పుట:హాస్యవల్లరి.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రూపాయిలిచ్చి పత్రికలో వేయించాను. వాడు పుస్తకం చేశాడు. నేను ఓడిచేత రాయించి వాడికి అయిదు రూపాయిలిచ్చి, నాకర్తృత్వం దానికి పెట్టించాను.

కాని, కొనడానికి వీల్లేని వస్తువులు కొన్ని కొన్ని వాడికి సంక్రమిస్తూ ఉండేవి. నేను ఒకటోరకమైన ప్రజ్ఞగల వాణ్ణి గనక ఒక్కొక్క వడిసుట్టే దాటేవాణ్ణి. వాడికి ఉద్యోగం ఉందిలెండి, వాడల్లా అనుకుంటున్నాడుగాని, వాడి ఉద్యొగమూ నా దగ్గిరున్న గుడ్డిగవ్వా సమానం! ఓ నాడు వాడి అధికారిగారి రొండుగుర్రాల 'సారటు' ముష్టెత్తి దానిమీద తనింటికివచ్చి వాడు దిగడం నాకు తెలిసింది. తనంతటి ఉత్తమురాలికి జీవితేశ్వరుణ్ణి అయిన నేనుకూడా అల్లా రావడం చూసినప్పుడుగాని తనకళ్లు చల్లగా ఉండవని మా యింట్లోది ప్రతిజ్ఞపట్టింది. ఊళ్ళో అల్లాంటి 'కోచి' మరోటిలేదు, పోనీ రెండు విడి గుర్రాల్ని మాట్లాడి, వాట్లమీద ఓ చెక్కపడేసి, దానమీద వచ్చి, మాయింటియెదట దిగెయ్యచ్చు, ఏవడేనా ఇదేమిటని నవ్వితే, ఓరికుంకా, రెండు గుర్రాల బళ్ళు అనేక రకాలురా అని బుకాయించవచ్చు, అనుకుంటే, అంత సమం నడక గుర్రాలు దొరకవండి, ఏ మాత్రం విషమంగా నడిచినా చిక్కు, అని గుర్రాలవాళ్ళన్నారు. అందుకని, ఆ అధికారింటికే దొడ్డిదార్ని నేనూ వెళ్ళి, ఆ బండితోలేవాడి చేతిలో ఓ పాత బేడ పెట్టి, ఆ బండి అధికారిగారికోసం వెళ్లేటప్పుడు మావీధిలోంచి పోనిమ్మని వాణ్ణి ఆజ్ఞాపించాను. వాడు అల్లా చేశాడు గాని నన్ను వెనకాల ఉండే బల్లచెక్క మీద కూచో పెట్టాడు. అక్కణ్ణించే దిగాను. దొంగతనంగా కొందరు పిల్లలు బోలపడుకునీ కొందరు కూచునీ వెడుతూండే చోటుట అది. ఆ పళంగా, మిరియమ్మ, ఒళ్లు తిప్పుగుంటూ, చేతులు గిరవటేస్తూ, కళ్ళు మిటగరిస్తూ, “అదేమిటీ! మీ వారు అక్కణ్ణించి దిగారేమిటి?” అంటూ ఈసడించి మాట్టాడిందిట! మా ఆవిడ మళ్ళీ రాగాలెట్టి, తనముచ్చట్లన్నీ అల్లానే ముక్కలైపోతున్నాయని కుములిపోయింది. బండీతోలే వాడికి సన్నిహితంగా పృష్ఠభాగంలో కూచోడంకంటే వెనకాల హాయిమంటూ గాలేస్తూండేచోట కూచోడంలో నామర్దాలేదు పోదూ అని తెగేసి ఈ మాటు మిరియమ్మకి సమాధానం చెప్తే సరి అని మా ఆవిణ్ణి సమదాయించాను. ఏదో వోటి వస్తూనే ఉంది. గుండయ్యగాడికి విందుపిలుపు గురించి ఓ కార్డు వచ్చింది, నే యింటోలేను. అరుంధతిలాంటి రోషవంతురాలు గనక శిరచ్చేదం అయినట్టు అయి మా ఆవిడ నే రాగానే ఆమాట నాతో చెప్పింది. పిలిచినవా రెవరో తెలియదాయిరి. అయినా మర్నాడు కొంచెం కాళ్ళు అరిగేటట్టు తిరిగి, వయనం దొరక్క ఇది పనికాదని చెప్పేసి, ఆచీట్లు అచ్చుకొట్టిన ప్రెస్సు పట్టుగుని, అక్కడ అటువంటి చీటీ ఒకటి ఓ కాఫీ ఖర్చు పారేసి సంపాదించి, దానిమీద నా పేరు నేనే ఎడంచేత్తో రాసుగుని పట్టిగెళ్ళి నా భార్యకి చూపించి, ఆవిడ యొక్క బాధ తొలగించి, ఆవిడకి ఆనందం కలిగించి, అది జేబులో పెట్టుగుని భోజనానికి వెళ్ళి తరద్దీగా ఉన్నప్పుడు లోపల ప్రవేశించాను. గుండయ్య యత్నాలన్నీ మమ్మల్ని కొంచపరుద్దాం అనే. అందుకనే వాడికి తెగ సప్లయిలు అవుతాయి యింటికి. ఓ మాటు ఓ పల్లెటూర్నించి వాడికి గేద్దూడలాంటి పనసపండూనూ నిలువెత్తు తెల్లచెక్కర కేళీ గెలానూ వచ్చాయిట. కాని, వాళ్ళపుణ్యమా అని, ఆ సమయానికి మిరియమ్మా వాళ్ళూ ఎక్కడికో భోయినాని కెళ్ళారట. చూస్తూ చూస్తూ అంతంత పసందైన ఫలాలు చెయిదాటపెట్టుగుంటే ఏం పాపం మెడకి చుట్టేసుగుంటుందో అని మా ఆవిడ భయపడుతూ “ఎవరికి” అని పట్టుగొచ్చిన వాణ్ణి అడిగిందట. వాడు - గుండయ్య అన్లేక గావును -

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

160

హాస్యవల్లరి