పుట:హాస్యవల్లరి.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొహంలో కులాసా కనపరుస్తూ సవారినాధం వస్తున్నాడు. సవారినాధం ఊళ్ళో పెద్ద హడావిడిదాసూ, చిన్న గ్రంథసాంగుడూ, కొంచెం నాయకుడూ, ప్రతీ విషయంలోనూ తప్పనిసరి పెత్తందారూనూ! విశేషించి నాకు ఓ వేలువిడిచిన పరిచయుడూనూ!

స - ఇదుగో! (అని నన్ను చూసి కనుబొమ్మలూ, దవడలూ ఎగరేశాడు.)

నేను (తల ఎగరేసి నవ్వాను)

స - ఊళ్ళో లేరామిటి? ఈ మధ్య కనపట్టంలేదు!

నే - అబ్బే, ఉన్నా! అమాంతరావు గారింట్లోంచి వస్తున్నారే!

స - అవును, ఆశ్చర్యంగా ఉందా?

నే - మీకూ మీకూ వెనక మాటలు పోయినట్టున్నాయి?

స - ఆఁ. ఎక్కడికి పోతాయి. మళ్ళీ వచ్చేశాయి! అవసరం వెంబడిని వస్తూంటాయి.

నే - పోనీలెండి, అదే కావలిసింది. నాకు సెలవు. వెళ్ళొస్తా.

స - ఉండవయ్యా, ఏకతొందర! నేను పొద్దుణ్ణించి ఎన్నిమైళ్ళు తిరిగానో తెలుసా?

నే - ఓట్లకోసం కాబోలు!

స - కాకపోతే దేనికీ! తెల్లారకట్ట లేచాను, కాఫీ పీల్చాను. రెండు ఊళ్ళెళ్ళి వచ్చి ఈ ఊళ్ళో, ఇంకా ఇంటికేనా వెళ్లకుండా, తిరుగుతూనే ఉన్నాను. ఇంతవరకు మెతుకులులేవు.

నే - అరెరె. వెళ్లి ఎంగిలిపడండి పాపం.

స - అక్కర్లేదు. నిమ్మణంగా వెడదాం. వెళ్లిన పని అవుతూంటే శ్రమ కనిపించదు. రెండుగంటలు కూచుంటే గాని ఓ ఆసామీ ఓటు చేతులో పడలేదు. ఒకప్పుడు అల్లా వస్తూంటుంది.

నే - అమాంతరావు ఓటా?

స - కాదు, సజ్జనరావుది.

నే - అతడు పేచీపెట్టడే! వెళ్లగానే పువ్వుల్లో పెట్టినట్టు ఓటు మూటకట్టి ఇచ్చేస్తాడుగా మొదట అడిగినవాడికీ!

స - అబ్బో, అది వెనక.

నే - అయితే ఏం జేశారూ?

స - ఏముందీ! సజ్జనరావు కూతురికి పెళ్లి సంబంధం కుదరటం లేదు. ఓ ఎక్కా సంబంధం రైటు చేస్తానని అతనికి నచ్చచెప్పి అతని ఓటు లాగేశాను.

నే - వరుణ్ణి ఎల్లా సృష్టి చేస్తారండీ, ఊహా చిత్రమా ఏమిటి?

స - కాదు. నా స్నేహితుడొకడున్నాడు పట్నంలో. అతడి భార్యదగ్గిర లోపాయికారీ అనుమతి మొదట పొంది, ఆవిడికి పబ్లీగ్గా విడాకులిప్పించి, పెళ్ళి అవసరం అతడికి కలిగించి, ఈ సంబంధంలో వచ్చే కట్నం ఆవిడికి పారేయిస్తాను! దానికేం గాని, అమాంతరావుని పడగొట్టడం మరీ కష్టం అయిందిస్మీ!

నే - అదెల్లా సాధించారు?

స - (పత్రిక పైకితీసి) ఈ 'యుగసంధి' సంచికలో ఎవడో మహనీయుడు 'సమాసమీ' అనే మారు పేరుతో రాసిన రచనధర్మమా అని, అతణ్ణి బుట్టలో వేశాను. “గట్టి వాడైతే మాత్రం అస్తమానం ఆ ఒకడేనా గౌరవ పదవిలో ఉండడం! మాట వరసకి చెబుతాను! రేపు మీరోమరీ, మీ వాడోమరీ, తక్కిన వాళ్ళో మరీ, చెబితే బడాయనుకుంటారు, ఎంతచెడ్డా, నేనో మరీ!” అంటూ మాలీసు చేసేసరికి ఓటు నా కిచ్చేస్తానన్నాడు.

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

177

హాస్యవల్లరి