పుట:హాస్యవల్లరి.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అరుగునే ఆశ్రయించేది. కాని, ఆవిడకల్లో సరేసరి, నిద్దట్లోకూడా ప్రసంగిస్తూనే ఉండేది. ఇక, ఉత్తప్పుడు అడిగారూ! పైగా, పక్కని ఎవరో కళ్ళల్లో వత్తు లెట్టుగుని ఊకడుతూ కూచున్నట్టు, సంబోధనలుకూడా చేస్తూండేది. అయితేంగాక, ఇంతమాత్రాన్నే జనానికి కోపంరాలేదు. వాళ్ళు ఆవిణ్ణి, 'వాగుడుకాయి' అనీ, ఇంకా పొట్టి చేసి, 'వాక్కాయి' అనీ ఆవిడి పరోక్షంలో వ్యవహరించేవారు, తీరిపోయేది కాని, అభ్యాసంవల్లా నిర్భయత్వంవల్లా ఆవిడధోరణి క్రమేపీ తిట్లల్లో పడింది. కొంత కాలానికి ఎల్లాదిగిందీ! వీధమ్మట చరాచరాల్లో ఎవళ్ళేనా సరే, ఎదేనా సరే, నడవ భయం వెళ్ళ భయం, ఉత్తపుణ్యానికి ఆవిడ దులిపి ఝాడించి పారేసేది. పైగా వెధవకర్మం! తన వేడివేడి విమర్శని ఒక్కరవ్వ చల్లారనిచ్చి, దానికి కొంచెం వార్నీసు వెయ్యడంగాని దాన్ని ఎల్లానో సాపుచెయ్యడంగాని లేకుండానే ఆపళంగానే ఎదరపార్టీ మొహంమీద గిరవటెట్టేది. అక్కణ్ణించి క్రిమినలంతపని జరుగుతూండేది, ఆవిడవంక లేని మనిషి అవడంవల్లా, ఆడది ఆవడంవల్లా, సుళువుగా తిట్టడంలో సార్వీసు ఉన్న దవడంవల్లా, కోపం హెచ్చిన కొద్దీ నోటిధాటీ జోరు చెయ్యగల శక్తికలది అవడంవల్లా, విజయం ఆవిడికే దక్కుతూండేది. 'నోటిధాటీ' అంటే అదేదో జపాను సరుకు అనుకోకండి మరి! అప్పట్లో జనం బొత్తిగా పాపిష్టులు కాకపోడంవల్ల ఆవిడికి సంగీతం మట్టుకి అబ్బలేదు గాని ఆవిడిది గబళిశారీరం, త్రిస్థాయి గాత్రం, మందకొడివాళ్ళ మనోవేగానికి రెట్టింపుగా ఉండే వాగ్వేగం. ఆవిడకేకతో, పిల్లి పాలుతాగడం, కాకివాలడం, మరిచిపోతే, చావమా! తోక ముడుచుగొందే కుక్కలు ఆవీధిని వెళ్ళేవి కావంటే, చూసుకోండి మరి ఆవిడ ప్రజ్ఞ! ఒకసారి పరుగుమీద వస్తూన్న ఆంబోతుని ఆవిడతిట్టి మళ్ళేసిన సంగతి ఎరుగున్న వాళ్ళున్నారు. మరోమాటు, ఒక పెద్ద రౌడీలాంటి మీసాల్దారు తనకి భయం ఏమిటనుకుని ఆవీధిని ఓ కిర్రుజోడు తొడుక్కుని. కిల్లీ ఉమ్ముకుంటూ వెడుతూంటే, ఆవిడికి చికాకేసి, 'నీ మీసాలకిర్రుమండింది గదరా, నీ ఉమ్ము అంటించిరి గదరా!' అని జమిలిగా తిట్టేసరికి, అంతెత్తు మనిషీ నిలవా లేక, అడుగూ సాక్క, మాటా తోచక కేవలం 'సేమియా' అయిపోయాడని చెబుతారు. అక్కణ్ణించి, ఆవిడ ఎదటపడి ఆగలేని అసమర్థులంతా ఆవిడమీద అసూయ పెంచుగుని, ఆవిడతిట్లని గురించి చాటుగా ప్రచారం మొదలెట్టారు. సిమాలమ్మ తిట్టడవుప్రజ్ఞ దేశంలో మోగిపోయింది. ఆవిడికి అదొహజబ్బు అని చాలామంది అన్నారు. ఆవిడికి ఆజబ్బు కుదిర్చి ఖర్చులేని దేశోపకారం టూకీగా చేసేసి వీలైనంతపేరు లాగాలని కొందరు యత్నంచేశారు. మంచిదో చెడ్డదో ఏదో ఓపేరు గలవాణ్ణి తిట్టడమో, అధవా వాడిచేత తిట్టించుకోడమో జరిగితే, తమరికిగూడా అమాంతంగా కొంత పేరేనా సుళువుగా వస్తుందని భ్రమించే జనం ఉంటారు. ప్రస్తుతం పోటీ తిట్లపోటీ గనక ప్రతీవాడూ అభ్యర్థిగా నిల్చి చూశాడు, తిట్టుకి తొంభైదాకా తిట్టాలేమోగనక గట్టివాళ్ళుకూడా కొందరు చొరబడ్డారు. ఉపన్యాసకులు, ఉపాధ్యాయులు, విదూషకులు, పురోహితులు, వక్తలు, ఆవిణ్ణమించాలని వెళ్ళేవారుగాని, ఆవిడే మరి నాలుగాకులు ఎక్కువ చదివేది. బళ్ళవాళ్ళూ, బండపని చేసేవాళ్లూ, కోపం వచ్చిన పోలీసులు కూడా ఆవిడ తిట్టినంత సభ్యంగానూ స్వచ్చంగానూ తిట్టలేక తమ అపజయం ఒప్పేసుగున్నారు. తెర వెనకనించి ఉరిమినట్టు జంతువుల్లాగ కుయ్యగల ఒకరిద్దరు ముతగరకపు విద్యార్థులకికూడా ఆవిడ యెదుటనోరు లేవలేదు. కొంతమంది గడేకార్లూ, చిలక్కొట్లూ, ఏజెంట్లూ, జప్తులవాళ్లూ, వసూళ్లవాళ్లూ

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

146

హాస్యవల్లరి