పుట:హాస్యవల్లరి.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్లోజింగ్ (దినాంతధర అంకె) కాసి రిటైతే పణానికి 8 రెట్లు, (రెండూ) బ్రాకెట్ కాసి రైటైతే 60 రెట్లూ తక్కవ కాకుండా మర్నాడు చేతులోవేసే మధ్యవర్తులుంటారు. పైగా “సమయానుకూలముగా (కట్నపు) రేట్లు హెచ్చింపబడును.” ఒకసారి పట్టింపు వచ్చి బ్రాకెట్‌కి ఓ ఊళ్లో 105 రెట్లు ఇస్తామన్న వాళ్ళున్నారు. రెండువరస రోజుల బ్రాకెట్లు కాసి రైటైతే వెయ్యి రెట్లు ఇస్తారట! వారం రోజుల వరస బ్రాకెట్లు వోమాటే కాసి అవిగనక అన్నీరైటైతే, కాసింది ఎంతైనా సరే, ప్రతిఫలంగా ఇండియా ఇచ్చేస్తాడట ఇక బొంబయి ఏజెంటు! - దాంతో స్వరాజ్యం పూచీ ఒక్కడి చేతిలో పడుతుంది. ఇక, ఒక నెలరోజుల వరస బ్రాకెట్లన్నీ ఒక్క గుక్కనే కాసి, అవన్నీ కాస్తంత రైటైనాయా, నెగ్గినవాడికి భూమిచ్చేసి కొసరుగా భౌముణ్ణికుడా ఇస్తారట!! ఆ దెబ్బతో యుద్ధాలు లొంగిపోతాయి, భౌముడు దాసు డవడంవల్ల. మరేంలేదు, ఇందులో రాబోయే లాభాల లెఖ్ఖలు అల్లా లేచిపోతుంటాయి. ప్రతిదిన ఫలితాలూ మర్నాడు బొంబాయి మీదుగా వచ్చేస్తాయి. ముట్టవలసిన వాళ్ళకి సొమ్ములు సాధారణంగా ముట్టిపోతాయి. అటువంటి అంకద్యూతం ఇంట్లో ప్రాణంమీదికి వచ్చినా, ఎంత చిక్కులో తనున్నా ఆడి, సాధారణంగా నష్టపోయి చెప్పుగోడానికి వీల్లేక గంభీరంగా లోపలలోపల కుళ్లినా అనుభవించి, ఆస్తి అంతా పోగొట్టుకున్న వాడికంటె తన పని నయం గనక ఆట మానలేని బ్రాకెట్ దాసులు రాత్రిం పగళ్లు ఊరూరా బజార్లనిండా దొరుకుతారు. వాళ్ళు తమ జాగ్రత్ స్వప్నావస్థలో బ్రాకెట్లని గురించి ప్రకటిస్తూండే భావాలు వరసని గుచ్చితే, ఈ క్రింది చతుష్కం ఏర్పడుతుంది!

1 కొత్తగా ఓడినవాళ్ళ బెదిరింపులు

హా! నేటి బొంబాయి టెల్లిగ్రామా! నిన్ను తెగ్గోసినా పాపం ఉందా! ఓసీ నేటి ఓపెనింగ్! నీనోరు నొక్కిరి గదే! అయ్యో నేటిక్లోజింగ్! నీకళ్ళు మూసుగుపోయాయా! పోనీ, నేటి ఓ బ్రాకెట్ దంపతులారా! మీది జన్మేనా అని అడుగుతా! విడివిడిగా గాని, జమిలిగాగానీ మీకు సిగ్గులేదే! మీకు 'అరేబియా అంకెలు' అని పేరుండడంవల్లే ఆ అరేబియాదేశం నాటికీ నేటికీ ఎడారిగా ఉండిపోయింది. మీరు ఎల్లానూ సరిగ్గా ఉండరు, పోనీండి. నేటి కాలానికి సున్న అనబడే శూన్యానికి కూడా విడిగా గణ్యత బయల్దేరుతోందే! మీపదిమందీ చేరి నాదశ మారుస్తారుటర్రా! విడిఅంకెలతో పదేపదే పోరినా, అంకె జతలతో శతవిధాల మొత్తుగున్నా, నే కోరినప్పుడు మీదర్శనమే కరువైపోతోందే! నాచోటికి సమీపంలోనే ఉండి, ముందు నాకు ఉషార్ ఇచ్చి, నా ఆస్తి తగులడుతూంటే, మీరు క్షేమంగా తప్పుగుంటారా? ఏక తాపత్రయంతో, రెండోపని మాని, ముప్పొద్దులా, నలుగుర్నీ వాకబు చేస్తూండి, పంచప్రాణాలూ, ఈపనిమీదే పెట్టుగుని, ఆరువారాలూ ఏడ్చి, అష్ట కష్టాలూ పడి, పోనీ చెమటోడ్చకుండా, చిటికెలో నవనిధులూ ఒళ్ళో పడతా యనుకుంటే, సున్నపిడతా నాకు ఎదురుగుండా రావలిసింది!! ఆశకీ, ఫలితానికీ అంత వ్యత్యాసమా! నాకు గనక కోపం వచ్చిందంటే, మీ పదింటికీ దశాహం చేసేసి, గోదావరి ఎండిపోక ముందే మిమ్మల్ని అందులో ఊరదొక్కేస్తాను. ఇహ మిమ్మల్ని ఎవరెంత సంస్కరించినా మీ మచ్చ మాయదు. దాంతో భూమి భూమంతా అసంఖ్యాకం అయిపోతుంది. ఆపళంగా బ్రాకెట్లు ఆడడానికి అంకెలు దొరక్క జనం చచ్చి ఊరుకుంటారు - వాళ్ల లెఖ్ఖ తేల్చడం వీల్లేక ఇంకా పోతారు. ఈసారి నే కాసిన అంకె ఇతరపని మాని వెళ్ళి ఎల్లానో ఆ బొంబాయి టెల్లిగ్రాంలో ఇరుక్కుని మర్నాడు ఈ ఊరొచ్చెయ్యాలి! కబడ్దార్!

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

171

హాస్యవల్లరి