

పె - అల్లాచెప్పూ! అల్లాఅయితే, రెండుచేతుల ఇడ్లీ, శేరు కాఫీ పట్రా!

104

బాలుడు - టైం, ఎంతైందండీ, బాబూరావుగారూ!

బా - (బాలుడివీపుమీద ఒక్కటికొట్టి) ఇంతైంది.

బాలుడు - నయమేయింకా. గంటకిందట అడిగానుకాను.

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

23

హాస్యవల్లరి