పుట:హాస్యవల్లరి.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సమాసమీ

అప్పట్లో నా మకాం చంద్రభవనం. చంద్రభవనం పదిపద్దానుగు పేటల నగరం - పట్టుమని ఓ మహాబస్తీ కాదు కాని, దానికే పల్లెటూరి నజ్జు వొదిలిపోయిందని తెగేసి చెప్పచ్చు. ఆ నగరానికి చెందిన ఒక సంస్థకి - సరి! - ఎన్నికల కార్తివచ్చింది.

“ఓటరు మహాభాగ్యులారా! ఓటు యుగపుణ్యజనులారా! ఒక మనవి, చిత్తగించండి! ఇదేమీ స్వంతం గురించిన బ్యాండు బాజా కాదు, స్వార్థం గురించిన సరాగనాటకం కాదు. కేవల యధార్థం! అందులోనూ కాసాగా సత్యం! ప్రాణం అంటే ఏమిటో ఇంకా ఫలానా అని తేలకపోతేం గనక, అది ఏశరీరంలో నివసించి ఉంటేంగనక, ప్రాణం యొక్క తూనిక ఒక స్థిరమూల్యం అనే సంగతి స్థిరపడింది. కాబట్టి ప్రాణులు సమం. అందులో మానవులు బహుసమం, తెగసమం. దేవుడు తానొక్కడూ రొట్టి పుచ్చుగుని మానవులకి ముక్క యిస్తాడా? ఎక్కడేనా ఉంటుందా! 'నాతో సరిసమానంగా, నా ఒరవడినే, ప్రతీ మానవ వ్యక్తినీ తయారు చెయించానర్రా' అని, దేవుడు వినేవాళ్లతో వేనోళ్ల గొంతిక చించుకున్నాడు, అందువల్ల కూడా మానవులు సర్వసమం (షరా, స్త్రీలుకూడా మానవుల్లోనే జమ). ఇటువంటి మానవవ్యక్తుల్లో ధనాధికార జ్ఞాన సౌందర్యాలను గురించిన హెచ్చుతగ్గులు అనేవి అల్పుల కల్పనాశిల్పం! అయితే, హెచ్చుతగ్గులు ఎందులోనూ లేవా అని తమరు అడగగల్రు. ఉన్నాయి, ఉండాలి! స్థితులూ, పదవులూ, అంతస్థులూ, అవస్థలూ - ఇటువంటి వాటిల్లో మాత్రమే ఉన్నాయి. పోనీ వీటిల్లోనే అయిరి, ఆ హెచ్చుతగ్గులు ఎందుకండీ ఉండడం? అంటే, ఏవో హెచ్చుతగ్గులు ఉంటూంటే గాని లోకవ్యవహారానికి జరుగుబాటే ఉండక, సర్వమూ స్తంభించిపోయి సృష్టి యావత్తూ వ్యర్థం అయిపోతుందని దేవుడికి చాలా భయం అన్న సంగతి నాబోట్లకి రూఢిగా తెలుసు. అందువల్ల యుగ యుగాంతరాల వరకూ స్థితులు మొదలైన వాటిల్లో హెచ్చుతగ్గులు ఉండి తీరతాయి. ఇక, మానవులు గ్రహించవలసిందేమిటంటే! - ఎవరో కొందరు - కొందరు మాత్రమే లేచి, తగుదుమమ్మా అని చెప్పి, ఆ స్థితుల్ని పదవుల్నీ అధిష్ఠించి మైలురాళ్ళులాగ పాతుకుపోయి బైఠాయించి తిష్ఠ వెయ్యడం అప్రతిష్ఠ, అక్రమం, అమానుషం, అదైవికం!అని. అల్లా జరగడం చాలా శోచనీయం ఏమనుకున్నారో గాని! అటువంటి చోట్లకి చకచకా ఎక్కగలుగుతూండేవాళ్లు వెంట వెంటనే భిడియపడి, త్వరత్వరగా తప్పుగుని సరసరా దిగిపోయి గబగబా వీలైనంతవరకు తండతండాలుగా ఇతరుల్ని బొట్టెట్టి పిల్చి, విడివిడిగా వాళ్ళందరికీకూడా ఓ 'ఛాన్సు' - చమ్కీ ఛాన్సు కాకపోతే పీడాపోయిరి, పోనీ ఓ కుర్చీఛాన్సు, ఓ పంకాఛాన్సు, ఆఖరికి ఓ సంతకంఛాన్సు - ఇస్తూండడం ఎంత సమంజసం! పై చెప్పిన స్థితులూ పదవులూ ఒక వేళ కర్మవశం చేత అష్టకష్టాలూ పడి ఆక్రమించుకోగలిగిన వ్యక్తులు, తమ బోటి తమలాటి తమసాటి తోటి మానవ వ్యక్తులు కోట్లాదిగా వాట్లకోసమే పడగాపులు పడిఉంటారనే గమనింపు ఎంత మాత్రమూ లేక, ఒక్కొక్క పదవికే ఒక్కొక్కడు ఏదో అక్కడికి పెద్ద పుప్తి కట్టిన మొగుడులాగ (-అసలు కొన్ని దేశాల్లో ఇప్పుడు ఏడాది పుస్తెలూ, రెండేళ్ల పుస్తెలూ కూడా తయారవుతున్నాయిట!) నిరంతరంగా అవిచ్చిన్నంగా లంగరు వేసెయ్యడం ఉందే, అది, సంఘ తిరోగమనానికీ,

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

175

హాస్యవల్లరి