పుట:హాస్యవల్లరి.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రో - ఇంక మరేమీ తెలియవు కద, ఇన్నింటి తాలూకు పథ్యాలూ చెయ్యాలేమో?

నే - నాకు 'లక్ష్మీపతీ' 'వనస్పతీ' తెలుసు, ఎలెక్ట్రోపతీ' తెలుసు. కొన్ని చోట్ల దాన్ని 'న్యాపతీ' అని కూడా అంటున్నారు.

రో - అయితే మీరు ఎక్కువ ఇష్టంగా వాడేరకం ఏది!

నే - నాది 'బృహస్పతీ' వైద్యం అంటాను.

రో - అంటే?

నే - మిక్కిలి గొప్పది.

రో - సరే. మీరు గుమాస్తాగారికి అడ్వాన్సు చెల్లించండి.

నే - ధరావతు ముట్టినట్టు రసీదు రాసి యిప్పించండి. కుదరడంతోటే నా బహుమతీ నాకు స్వాధీనపరిచే అంగీకారంతో కాగితం కూడా నాకు పారేయించండి. నేను ఈ వేళే ప్రారంభిస్తాను.

రో - ఇన్నాళ్ళకి నాకు ధైర్యంవచ్చింది. సరే, మీరు భోజనం చేసుగునిరండి. వైద్యానికి ఇక్కడ బాగుండేటట్టు లేదు. ఆవతల వీధులో నామేడ మరోటి ఖాళీగా ఉంది. నేను అక్కడికి మారతాను. వసతి మారుస్తే రోగం సహంమట్టుకు తమాయిస్తుందని శాస్త్రం. మీరు దగ్గరుండి, నన్ను ఎల్లాగో జాగర్తగా కార్లోకి ఎక్కించాలి. కారు సున్నితంగా నడవాలి. ముందు కోట దాకా వెళ్ళిరావాలి.

నే - కోట ఏమిటి?

రో - ఈ ఊళ్ళో కచేరీలన్నీ ఉండే చోటు.

నే - అక్కడి కెందుకూ?

రో - ఈ వేళ కోర్టులో వాయిదా ఉంది. ఆ తరవాత నన్ను ఎల్లానో ఆమేడలో దింపాలి.

నే - సరే లెండి. వస్తాను.

అని నేను వచ్చేస్తూంటే గుమాస్తా, దేవతార్చనకి నన్ను తన యింటికే లాక్కెళ్ళాడు. ఎక్కడి కక్కడికే అనుకుని, నేను రానని బెట్టు చెయ్యలేదు, భోజనం అయివచ్చాం. ఆయన్ని ఆపళంగానే ఒక బల్లచెక్కమీదికి జరిపి ఆ బల్లచెక్క పళంగానే ఆయన్ని కార్లో ప్రతిష్ఠించాం. ఆరోజున కారుడ్రైవరు కార్యాంతరంమీద వెడతానని సెలవు అడిగితే లేదన్నారట, కొరకొర లాడిపోతూ ఉన్నాడు. నేను ఎదటికెళ్ళి డ్రైవరుపక్క కూచోబోయాను. అతడు నన్ను వెనక్కివెళ్లి దయచెయ్యమన్నాడు. అధికారవర్గంలో వాళ్లు కిరాయి బస్సుడ్రైవర్లని బెదిరించి, వాళ్ళచేత బస్సులు ఖాళీ చేయించి, స్వంతపనిమీద ఫ్రీగా ఎక్కినప్పుడు వాళ్ళకి సరియైన సమ్మానం జరగడానికి డ్రైవర్లు వాళ్ళని వీలైనంత వెనకే కూచో పెడతారులే.

కారు బయల్దేరేటప్పుడే పెద్ద సింహగర్జన చేసింది. డ్రైవరు వాలకం చూస్తే అతడేదో అవాంతరం తెచ్చి పెట్టేటట్టు కనపడింది. నిమిట్లో పెద్దరోడ్డుమీంచి తప్పుగుని కారుపక్క వీథిలో పడింది. అది సందులా ఉన్నా పసందుగా కూడా ఉంది. వెనక కతకలపోటీలో ఒకరోడ్డుకి మట్టి 'షీల్డు' బహుమతీ యిచ్చారని విన్నాం. అలాంటి రోడ్డది, గాలీ, వానా, వాహనాలూ, అధికార్లూ, మధ్యవర్తులూ అంకినంత వరకు రక్తం పీల్చేసుగుని మాంసం నల్చేసుగుని వొదిలేసిన శల్యాల్లాగ కంకరరాళ్ళూ, కతకలూ,

గోతులూ, కయ్యలూ, గాళ్ళూ రొంపీ, దిబ్బలూ దిరుగుండాలూ, మట్టీ మశాణం, పెంటడబ్బా - దానిచుట్టూ శాఖోపశాఖలుగా వ్యాపించి ఉన్న తుక్కు సంతానం - ఇల్లాగ్గా భయమేస్తూ ఆరోడ్డు

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

153

హాస్యవల్లరి