పుట:హాస్యవల్లరి.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నోట్టోంచి బల్లపరుపుగా ఊది, ఆవిడికి నిర్మొహమాటంగా ప్రత్యక్షదానంచేసి, మళ్ళీ వెళ్లి గడపమీద కూచున్నాడు. ఆ పొగతో ఉక్కిరి బిక్కిరి అయి, ధూపం వేసినట్టు అయి, అరికాలిమంట నెత్తికెక్కి ఆవిడ తేనెపట్టులా రేగిపోయింది. అదిలగాయతు, ఆవిడ ప్రతీతిట్టుముక్కకీ, మడములు ఎగరెయ్యడం, చేతులుచాచి చేతిగూళ్ళు గిరగిరా తిరిగేలాగు నిలువువాటంలో బండచక్రాలులాంటి సున్నలు చుట్టడం. మందుకీ వెనక్కీ ఊగడం, తల ఎదరకి విసరడం, విడవకుండా చేస్తూ అచ్చంగా అయోమయపు గిన్నెలకి చక్రంతిప్పే మనిషి అవస్థలో పడింది.

వాడుతల పాగాలోంచి అద్దం ఓటి పైకితీసి, నవ్వుకుంటూ, తన మొహంయొక్క అందానికి మురిసిపోతూ. పెదిమిలికి ఒక ఐమూల ఉన్న చుట్ట దానంతట అదే పళ్ళమీద నృత్యం చేస్తూ అవతల ఐమూలకి చేరేటట్టు కదుపుతూ, తన పెదిమిల యొక్క పనివాడితనం చూసుగుంటున్నాడు.

సిమాలమ్మ - (ఒకతిట్టుకే పైన చెప్పిన చేష్టలన్నీ చేస్తూ, వాడిమోహం మీద కోపంవచ్చి) ఓరి నీమొహం ఈడ్చా, నీమొహంమండా, నీమొహం ఊరేగించా, నీమొహాన్ని జీడెట్టా, నీమొహం తగలెయ్యా, నీమొహంకాలా, నీమొహంగానుగాడా, నీమొహం ఛత్రంచెయ్యా. నీమొహం చిత్రికపట్టా, నీకళ్ళు పేలా, నీగుడ్లు మాడా.

వాడు - (చుట్ట తప్పించి, కోతిలాగ పళ్ళిగిలించి, దొరగెక్కినట్టు ముక్కూ వొళ్లూ గోక్కున్నాడు.)

సి - నీపళ్లుపీకా, నీగోళ్ళుపేల్చా, నీగోక్కోడం అంటించా, కొండముచ్చు వెధవా, కోతివెధవా...

అంటూ ఆవిడ దొరకపుచ్చుకునేసరికి ఆసమయానికి ఓ ముష్టమ్మి, ఓ కోతిని ఆడిస్తూ తీసుగొచ్చింది. ఎరకలాడు తలపాగాలోంచి ఓ అరిటిపండు తీసి దానికేసిగిరవటేసి, ఇంకోటి కుడి అరుగుమీద పడేశాడు. తక్షణం ఆకోతి గిరవటేసిన పండు పండట్టుగుని ఒక్క గంతులో కుడి అరుగుమీదికి ఎగిరి, అక్కడి పండుకుడా తీసుగుని తినేసి, మొగ్గలేసి సిమాలమ్మ ఎల్లా ఎల్లా తిప్పుగుని ఏమేమి చేస్తే అల్లాఅల్లా తిప్పుగుని అది అది చేస్తూండడం మొదలెట్టింది. సిమాలమ్మకి కోపం, జనానికి సంతోషం ఎక్కువైపోయాయి. ఇక ఎరకలాడు ఊరుకున్నప్పుడుకుడా, ఊరుకోకుండా ఆవిడ తిట్టేస్తోంది.

ఇంతలో వాడు ఆవిడకేసి చూచి నవ్వి, తనవేళ్ళు, (కళ్లుమూసుగుంటూ) ముద్దెట్టుగున్నాడు.

సిమాలమ్మ - (గబగబా) నీకు అమ్మవారు రానూ, నీకు మహమ్మారిరానూ, నీకు ఏకైత్తురానూ, నీకు పెద్దరోగంగానూ, నువ్ మంచంఅట్టా, నిన్ను పెద్దపాం పీకా, నిన్ను పులేసుగుపోనూ, నీమీద పిడుగడా, నిన్ను బలెయ్యా, నిన్ను తెగెయ్యా...

కోతిగుడా అంతవడిగానూ పెదిమిలు కదుపుతూ, కడంపన్లన్నీ చేసి చూపించింది. జనం చూస్తూ, వింటూ, కోలాహంలంగా ఉన్నారు.

కాని, సిమాలమ్మకి మాట ఒక్కంటికి అన్నేసి చేష్టలు చేస్తూండడంవల్ల, క్రమేపీ మడమలు లేవడం మానేశాయి. కాస్సేపటికి చేతులు గూళ్ళల్లో పట్టు తప్పిపోయాయి. మరి కాస్సేపట్లో మెడజీవాలుకూడా తోడుకు పోయాయి. అక్కడితో ఆవిడ చాలా పీలస్వరంలో తిట్టడం తప్ప, అభినయాల్లో ఒక్కటీ చెయ్యలేకపోయింది. ఆ సందర్భంలో

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

148

హాస్యవల్లరి