పుట:హాస్యవల్లరి.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంకెకీ సాయుజ్యం ఉంటుందేకాని, తాదాత్మ్యం ఉండదే! దాంతో, కనపడని అదృష్టంమీద లాభం లేక, కనపడే అంకెలమీద ఎక్కడలేని కోపం వస్తుంది. వచ్చి వాటిని మాత్రం ఎంజెయ్యనూ! అవీ ఇదివరకే శల్యాలులాగ ఉన్నాయి. ఎదో శాపంతిన్నమీదటే వాటికి వాటి ప్రస్తుతరూపం వచ్చి ఉంటుంది, నేను మళ్ళీ వీటిని శపించడం ఎందుకు? వీటికి శాపం పెట్టి ఆట మానేసిన మా పూర్వసోదరు డొకడు అంకెల్ని ఇల్లా తిట్టాడు! శూన్యం, ఇత్తడిసిబ్బి; ఒకటంకి, చాపలేని కొయ్య; రెండంకి, ఉడత మడత; మూడంకి, మంచం పక్క నాలుగంకి, గోడకుర్చీ; అయిదంకి, వదులుపిలక; ఆరంకి, హాకీకర్రముక్క ఏడంకి, ఒంటిగోడ సిమెంటు బాల్కనీ; ఎనిమిదంకి, అరగ్గానిల్చిన పొత్రం; తొమ్మిదంకి, ముంతకొప్పుసాని. వీట్లమీద కోపం రేగినప్పుడు ఈ వాక్యాలు ఓసారి స్మరిస్తూంటాను.

4. ఓడినా మానలేనివాళ్ళ సమర్థింపులు

కాని, నాకు అసహ్యం వేసిన కాస్సేపు మాత్రం వీటిని అల్లా తిట్టి పోస్తాను గాని, వీటిని వదలగలనా? నా శరీరం నాకు తరుచు అసహ్యం వేస్తూంటుంది, శరీరాన్ని వదలగల్నా? అల్లానే ఇవీనూ! వాటిని జపించగా ఎప్పటికేనా, అవే, నాశ్రమా నాకృషీ నాకాలమూ ఖర్చు కాకుండా నన్ను ఎందుకు గట్టెక్కించకూడదూ! మూటవచ్చి నాఒళ్ళో ఎందుకు పడకూడదూ! ఇచ్చినప్పుడే అనుకోండి, నాకు ఇంత ఘనంగా ఎవరివ్వగల్రు? అందుకని, అంకెలంటే అసహ్యమేకాని అంకద్యూతం అంటే తమాషా! బ్రాకెట్ నెగ్గితే, సొమ్ము అయిపోయిందాకా ఉషార్! బ్రాకెట్ ఓడితే, పోయినసొమ్ము వచ్చేదాకా కసి!! లేనివాడికి బ్రాకెట్ ఆట అవసరం - ఎప్పుడైతేం, నిండెయ్యచ్చు. ఉన్నవాడికి అవసరం ఇంకా ఉంటుంది. ఒకడు జూదంలో ఓడిపోయి పరిగెట్టి పాడుగుళ్ళో దాక్కుని తన్ని పట్టుగోడాని కొచ్చిన తోటిజూదర్లు వెతికీ పట్టుగోలేకపోయి, అతణ్ణి పట్టుగోడం మాట అల్లా ఉంచి, గుడియెదటే జూదం ఆట ప్రారంభించి 'నాది పందెం' 'అంటే నాదిపందెం' అని కొట్టుగుంటూ ఉండగా, ఆ దాక్కున్న ఒకడు తను దాక్కున్న సంగతి మరిచిపోయి, “మీయిద్దరిదీ కాదు, పందెం నాది.” అని కేకలేస్తూ పైకొచ్చేసి పట్టుబడ్డా డని శూద్రకుడు రాసింది స్వభావసిద్ధం కదా!

ద్యూతం సర్వజన వినాశకరం - అన్నాడు కవి! కాని,

“ద్యూతం ఛలయతా మస్మి” అన్నాడు శ్రీకృష్ణుడు - అన్నాడు ఆకవే! ఔర! కవిత్వం మాటల్తో 'జూదం; ఒకే కవివైన పై రెండు అభిప్రాయాలూ ఒక 'బ్రాకెట్'!! -

- జూలై, 1943

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

174

హాస్యవల్లరి