పుట:హాస్యవల్లరి.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జీభూతంలాఉంది. ఆ డ్రైవరు తెలివి ఏమిటోగాని, కారు, వెనక్కీ ముందుకీకూడా నడిచింది. అది ఒక్కొక్కసారి కప్పలా దాటేది. ఒక్కొక్కసారి పీతలా నడిచేది. ఉండి ఉండి పొట్టేలులాగ ఉన్నచోటే గిజగిజా కొట్టుకునేది. నేను పచ్చడైపోయాను. పచ్చడీ మెతుకులూ నోట్టోకొచ్చాయి. రోగిమాట అల్లా ఉండగా నా నడుం విరిగేటట్టు కనపడింది. రోగి, ఏక మూలగడం, కుయ్యడం, అరవడం, ఏడవడం, ఓమాటు రోగిడ్రైవరుమీదికి ఒరిగాడు, మళ్ళీయథాస్థానంలో పడ్డాడు. మరోమాటు, మేం యిద్దరం డ్రైవరుమీద పడి వెనక్కొచ్చాం. ఇంతలో నేనున్నవేపు గాడిలోదిగడి రోగివచ్చి నా పొట్టమీదపడ్డాడు. పడ్డవాడు ఊరుకోకూడదూ, రోగమా? బాబో, బాబో' అని ఏడుపు. ఆ పళంగా అతడు అసలుచోటి కెళ్ళి పడేటట్టు ఒక్కగెంటుగెంటాను. మరి కాస్సేపట్లో రోగి వేపు చక్రాలు రొంపిలాంటిదాల్లో కూరుకుపోయేసరికి డ్రైవరు 'గేరు' మీద కార్ని లాగించాడు. దాంతో నే నున్న వేపు పైకి లేచిపోయి, నేవెళ్ళి అమాంతంగా రోగిమీద పడ్డాను. కారు బోల్తావేసింది. రోగి 'చచ్చాను, చచ్చాను, నీతాడు తెగా, నామీద పడకురోయ్' అని గోల, నాశక్యమా? డ్రైవరు జాగర్తపడి ముందే దూకేశాడు. చాలామందిజనం పోగై నన్నూ రోగినీ పైకితీశారు. ఈ గలభాలో నాకు మోకాళ్ళూ మోచేతులూ కొంచెం కొట్టుగుపోయాయి. కాని, ఆరోగినడుం బాగుపడి నిట్రాడులా అయి ఊరుకుంది, వీడి అదృష్టంకాలా! అతడు 'అమ్మయ్య' అనుకుంటూ సాగి వెళ్ళిపోబోయాడు. 'నా బహుమతీ నాకిచ్చెయ్యండీ' అని నే నడిగాను. 'నువ్వుకుదిర్చిందేమిటి? ఇంటికెళ్లి ఇచ్చేస్తాలే” అన్నాడు. తన డ్రైవింగు మహత్యం వల్ల ఆయనకి నడుం కుదిరింది గనక, బహుమతీ ఛీదాగా తనకే రావలిసి ఉంటుందని డ్రైవరు మొదలెట్టి నన్ను అటకాయించాడు. నేను కొంచెం తెల్లపోయి ఆగిపోయాను. ఆ స్థలానికి ఒకవేపున ఇల్లుగల కూచయ్య తనయింటి యెదుట లక్షారావు నడుం కుదిరింది గనక తనకే ఆ బహుమతీ రావా లన్నాడు. రెండోవేపు కాపరం ఉన్న మాచయ్య వచ్చి, తన యింటికి కూడా ఆస్థలం యెట్ట యెదటిదే గనక, తనకి చెరిసహమేనా వాటా ఉండాలన్నాడు, దాంతో, కూచయ్య, లక్షారావు తనయిల్లున్న పక్కనే కార్లో కూచుని ఉండడంవల్ల తనకే యావత్తు బహుమతిగాని, మాచయ్యకి పూచికపుల్లేనా వెళ్ళకూడ దన్నాడు. ఆస్థలం పేరుకి కూచయ్య వేపుదైనా, పగలు తనపిల్లలూ రాత్రి తన పెద్దలూ బాహ్వానికి భుక్త పరుచుగుంటూండడంవల్ల తనదే బహుమతీ అని మాచయ్య కేకలేశాడు. అక్కణ్ణించి ఓ పోలీసు “బీటు” కనిస్టీవు వచ్చి, ఆరోడ్డు అక్కణ్ణించి ఎడాపెడా వందగజాలు తనదేగనక, తనకే బహుమతీ రావాలన్నాడు. వెంటనే, ఎక్కడ తెలిసిందో, వెనక ఆరోడ్డు వేయించిన కంట్రాక్టరు వచ్చి, 'అయ్యా!' ఈ రోడ్డు ఇంతమహత్యం గలిగి ఉండేటట్టు తయారు చేయించింది నేను. ఇల్లా రోడ్డులేకుండా ఉంటే కారు ఇన్ని పిల్లిమంత్రాలు వేసి ఉండదు. అది అల్లావేసి ఉండకపోతే, మీకు నడుం కుదిరి ఉండదు. అందుకని బహుమతీ నాది' అన్నాడు. ఆరోడ్డు స్వయంగా తవ్విచేసిన వాళ్ళిచ్చి తమకీ బహుమతీలో వాటా ఉందన్నారు. కాస్సేపటికి బస్తీపాలక సంఘంవారు మనుషుల్ని పంపి, రోడ్డు తమదేగనక బహుమతీ తమదే అన్నారు. ఇది పబ్లీగ్గా జరిగిన పనిగనక, డీ.పీ. డబ్లుయూ వారు రాకుండా ఉంటారా అనికొంద రన్నారు. ఈ లోపల కొందరు బోర్డువారికీ, ప్రభుత్వానికీ, చక్రవర్తికీ టెల్లిగ్రాపులు కొట్టి వార్నొచ్చి బహుమతికోసం దెబ్బలాడమని సలహాయిస్తాం అన్నారు. ఈ దెబ్బలాటలో లక్షారావు చాలా దూరం వెళ్ళిపోయాడు. నన్ను కదల్నీకుండా

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

154

హాస్యవల్లరి