పుట:హాస్యవల్లరి.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తా - ఇతని పెళ్ళాం పోయినప్పుడు వెధవై, తరువాత ఉంచుకున్న మనిషి పారి పోయినప్పుడు ఒక అర అయాడండి!

62

ఒక స్త్రీ హోరున ఏడుస్తూ పోలీసుస్టేషన్కి వెళ్లి అక్కడి ఇనస్పెక్టరుతో,

స్త్రీ - బాబూ! మా ఆయన మూడు రోజుల కిందట కోపం వచ్చి నూతులో పడతా నన్నాడు. మొన్న తప్పిపోయాడు. కాస్త జాలిదల్చి నూతులూ గోతులూ వెతికించండి.

- మీ ఆయనకి ఆనవాలు చెప్పి వెళ్ళు.

స్త్రీ - మా ఆయనికి ఎడంచెవి చెముడండి.

63

కోరమ్మ - ఎమోయ్, నాంచారెయ్య బావా! మొన్న మనవీధిచివర ఆడవాళ్ళు నిన్ను తిట్టి బుగ్గలొడుస్తున్నారేం? మొగాళ్ళు తన్నుతున్నారేం?

నాం - ఏముంది వదినా! వాళ్ళకి ప్రపంచకపు చరిత్ర తెలియదు. అదీ కర్మదశ!

కో - సరేలే. నువ్వు చేసిందేమిటి అసలు?

నాం - రెండురోజులు వాళ్లపిల్లకేసి దీక్షగాచూసి మూడో రోజున దాన్ని జుట్టట్టుగుని గబగబా మా ఇంటికి ఈడ్చుకుపోదామని యత్నించాను.

కో - ఏం అదేంరోగం నీకూ!

నాం - చెప్పలా! “ఎస్కిమో” దేశంలో ప్రేమ ప్రకటించడం అల్లాగేట

కో - సరేలే. దెబ్బలు నయం అయింతరవాత. ఆదేశం వెళ్ళి ఆపనిచెయ్!

64

కొందరు ఆడంగులు ఒక డబక్కులరావుని యుద్ధం ఎట్లా జరుగుతోందో వర్ణించమని అడగ్గా.

- ప్రస్తుతం ఐరోపా మహాసంగ్రామంలో జర్మనీవాండ్లు లక్షలకొలది రుష్యావాండ్లని ఖైదీలుగా తీసుకుంటున్నారు. కాని, ఆ రుష్యావారు కోట్లకొలది జర్మనీ వారిని లాక్కుపోతున్నారు. ఇల్లా కొన్నాళ్ళకి, జర్మనీ వారంతా రుష్యాలోనూ రుష్యావారంతా జర్మనీలోనూ ఉంటారు. అప్పుడు తమతమ దేశాలకి వెళ్ళిపోయి రావడానికి పునహా పోట్లాట ప్రారంభిస్తారు.

65

ఇద్దరు స్నేహితుల్లో ఒకడు డాక్టరీ ఒకడు ప్లీడరీ ఒక్కమాటే ప్యాసై ప్రాక్టీసు ప్రారంభించగా, కేసు వచ్చేటంత దరిద్రం ఇద్దరికీ పట్టక, చివరకి తల్లి ముగ్గురుచావై డాక్టరికి కేసువస్తే ఆయనవెళ్ళి ఆమట్టున ప్లీడర్ని కాగలించుగుని ఆనందబాష్పాలు ఒలకపోసుగుంటూ,

డా - మిత్రమా కేసోచ్చింది. వెడుతున్నా, ఆ ఆసామీని చూడ్డానికి.

ప్లీ - (ఆదుర్దాగా) ఆ ఆసామీ “విల్లు” రాశాడో లేదో నేనూ వస్తానోయ్!

66

తెలుగు పంతులు - 'పిసినిగొట్టుతనము' ఏ భాషాభాగం? నాలుగోవాడు!

నాలుగో - అవ్యయం.

67

సుబ్బారావు - రత్తయ్యగారూ! ఆ డాక్టరు మీ ఇంటికి వస్తున్నాడు గదా. ఒహొక్క తడవకి ఎంత 'బిల్లు' చేస్తాడు.

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

15

హాస్యవల్లరి