పుట:హాస్యవల్లరి.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. ప్రజ్ఞ చూపెట్టి నెగ్గదలచినవాళ్ళ గొంతెమ్మ కోరికలు

మొదట్లో ఒకసారి ఇట్టేవెళ్ళి 4 - 7 కాశాను. ఠక్కున నెగ్గాను - గన్ షాట్! కాసింది అర్ధణా. 60 అర్ధణాలు లాగేశాను. నాజన్మాంతరం కాకపోతే ఆ వేళే ఓ వంద రూపాయలు కాసిఉండకూడదూ! మరి తరవాతనించి తిరోగమనమే, అయినా, నాకు భయంలేదు. అటువంటప్పుడు నేను పగలు కనిపించను. కర్మంజాలక నెగ్గితే, డప్పేస్తాను, పతనదార్లకి, ఓడినా నెగ్గినా తేడా క్రమేపీ శూన్యం అవుతుంది. నేను మిక్కిలి తరుచుగా ఓడిపోయినా, నెగ్గే అంకెల జతకూడా పొద్దుణ్ణించీ నేను అనుకునే ఉండి ఉంటాను, అదే కాయాలని స్థిరపరుచుగుని కూడా ఉండి ఉంటాను. ఉంటే, ఎవరో శనిలాగ చక్కావచ్చి (అనగా, మా అమ్మో, నాభార్యో, నా సంతానమో, నానౌఖరో, నా ఇరుగుపొరుగో - అంతా ఒకరు కాసినట్టు తెలియకుండా ఇంకోరు కాస్తారుగాదు మరీ!) నా మనస్సులోని రైటుజత నాచేత మానిపించి, ఎవడో చదువుకున్న ఓ గొప్పవాడు కాసిన జత అంటూ ఓ దిక్కుమాలిన జత పట్టుగొచ్చి, నన్ను డబాయించి నాచేత కుడా అదే కాయింపిస్తారు. మర్నాడు సమిష్టిక్షౌరం - పైపెచ్చు, మాలో మాకు మాటలుకుడా పోవడం!... అట్టెట్టెట్టే!... అదుగో 3 - 6 నన్ను వెక్కిరిస్తోంది, వెనకటి సంగతి జ్ఞప్తికి తెస్తూంది. ఒకసారి భూతద్దంతో 'పాప్' కూడా పరిశోధించి ఆర్జించిన ప్రజ్ఞతో కాశాను, అందులో ఓ కంటితో చూస్తే 3, ఓకంటితో చూస్తే దొరికాయి! నాకు 3 తోచింది! నా పుట్టిన తేదీ అంకెలన్నీ కలిపేశాను, 3 - 9 వచ్చింది! నాకు 3 - 9 మీద భక్తి కుదిరింది. బ్రాకెట్ వేసే తేదీ అంకెలన్నీ కూడేశాను, 33 వచ్చి ఊరుకుంది. సాత్విక రాజస తామసాలు 3 గనక, ఆమూడూ దానికి ఇట్టే కలిపాను, ఠంగున 3 వచ్చింది! ఇంకా, ఆవారంలో నెగ్గిన బ్రాకెట్ల జతలన్నీ కూడి, క్రమం తప్పించగుండా, 3 చేత భాగించి 3 తీసేశాను, 32 వచ్చింది దీని మొహం ఈడ్చా! సరి, దేవుడంటే ఒకటి గనక ఆ ఒక్కటీ చప్పున ఇందులోంచి తీసేసరికి, చిత్రమవుతుంది, 36. ఎవడికోసం - చచ్చినట్టు వచ్చింది. స్థిరపరిచాను. మూడింటికి బయల్దేరి, ఆలస్యంచేస్తూ ఆరుగంటలదాకా నడిచి వెళ్ళి 3 - 6 మీద 36 రూపాయలు కాశాను. పైన చెప్పబడ్డ అన్ని వేరువేరు సంగతులూ ఏకీభవించడం దానంతటదే జరిగింది గనక నాపని మూడు పువ్వులు ఆరుకాయలూ లాగ ఉంటుందన్నాడు ఒక స్నేహితుడు. ఇంకోడు 36 కి 49 రెట్లు ఎంతవుతుందో రొండు పంక్తుల్లో గుణించి, నాకు రాబోయేసొమ్ము లెఖ్ఖ కట్టిపెట్టాడు. కొందరు నన్ను తక్షణం ఐరన్ సేఫ్ కొనెయ్యమన్నారు. ఇంటి కొచ్చేటప్పుడు ఏకంగా ఆపనీ చూడచ్చన్నాను. ఆ రాత్రి ప్రసంగంలో, ఆ రాబోయే డబ్బెట్టి నేను న్యూయార్క్ వెళ్ళి హుజూర్లోనే బ్రాకెట్ ఆడతానన్నాను. మావాళ్ళు (ష.రా? నా భార్య) వద్దన్నారు. 'షటప్' అన్నాను నేను. అని, ప్రపంచంలో నాలాంటి బ్రాకెట్ వీరుల జీవితమరణ చరిత్రలు కనుక్కుని రాసి అచ్చువేయించి బ్రాకెట్ పరాజితులకి ఉచితంగా పంచి పెట్టిస్తా నన్నాను, మావాళ్ళు భుక్తి గడిస్తే చాలన్నారు. 'మరినోరు తెరిస్తే గడవదు' అన్నాను నేను. పైగా నాభార్యకి నగలు చేయించకమాననని ప్రత్యక్షంగా పైకి సత్యప్రమాణికం చేశాను. మావాళ్లు దైవభక్తి ఉంటే చాలన్నారు. అసలు బ్రాకెట్ అంటేనే ద్వైతాద్వైతసారమనీ, పరమాత్మ జీవాత్మ యోగమనీ, ప్రప్రథమంలో అసలు సాంఖ్యయోగం అంటే ఇదే అనీ హడలేసి ఉపన్యసించేసరికి మాఆవిడ నావిజ్ఞానానికి ఏమీ అనలేక కళ్ళు మూసుగుని, తలవంచి, లెంపలేసుగుంది. అయినా నేనాగలేదు. ఓపినింగ్ అంకె

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

172

హాస్యవల్లరి