పుట:హాస్యవల్లరి.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డబ్బాడవాలీ కట్టి, బ్యాంకి కెళ్ళి డబ్బు తెచ్చి జాగర్తచేసుగుని, ఆరోగి కాస్త మార్గంలో పడడం చూసుగుని ఒకవారంలో మళ్ళీ వస్తానని చెప్పి, ఆయన చందనబస్తీ వెళ్ళిపోయాడు. ఆయనా వెళ్ళగానే, ఆవిడ స్నేహితురాలిద్వారా ఆవిడదగ్గిరికి ఒక బంగారపు గొలుసు - పాతిక్కాసుల్ది - బేరానికొచ్చింది. మషాగతు కలిసి రావడం వల్ల కొంచెం రాహితుగా వస్తువుదొరుకు తోందనిపించి, బహుమతీ రాగానే పూర్తిగా సొమ్ము గిరవటెయ్యచ్చుగదా అనే ధైర్యం చొప్పున, ఆవిడ, మాస వాయిదాలమీద డబ్బు చెల్లించే షరతుకి ఆ గొలుసు పుచ్చుగోడానికి ఒప్పుగుని బజానా ఇచ్చింది.

కాని, డాక్టర్ ధనాధన్ గారు వారంలేదు. గీరంలేదు మర్నాడు సాయింత్రానికి ఇల్లు వెతుక్కుంటూ వచ్చిపడ్డాడు. అంత పెందరాళే ఆయన వచ్చెయ్యడం ఆవిడికి కొంచెం ఆశ్చర్య అయింది. అయినా ఆవిడ, “చూశారా! ఈగొలును ఎంత ఇంచక్కా ఉందో!” అంది. 'ఇంచక్కానే ఉంది', అని ఆయన కూలబడి చెప్పుగొచ్చాడట!

ఆ ఊళ్ళో ఉన్న సత్రంలో రాత్రి మకాం వేశాను. ఉదయాన్ని కాఫీ కానిచ్చుగుని, వచ్చి మరి ఆరోగిదగ్గిరికి ఎల్లానా వెళ్ళిపడడంఅని నేను గుంజాటన పడుతూండగా, కోర్టు పనిమీద ఆవూరొచ్చి అక్కడ బసగా దిగిన ఒకాయన సాయంచేశాడు. ఆయన నన్ను వెంటబెట్టుగుని తిన్నగా లక్షారావుగారి గుమాస్తాకి అంటించి వెళ్ళాడు. మొదట్లో ఆ గుమాస్తా రేగటి బెడ్డల్లాగ మహగుచ్చుకొనేటట్టు మాట్లాడాడు. కాని, కాస్త తడి తగిలించేసరికి, అతడు ఎక్కడలేని మెత్తదనం కనపరిచి తక్షణం నన్ను వెంటేసుగుని రోగిగారింటికి తీసిగెళ్ళాడు. రోగిగారిది పెద్దమేడ, ఒక గదిలో ఒక సాగుడు మంచంమీద ఆయన శాలువ కప్పుగుని పరున్నాడు. ఆయన బాధతోనే నాతో ప్రసంగించాడు.

రో - కూచోండి తమ దే గ్రామం?

నేను - కరూరు. మీకు ఒంట్లో ఎట్లా ఉంది?

రో - ఒంటికేమండీ, పిక్కలా ఉంది. నడుమే!

నేను - అసలు సంగతేమిటండి!

రో - మా బస్తీ ప్రముఖులు ఈ మధ్య రోడ్లమీద పిల్లకాలవలు తవ్వారు.

నే - ఎందుకూ?

రో - మంచినీళ్ళ గొట్టాలకనీ, మురుగునీటి తూములకనీ, చెట్లు పాతడానికనీ, స్తంభాలు స్థాపించడానికనీ, బళ్ళవాళ్ళమీద కసి కొద్దీననీ, హెచ్చుతగ్గు లొచ్చినప్పుడు దూరాభారం వెళ్ళక్కర్లేకుండాననీ జనం చెప్పుగున్నారు. ఆ వయినం ఇంకా తేల్నేలేరు.

నే - సరిపోయింది. మీరల్లాంటి గోతులోగాని పడ్డారా ఏమిటి!

రో - మరే.

నే - పోన్లేస్తురూ, మీ అజాగర్తా మీరూనూ! కాస్తకిందూ మీదూ చూసుగుని నడవక్కర్లేదుటండీ, మీ రెంతసామంతులైనా! చిన్నవారూ చితగవారూగనకనా ఇదవడానికి!

రో - అయ్యొ! అయ్యొ! అబ్బ ! అబ్బ!

నే - ఏం ఏం ? నెప్పా? తగ్గిస్తాగా! వెధవ నెప్పి!

రో - మరేనండి. గట్టిగ మాట్లాడేసరికి ఖరేలు మనడమూనూ అక్కణ్ణించి ధనువాయి పోటూనూ ! కదులుదాం అనుకునేసరికి కలుక్కుమంటుంది.

నే - అయితేపోన్లెండి. కాస్త నిమ్మళించుగుని మరీ చెప్పండి.

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

151

హాస్యవల్లరి