పుట:హాస్యవల్లరి.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రక్తిగా లేదనిన్నీ, ఆకళ అంతగా తెలియనివాళ్ళు నేర్పర్లని నియమించుగుంటే బాగుంటుందనిన్నీ తీర్చారు. రాత్రి రెండో ఝాం వేళదాకా పనసయ్యని తిట్టగలందులకు నలుగురు జనానికి మనిషికి పావలా చొప్పున ఇవ్వడానికి వనమయ్య ఒప్పుగున్నాడు. తనికిగూడా ఓనలుగురు తిట్ల రాయుళ్ళని మాట్టాడి పెట్టమనిన్నీ, మొత్తం ఆజట్టు ఎనమండుగురు అవుతారు గనక రేటు మూడణాలకి ఒప్పించమనిన్నీ పనసయ్యకోరాడు. ఆప్రకారం వాళ్ళు రాగా, గృహమధ్యరేఖవెంట నాలుగు ఇలాయిలు పాతి, నలుగుర్ని ఒకయింటివేపూ, వాళ్ళవేపులకి జేర్లబడే టట్టున్నూ రెండో యింటివేపు ఉండేటట్టున్నూ తక్కిన నలుగురినిన్నీ కూచో పెట్టారు. వాళ్లు తమ చాతుర్యం చూపిస్తూ అర్ధరాత్రివరకూ అరుస్తూనే ఉన్నారు. వాళ్ళు తమకి సొమ్ము ఎవరిస్తున్నారో వాళ్ళనే తిట్టేసెయ్యకుండా కాయడానికి పాలేళ్ళని నియమించారు. వనమయ్య వచ్చి తనవాళ్ళని మరోటి కోరాడు. వాళ్ళు పనసయ్య పోయినట్టు ఉదయందాకా రాగాలు పెట్టాలంటే ఏంపుచ్చుగుంటారని అడిగాడు. అది ఆరుబయట వ్యాపారం గనక మనిషి ఒకటికి రూపాయికి తగ్గితే వాళ్లు కిట్టదన్నారు. ఆకాటికే వాళ్ళని అతను పురమాయించగా, తక్కిన నలుగుర్నీ వెంటనే వనమయ్య పోయినట్టు ఏడవడానికి పనసయ్య ఆరేటుకే బెత్తాయించాడు. వాళ్ళు ఉదయం వరకూ శోకన్నాలయుద్ధం దిగ్విజయంగా కానిచ్చారు. తాళ్ళమెరక వగైరాలనించి వచ్చిన శ్రోతలకి పడుకోడానికి చాపలు సప్లయిచేసి రయితులిద్దరూ సన్మానంచేశారు. ఉదయం లగాయతు కదనం తీవ్రం కావచ్చునని అంతా ఆశించారు. కాలవ దక్షిణపు వాలుగా వెడుతుంది గనక వనమయ్యకి, అతని వెధవ అక్క చెవులో ఊదింది. పనసయ్య ఉదయం లోపున పాలేళ్ళని నియమించి ప్రశస్తమైన కశ్మలం తెప్పించి, రాయి కట్టించి కాలవలో మధ్యగా, తనరేవుకి కొంచెం దక్షిణంగా వదిలిపెట్టించాడు. ఆ హడావిడిలో కొందరికి మెలుకువ వచ్చి లేచి “ఏమిటీ ఏమిటి” అని ఆ విసిరే వాళ్లని అడిగారు. “వనమయ్య పుట్టి మునిగిపోయింది” అని వాళ్లనేశారు. దాంతోటి వనమయ్య కుటుంబానికి కొంచెం కష్టం అనిపించింది. తల్లి సలహామీద వనమయ్య ఓకుక్క కళేబరాన్ని తెప్పించి తన యింటికి ఉత్తరాన్ని తగలేయించాడు. గాలి దక్షిణాన్నించి ఉత్తరానికి వీస్తూండడం వల్ల వాయుప్రమాదం తెచ్చిపెట్టి వనమయ్య పనసయ్యని విసిరి కొట్టదల్చుగున్నాడనే మాట పుట్టింది. ఆహోమధూమాలు అయిపోయేవరకూ పనసయ్య కుటుంబం తలుపువేసుగుని ఇంటోపడిఉండి తరవాతే బయటి కొచ్చారు. ఈలోపులో వనమయ్య పాలేళ్ళని పంపి రెండు తట్టల రాయి తెప్పించి తన ఉత్తరపు గోడదగ్గిరపెట్టించాడు. ఉదయం అయింది.

వనమయ్య చల్ది ఆరగించి, బట్టలు వేసుగుని, గొడుగు వేసుగుని, తన గోడదగ్గిర నుంచుని, సకిలించి, పనసయ్యతో శిలాయుద్ధం చెయ్యడానికి తట్టలు తనకి దగ్గరగా పెట్టమని పాలేళ్ళని కసిరి రాళ్ళకేసి చూశాడు. ఒక తట్టలోవి అంగుళంన్నర సైజువి, ఇంకో తట్టలోవి అంగుళం సైజువి అలా వ్యత్యాసంగా ఉండడం శత్రువుకి లాభకరంగా ఉంటుందేమో అని భయపడి, అతడు చిన్నతట్ట ఒక పాలేరు నెట్టి కెత్తి అవిచ్చేసి పెద్దసైజువే తెచ్చి పెట్టమన్నాడు. వాడూ పది బారలు సాగేసరికి పనసయ్యకి ఈ సంగతి తెలిసి అతడు చిన్నసైజు రాళ్ళు తనకి కావాలని వాడితో చెప్పి ఖరీదూ, కూలీ చేతులో వేసేసేసరికి వాడు ఆతట్ట పనసయ్యవేపు గుమ్మరించాడు. అంత కలిసొచ్చేటప్పుడు, ఒక తట్ట తనకి చాలనీ, రెండోది అనవసరమనీ చెప్పి వనమయ్య మనిషివాణ్ణి ఉండి పొమ్మన్నాడు. తన

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

164

హాస్యవల్లరి