పుట:హాస్యవల్లరి.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రపంచ మరణానికీ, లోకాస్తమయానికి కారణమవుతుంది. ఏమనుకున్నారోగాని! కాబట్టి, పదవులధిష్ఠించిన వ్యక్తులు కొండొకచో మానవ శ్రేయస్సును గురించి ఆలోచన చెయ్యని అటువంటి బాపతు అయినప్పుడు, తక్కిన వాళ్లకేనా లోకశ్రేయోభిలాష ఉండద్దూ! వాగి పదవిలోకి వెళ్లినవాణ్ణి ఇంకా వాగే వాడొచ్చి దింపచ్చుగా! పాడుపన్లు చేసి పదవి పట్టినవాడికి పాడున్నరపన్లవాడు ఉద్వాసన చెప్పచ్చుగా! పోనీ, వేతన పదవులను గురించిన యాతన పై అధికార్లుపడతారు, గౌరవ పదవులు గురించేనా జనం కట్టుదిట్టాలు చేసుగోవద్దూ! పాతవాడే అర్హుడూ, పాతసరుకే గట్టిదీ, పాతదినుసే మేలూ అంటూ కొందరు వోటేశ్వరులు వాదించడం అనేది చాలా కూపస్థంగానూ, మిక్కిలి దేశారిష్టంగానూ పరిణమించి తీరుతుంది. అందువల్ల నేచెప్పేది, అధమం గౌరవ పదవుల్లో నేనా వోటాధిపతులు పాత పైత్య విశేషవాదనలు కట్టి పెట్టి, కళ్లు తెరిచి, దృష్టి నిగిడించి, హృదయ వైశాల్యం పెంచి, మానవ సమత్వం గమనించి, బొడ్డున మాణిక్యం పెట్టుగుని పదవి నిమిత్తం కొందరే పుడతారు గావున - అనే మూఢవిశ్వాసాన్ని నిరసించి రంగు ఫిరాయించి మార్పే పరమావధిగా పెట్టుగుని, క్షణక్షణమూ కొత్త వ్యక్తుల్ని నెలకొల్పుతూండడమే నవనాగరికత, నవజ్ఞానం, నవజీవనం! ఓటయేది, మరోటయేది - ఊహూ- పట్టిగెళ్ళి ఆ వెనకటి ఘటానికే సంక్రమింపజేస్తూ కూచోడం ఎంత తప్పో గ్రహించుకోండి. జీవిస్తే మారాలిగనక, మారిస్తేగాని జీవం కణకణలాడదు. పాత పాతే, కొత్త కొత్తే ఏమనుకున్నారో! కొత్త వ్యక్తిలోనే ఉంది ఏమున్నా! కొత్త పంథా అంటేనే సొగసూ! అబ్బ! కొత్తావకాయ రంజు పుర్రెపోతే మరోదానికి ఉంటుందిటండీ చాదస్తంగానీ! అయ్యో! కావున, ప్రతీ స్థితికీ ఎప్పుడూ పాతవాడేనా! ప్రతీ పదవికీ కలకాలమూ పూర్వవ్యక్తేనా! ప్రతీ అంతస్థుకీ ఎల్లకాలమూ ఆ ఘటమేనా! ప్రతీ అవస్థకీ అస్తమానమూ ఆ స్వరూపమేనా? కాదు, కాదు. ప్రతీదాల్లోనూ ప్రతీకొత్తవాడికీ తరుణం రావాలి! ప్రతీవాడూ చలామణీ కావాలి! అంతా మారాలి! - ఇట్లు, సమా సమీ.”

అనే సారాంశం గల పదాలతో చంద్రభవన వారపత్రికల్లో ఒకటైన 'యుగసంధి' పత్రికలో 'సమాసమీ' గారు ప్రకటించిన వ్యాసం ఊర్ని ఇల్లా ఊపేసింది. ఎక్కడ ఎవరు మాట్టాడినా దీన్ని గురించే. ఎవరు ప్రమాణించినా ఇందులోంచే. ఈ వ్యాసంతో ఊళ్ళో ఉండగల దళసరి జనంలో కూడా సంచలనం కలిగింది, గడ్డ తిరగపడింది, కట్ట తెగడింది. కొత్తదనం ప్రతీ జీవుడిదగ్గిరా ఉండడంవల్ల ప్రతీవాడూ ఈ రచన తన్నే ఆహ్వానిస్తోం దనుకుని. ప్రతీ ఇతరుడి దగ్గిరా పాతదనం కనిపెడుతోచ్చాడు. దీని అర్థం కొంతవరకే అని చాలామందన్నారు. దీని భావం చాలా దూరం వెడుతోందని కనుబొమ లెత్తారు వెయ్యికి ఒకరిద్దరు. ఎంజేస్తాం, అది సత్యంగనక భరించవలసిందే అని ఒకరకం పెద్దలు పెదిమి విరిచి చప్పరించారు. తమకి ఏది చిక్కుగా ఉంటుందో అది మాత్రం అందులో లేదంటూ కొందరు అర్థవాదులు, భావవాదులు, తాత్పర్యవాదులు, వ్యాప్తివాదులు ఇల్లాగా ఊళ్లో వెలిశారు. పోటీలు, పట్టింపులు, పందెం వేసుగోడాలు, ఉక్కురోషాలు, ఉడుకుమోత్తనాలు, అకారణ వైరాలు - ఇల్లాంటివి కూడా ఈరచనవల్ల బయల్దేరాయి.

ఓట్ల కట్నాలు చదివించే రోజు వస్తోందనగా, ఒకనాడు నేను షికారు వెళ్లడానికి బయల్దేరాను. కొన్ని వీథులు దాటి అమాంతరావు ఇంటి ఎదటికి వెళ్ళేసరికి, ఆయింటి మెట్లు ఉత్సాహంగా దిగుతూ, చేతులో ఉన్న పత్రిక మడిచి జేబులో పెట్టుగుంటూ,

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

176

హాస్యవల్లరి