పుట:హాస్యవల్లరి.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుసుగుని దానిమీద లోగడ ఏయే క్లోజింగులు నెగ్గాయో చూసుగుని కాసేవాళ్ళు బ్రాకెట్ వీరుల్లో జమరారనీ, ఉజ్జాయింపుగా ఎనిమిది అంకెలమీద ఎనిమిది క్లోజింగులు బనాయించి ఏ కానికాని చొప్పునో ఆ 64 జతలమీదా కాసి, ఏదోఓటి దగిల్తే పెట్టుబడికి అట్టే దండగ లేదుకదా అని వ్యవహరించే పిసినిగొట్లవల్ల బ్రాకెట్ ఆటకి అప్రతిష్ఠ అనీ, నెగ్గినమర్నాడు 'రివర్స్' ఆడి విశ్రాంతి కోసం తంటాలుపడేవాళ్ళు దమ్ములేని బ్రాకెట్ భీరులనీ, శుక్రవారం మాత్రమే ఆటకి వచ్చి లోగడ నెగ్గిన అంకెల మొత్తాల చివళ్ళు కాసేవాళ్లు బ్రాకెట్ ఆటలో వారాలు చేసుగునేవాళ్ళనీ, ఒకనాటిఆది రెండవనాటి అంతానికీ, మొదటినాటి అంతం రెండవనాటి ఆదికీ కలిపి కాసేవాళ్ళు తిర్యక్కులనీ, ఆస్తీశూన్యం అయినాసరే ప్రారంభించిన అంకె ఏదైతే ఉందో అది కాస్తూండడమే మగతనం అని గ్రహించిన ఏకాంక వ్రతస్థులు కలియుగ నలరాజులనీ, బ్రాకెట్ విషమించగా విషమించగా ఆసుపత్రి దర్శనం చేసే వాళ్ళకి బ్రాకెట్ సంఘాలు పింఛను పంపుతాయనీ, నగలమ్మి బ్రాకెట్ ఆడి బోడులైన పూబోడులకి మంగళహారతి ఇప్పిస్తాననీ, నా రాబోయే డబ్బుతో ఆలిండియా బ్రాకెట్ కేంద్రభవనం నిర్మించటానికి స్థలం దరఖాస్తు చేస్తాననీ, బ్రాకెట్ పాపర్ల గురించి క్షేమనిధి పెడతాననీ కూడా ధారాళంగా తెలిగించి మా ఆవిడతో చెప్పేశాను. మర్నాడు ఫలితాలు వచ్చాయి. ఆ రెండంకెలేకాని, 6 మొదటవచ్చింది, 3 తరవాత వచ్చింది, ఆ అంకెలు క్రమం రైటోకాదో, ఒకవేళ కానిరోజులు గనక టెల్లిగ్రాం తీగెలు తిరగబడ్డాయేమో, అవతలవాడు పుర్రచేత్తో కొట్టాడేమో అని అనుమానించి, పోనీ పేపరుకూడా చూద్దాం అనుకున్నాను. సరి, అదీ అల్లానే ఉంది, వెధవ పేపరుగదే, అనుకున్నాను తీరిపోయింది! కాని ఒక్క బాధమాత్రం పట్టుగుంది. ఒకానొక దిక్కుమాలిన కుంక 3 మీద వంద కాశాట్ట! వాడు నాకంటె అధమాధముడూ, అల్పుడునూ. నేను మిక్కిలి తరుచు ఓడుతూండడం మామూలు గనక నే నీసారి కాసింది కనుక్కుని, వాడు దానికి విరుద్ధక్రమంలో కాసి నెగ్గాడని నాకు తెలిసిన దగ్గర్నించీ నాకు ఒళ్ళు మండిపోతోంది. వాడికి రావలిసిన సొమ్ము వాడికి దక్కకుండా ఉంటే వెంకటేశ్వర్లుకి ఓ శేరు (ఆవునెయ్యి మానేసి - రోజులమహిమని బట్టి) కిరసనాయలు దీపం వెలిగిస్తానని మొక్కుగున్నారు! దాఖలా కనిపించింది. 20 రెట్లు ఇస్తాను అన్న బ్రాకెట్ ఏజంటు తనూ తన రౌడీబలగమూ, తన పెట్టి, తన నిత్యబ్లాకెట్ కొట్టుతోసహా పెనుచీకటిలో అంతర్ధానం అయిపోయాడట! 'ఆరు-మూడు' వాడు మతిపోయి తిరుగుతున్నాడు! నాకు విరుద్ధంగా కాస్తే ఏమవుతుంది మరీ!

3 కృషిచేసి నెగ్గదలచినవాళ్ల నిరాశ

నా బ్రాకెట్ యథాప్రకారంగా పోతూనేఉంది. నా ఆస్తిక్రమేణా క్షీణించింది. అందువల్లే బ్రాకెట్ గతి అయింది. ఆ ఆశే పెరిగిపోయింది. ఏం జేస్తున్నానో నాకే తెలియడం మానేసింది. ఆస్తి ఛీదాగా అంతరించగా, అరువులో పడి అద్వైతంలో పడి

క్లోజింగుమాత్రం 5, లేక 2 లేక శూన్యం వేసి చూశాను, ఆద్యంతాలకి 5 తేడావేసి చూశాను. ఖర్చులో ఖర్చు జ్యోతిష్కులకిచ్చి చూశాను. సలహాదార్లకి కమీషను అడ్వాన్సుగా ఇచ్చిచూశాను. గ్రహచార తిథి, వారాలు గమనించాను. అమావాస్యకి సున్న వేసి చూశాను. పూర్ణచంద్రోదయ సమయంలో 8 ఆడిచూశాను. పిల్లల చేత అంకెలు తీయించి వేస్తోచ్చాను. ఏమట చెయ్యనియ్యండి, ఎంతట తన్ను కోనీండి, నే అన్న అంకెకీ, మర్నాడు వచ్చే

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

173

హాస్యవల్లరి