పుట:హాస్యవల్లరి.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భావికాలంలో జరగడానికి అదృష్టం, అది సంభవించడం ఎన్ని మోస్తర్లుగా జరగవచ్చునో అన్నోవంతు! ఒక గవ్వ విసిరినప్పుడు తిరగపడచ్చు, బోర్లపడచ్చు గనక, ఒకే విసురులో అది తిరగపడడానికి అదృష్టం సగం. పాచిక అనేది పలకల కడ్డీలా ఉండేదనిన్నీ చివళ్ళు శూన్యంగా ఉండి పలకమీద మాత్రం ఒకటి, రెండు, మూడు, నాలుగుచుక్కలో, గుంటలో ఉండేవనిన్నీ ఎవరో చెప్పగా విన్నాను. అందుకని పాచిక విసిరితే అదృష్టం నాలుగోవంతు; నాలుగు ఒకేసారి విసిరితే అదృష్టం 256 వ వంతు. పాశ్చాత్యుల పాచిక విసిరితే అదృష్టం 6వ వంతు, అందుకని, వచ్చిన స్థితిక్రమం మళ్ళీ వెన్వెంటనే ఓ పట్టాన రాకపోవడం, నూతనత్వం యందుండే మానవుల ప్రేమా మార్పుచెంది మరి రాబోయే నవ్యస్థితిక్రమం మనకి అనుగుణంగా ఉండకపోతుందా అని మానవులకి గల ఆశా, ప్రపంచంలో ప్రతీ సంభవమూ ఏదో సూత్రంమీద ఆధారపడి జరిగేటప్పుడు ఇందులో మాత్రం సూత్రం పోనుపోను ఏకాస్తో ఎందుకు దొరక్కపోతుంది, దాని ప్రకారం చేసిన మన ఊహితం ఎందుకు రైటవదు అని ఆలోచించే మానవుల జిజ్ఞాసా, నాకంటె నీచాతినీచుడే అదృష్టవంతుడై నెగ్గినప్పుడు నేను మాత్రం ఎందుకు నెగ్గి చూపించకూడదూ అని మానవుల్లో ఉండగల పైత్యమూ - ఇవి, మానవుణ్ణి ద్యూతరంగంలోకి మోసుగుని వెళ్ళే వాహనాలు. ఆటలన్నింటిలోనూ నూతన స్థితులుంటాయి గాని, పేకలో మిక్కిలిగా ఉంటాయి. చీట్ల పేకలో 52 ముక్కలు వాటి నన్నింటినీ రానిస్తూ, వాటిని కోటాన కోట్ల వరసక్రమాల్లో పెట్టచ్చు. ఒకడు ఆ యాభై రెండు ముక్కలకీ తన యిష్టంవచ్చిన క్రమం ఒకటి ముందు చెప్పి, తరవాత చీట్లపేక తీసుగుని, అవసరం అయినన్ని సార్లు వాటిని కలిపి, సరిగ్గా తను చెప్పిన క్రమంలో అవి ఉండడం చూపిస్తానని పందెం వేశాడట. ముక్కలు బాగాకలిపి చూశాడట. అతనన్న క్రమం రాలేదు. మళ్ళీ కలిపి చూశాడట, రాలేదు. ఇల్లాగ్గా తక్కినవాళ్ళు వెళ్ళిపోయినా, ఒక్కడే కూచుని, నిజాయితీ మనిషి గనక, రోజుకి పది గంటల చొప్పున ఇరవైఏళ్ళు కలిపి చూసి, మొత్తం 65874 సార్లు తంటాలు పడగా, అప్పటికి అతడి జోస్యం ఫలించి అతడు మొదటచెప్పిన క్రమంలో ఆ ముక్కలు కనపడ్డాయిట!

అలాగ్గా, పేకలో ఉన్నంత విరివిగా కాకపోయినా. సంభవించడానికి వీలైన మార్గాలు అనేకంగా ఉండడం పైన సూచించిన ప్రతీ ఆటలోనూ ఉంది. అందువల్లే, ప్రతీ ఆటలోనూ ప్రతీ పోటీదారుకీ నెగ్గడానికి కావలిసిన నలకంత అదృష్టమూ తనలో నివసించడానికి జాగా లోటుండ దాయిరి, దానికి తోడు తన ప్రజ్ఞ ఉందాయిరి అనిపించిగావును, ఊహూ నెగ్గుతాననే ధైర్యంతప్ప, ఓడిపోతానేమోరా అనే అధైర్యం ఎంతమాత్రం చస్తే ఉండదు. కాబట్టి ద్యూతదీపాన్ని జనం వానపురుగులు ముసిరినట్టు ముసురుతారు. జనానికి అంతప్రియం అయింది గనకనే, దేశకాల పాత్రల్ని బట్టి జూదం రూపాంతరం పొందుతుందేగాని, జన్మాంతరంలోకూడా మానవుణ్ణి వదలదు వదిలేటట్టు కనిపించదు. డబ్బూ చదువూ లేనివాళ్ళు ఎందులోనో ఏ గవ్వల్తోనో 'పులిజూదం'తోనో ఇదవుతారూ డబ్బుండి చదువులేని వాళ్ళు ఎందులోనో సొమ్ము కాస్తూనే ఉంటారు. డబ్బుండి చదువూ ఉన్నవాళ్ళు మహానగరాల్లో గుర్రాలమీద కాయడంలాంటి పన్లు చేస్తారు, ఇతరచోట్ల డబ్బెట్టి, అవసరం అయితే తలుపులు మూసుగుని పేకాడతారు, అయితే, డబ్బుండి, చదువుండి, తీరుబడికూడా ఉండి, గ్రామాల్లో కూడా ఉండి, రిటైరైన ఉద్యోగులు

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

169

హాస్యవల్లరి