పుట:హాస్యవల్లరి.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కేటాయింపుసైజు దొరకడానికి పనసయ్య సంతోషించి తనూ సిద్ధం అయాడు, తన పక్కని తను నుంచున్నాడు, పాలేరువాడు తనకి గొడు గట్టాడు. తను ఓరాయి తీసి “కాసుకోండి” అని నిరసనగా దక్షిణానికి విసిరాడు. అది మధ్యగీత దాటకుండా పడింది. వనమయ్య “చెయ్యండి, ఎం జెయ్యగలరో చూస్తాను!” అంటూ ఉత్తరంగా రాయి గిరవటేసరికి అదీ మధ్యగీత దాటకుండానే పడింది. అప్పుడప్పుడు తమ చెమట పాలేర్లు తుడవగా వాళ్ళు కొంతసేపటికి రాళ్ళన్నీ విసిరేశాయి. అవన్నీ మధ్య గీతకి ఎడాపెడా ఎవళ్ళవి వాళ్ళు సహంమేరలోనే గుట్టలులాగా పడ్డాయి. వాళ్ళిద్దరూ ఇంట్లోకి దాహం తాగడానికి వెళ్ళి వచ్చేలోపల పెద్ద సైజురాళ్ళన్నీ వనమయ్య పాలేరూ, చిన్న సైజువి పనసయ్య పాలేరూ తట్టల్లోకి ఎత్తేసి మళ్ళీ తమ తమ యజమాన్ల దగ్గిర హాజరు పెట్టేశారు. రెండో వేటులో వాళ్ళిద్దరూకూడా వడి హెచ్చు చేశారుగాని నేర్పు ఎక్కువ కనబరిచి హద్దుమాత్రం మీరలేదు. ఇంకా జోరుగా విసురుగోడానికి మూడోమాటు తయారవుతూండగా, జనంలో కలకలం బయల్దేరింది. తాళ్ళమెరక గ్రామపు మునసబు కరణాలు ఇద్దరూ వచ్చిపడ్డారు. వనమయ్య పనసయ్యలకి యుద్ధం జరుగుతోందని తెలిసి లోకకల్యాణం నిమిత్తం వాళ్ళిద్దర్నీ నిరాయుధుల్ని చేసి, పోలీసులకి తెలియకుండా కట్టుదిట్టంజేసి వెళ్ళడానికి వాళ్ళొచ్చారు. ఒకర్ని ఒకరు నరుక్కుంటారనే భయం చొప్పున కత్తికటార్లూ, ఒకర్ని ఒకరు తగలబెట్టుగుంటారనే భీతి చొప్పున చమురు తైలాలూ ఇచ్చెయ్యమన్నారు. వాళ్ళు తమర్ని ఒకవేళ ఇంకా దగా చేస్తారేమో అని పెద్ద సూదంటురాయి తాడుకి కట్టి రెండు కొంపల్లోనూ గిరగిరా తిప్పారు, దాంతో సూదులూ, చాకులూ, కొడవళ్ళూ లాంటివి టపీమని వచ్చి దానికి అంటుగుపోయాయి. గడ్డపారలు కూడా నాట్యం ప్రారంభించాయి. ఆరీతిగా అన్నీ లాగేసి, “స్పంజి” లు గిరవటేసి నూనెలన్నీ పీల్చేశారు. ఎవరూ కూడా అగ్గిపెట్టెలూ మతాబాలూ వంటి బాణసంచా స్వాధీనంలో ఉంచుగోకూడదనిన్నీ, ఒకడంటూ వెళ్లి వాటిని పేల్చకపోయినా స్వయంగానే పేలగల సత్తా వాటి కుందిగనక వాటిని వీలైనంత త్వరలో తగలెయ్యడం మంచిది గనక ఎవడి వాటాలో మాత్రం వాడు మతాబా కాల్చినా నేరంకిందికి రాదనిన్నీ అనేసి, మామూలు మర్యాదలు పొంది, కొంచెం నిమ్మణించారు.

దుర్ముహూర్తం వెళ్ళినట్టేనా అని పసనయ్య వాకబు చేశాడు. తను అన్నంతపనీ చెయ్యడానికి టైం అయిందన్నాడు. ముందు వనమయ్యవేపు సగంభూమీ ఖాళీ చెయ్యాలని కబురంపించాడు. “నువ్వెం జెయ్యగలవో చూద్దాం, అదేపోయిరి అనిగాని భయపడి కాదు” అని సమాధానం పంపించి వెంటనే వనమయ్య తనపక్క ఖాళీచేశాడు, ఒక అరక కట్టి తోలుకు రమ్మని పనసయ్య ఒక పాలేర్ని అంపి ఈలోపులో ఓ చాకింటి ఇస్త్రీమడత పంచ విరిచి కట్టుగుని, ఆఫారం తొడిగి చేతులు ఎగసం దోసి, మీసాలుపోగుచేసి వడేసి, గిరజాలు దువ్వి, పైన ముచ్చటముడి రానిచ్చి, చెప్పులు తొడుక్కుని, చుట్టకాలుస్తూ కయ్యానికి సర్వసిద్ధం అయాడు, వనమయ్య లంగోటీబిగించి, పులిపిరిపంచె కట్టి, గ్లాస్గో షర్టు వేసి తాంబూలం నముల్తూ కళ్ళజోడు తుడుస్తూ, తనవేపున తిరుగుతూ ఉన్నాడు. పనసయ్య పాలేరు ఓ గొడ్డుగేదెనీ, ఓ దున్ననీ పూన్చి అరక తోలుకొచ్చాడు. అది కొంచెం పైన సమతలంగా ఉన్న చోట నిలప వలిసిందని అంటూ, పనసయ్య వాణ్ణి హెచ్చరించి, ఆ చోటు చూపించాడు. చేతులో గొడుగు ఇటూ అటూ ఊగడంవల్ల దున్నా గేదీకూడా

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

165

హాస్యవల్లరి