పుట:హాస్యవల్లరి.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లాంటివాళ్ళకి సరిపడ్డ జూదం ఏమీ లేకపోయిందే, వీళ్ళని దింపడం ఎల్లాగా అని గడసర్లు ఆలోచించి, ఆంగ్ల పత్రికలు సాధనంగా, ఆంగ్ల పాండిత్యం నెపంగా ఆంగ్లాక్షరద్యూతం నిర్మించి సాగించారు. వాటిల్లో లాభం అక్షర పథకాలు వేసినవాళ్ళకీ, ఆపథకాలు పడే పత్రికల వాళ్ళకీ, ఆ పథకాలలో వచ్చే అక్షరాలుగల మాటలుండే ఆంగ్ల నిఘంటువులు అమ్మేవాళ్ళకీ! ఇక పోటీదార్లు? ఆంగ్ల పాండిత్యం అందులో ఫలిస్తుంది అనుకునీ, అది జూదం కాదు పాండిత్య పరీక్షే అనుకునీ, ఆ అక్షరాలు తనకి తెలిసినవే గనక తనకోరిక తీర్చకపోతాయా అనుకునీ, ఆ కృషితో ఆంగ్ల సారస్వతాభివృద్ధి అవుతుందనుకునీ, కాలయాపనం అనీ, వ్యసనం అనీ, నాగరికత అనీ, నా యిష్టం అనీ సబబులు చెబుతూ; ఇది పడ్డ పేజితప్ప తక్కిన పేజీల్లో ఏముందో శీర్షిక లేనా చూడనియ్యని కసిలో ఆసంచికలు కొంటూ; ఎన్ని సంభవనీయాలకి తను డబ్బు కాశాడో అనేది పబ్లీకు అయితే తరవాత నామర్దా అని తనే పోస్టాఫీసుకి స్వయంగా వెళ్ళి రహస్యంగా కాస్తూ; ఓడిపోయినప్పుడు తన కామాట ముందే తెలుసునని అర్థంలేని కారణం చెబుతూ, ఒక వేళ కొంతభాగం నెగ్గితే ఆఫలితం ఒకటి మాత్రమే తను కాసినట్టు కోస్తూ; విజయాక్షరం తను వెయ్యకపోయి ఓడినా అదే తను. మొదట వెయ్యనిశ్చయించుగుని మానేశానని సమర్థించుగుంటూ; తన ఓటమి విజయానికి ఎంతో దగ్గిర అని ఆశపడుతూ; చింతాకు వాసిగా నుయ్యి దూకినట్లు పనిచూపెడుతూ; మరణం జీవితాంతంలో జీవితాన్ని స్పృశిస్తుంది గనక మరణించినవాడు సజీవుడికి చాలా దగ్గిరే అనుకోగలిగిన తత్త్వదృష్టితో; ఆంగ్లాక్షరద్యూతం ఆడి, ఓడి, మాడిన ఆంగ్ల విద్యాధికాంధ్రులు దేశంలో తూకంగానే కనిపిస్తారు. ఇంగ్లీషు పత్రికలకి ఈ ఎత్తుతో ధనం కురియడం వల్ల పులిని చూసి నక్కగనక, తెలుగు పత్రికల్లో కూడా ఆంధ్రాక్షరద్యూత పథకాలు పడుతోచ్చాయి, తన్నిమిత్తం నగరాల్లో సంఘాలు లేస్తోచ్చాయి. సరి, కాగితపుకాటకం ఓటి అదనంగా మీద పడగా, ప్రతీ ఆంధ్ర వ్యవహారంలాగే ఆంధ్రాక్షరద్యూతాలు జండా దింపేశాయి. ఈ అక్షరాల్లో కూడా చిక్కుందని మరికొందరు ఆలోచించారు. ఏమంటే, భాష భాషకీ అవి వేరు. పైగా, ఆకాసిని అక్షరాలూ తెలియని వాళ్ళు కోటానకోట్లు, అందువల్ల, భూమిమీద కాస్త జీవం, కాస్త మతీ ఉన్న ప్రతి ద్విపాదుడూ ఆడడానికి తెలిసే ఆట వస్తువులు 'అంకెలు' అని వాళ్ళకి తోచింది అంకెలూ తెలియనివా డుండడు గనక ! అంక ద్యూతం అఖిల భూ వ్యాపారం కాగల చిహ్నాలు వాళ్ళకి కనిపించాయి. వాళ్ళ దూరదృష్టికి అనుగుణంగా ! గమ్యం విశేషదూరం అయినట్టు కనబడకుండా, ఒకటైతే పదోవంతూ, జత అయితే, వందోవంతూ అదృష్టం కలిగి, భూమానవుడికి ప్రతివాడికీ అందుబాటులో ఉంటూ, తెస్తే చాలా ఒకేసారి తెస్తూ, పోతే కొంచెం కొంచెం చొప్పున, కనబడకుండా ఉండే నష్టం కలిగిస్తూ, కష్టం ముష్టి బదులు చేబదులు విక్రయం బహుమానం వంటి ఏబాపతు ఏసొమ్మయినా, ఎంతైనా సరే, ఏ దేహి అయినా సరే కాయడానికి వీళ్ళు కల్పించి, గ్రామాలలోకి కూడా అవతరించిన జూదపాట ప్రస్తుతం 'బ్రాకెట్' ఆట! ఈ అప్రాణి ద్యూతంలో ఆట సాధనాలైన అంకె లేవీ అంటే, న్యూయార్క్ కాటన్ మార్కెట్టులో రాబోయే దినారంభ దినాంత ధరల్ని సూచించే సంఖ్యల ఒకట్ల స్థానంలో వెలవగల అంకెలు! ఆడడానికి అర్హత అక్కర్లేదు, అడ్వాన్సు అవసరం లేదు, ఆటంకం ఉండదు. ఆలస్యం అవదు, పణం కానీ చాలు - చిల్లర దొరక్కపోతే చెప్పలేం కాని! ఓపెనింగ్ (ఆరంభ ధర అంకె) కాసి రిటైతే 6 రెట్లు,

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

170

హాస్యవల్లరి