పుట:హాస్యవల్లరి.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోయాయిగదా” అంటూ ఒక వింతతువు ఏడవడం మొదలెట్టింది. ఆవిణ్ణి నిమ్మళంగా ఏడవమని కోప్పడ్డాం. ఇంకో ఆవిడ నిశ్శబ్దంగా నీళ్లు తోడింది. అవేనా మీద పోసేటప్పుడు ధ్వని అవుతుందేమో అని భయమేసి, ఊరికే తడిగుడ్డపెట్టి వొళ్ళుతుడిస్తే చాలని నేను అన్నాను. శాస్త్రం అల్లా ఒప్పదని పెళ్ళికొడుకు తండ్రి మహా ఎగరడం మొదలెట్టాడు, బోడి ఎగరడం వీడూనూ! నాకు డబ్బు వెనకే ముట్టిపోవడం వల్ల నేను నిర్భయంగా ఓ కఠినమైన శ్లోకం చదివి దానికి అర్థం 'ధర్మంనిలబెట్టడానికి అధర్మం చెయ్యచ్చు, చెయ్యాలి' అని మెల్లిగా చెప్పి ముహూర్తం, దాటపెట్టొద్దని కూకలేశాను. మూడుగంటల ముప్పై అయిదు నిమిషాలకి ముహూర్తం, గడియారం, ఎవరి దగ్గిరా లేదు. చటుక్కున నేను మహాతెలిసినట్టు నక్షత్రాల కేసి చూసి 'సరే, ఇంకా బలువుగా రెండుగడియల వ్యవధి ఉంది' అన్నాను. అల్లా అనడం మరీ బాదైపోయింది. నేను ఝణ ఝణా మంత్రం చెప్పటం లేదని కన్యాప్రదాతకి నా మీద ఇంతముట్టుకుంది. అందుకని పైకి వినపడ్డం ప్రమాదం గనక నేను అవసరం చొప్పున మంద్రస్థాయిలో మాట్లాడుతూన్నట్టు నటించి తల ఎగరేసి పెదిమిలు కదుపుతూండే సరికి మెడా నోరూ నెప్పెట్టి చచ్చాను. ఈ ఘడియ వరకు అవి స్వాధీనంలేవు. ఆపళంగా పెళ్ళికూతురుతల్లి, “ఇంత డబ్బోస్తూన్నా నాపిల్లకి ఒక్క ముచ్చటా తీరలేదుకదా! అసలు పల్లకీ అంటే దానికి ఎంతో అంత మనసు! బాజాలంటే దానికి అన్నం అక్కర్లేదు. రాత ఇల్లా ఉంటే అవన్నీ ఎల్లా వస్తాయీ! అందులో మొగాళ్ల పురమాయింపులు! అయ్యో! బతుకు!” అంటూ రాగా లెట్టి ఊహూ చీత్తూ కూర్చుంది. పెళ్ళికొడుకు అప్పగారొచ్చి పానకబ్బిందిలేనా లేకపోవడం ఆడపెళ్ళివారి మొహంలా ఉందని తిప్పుకొని ఆడింది. పెళ్ళికొడుకుతండ్రొచ్చి “తాంబూలాలప్పుడు ఈ బాజాల సంగతి మీరు ఏమాత్రం మాతో ఊదినా, డోళ్ళూ అవీ పెద్ద రావణాచప్పుడు కాకుండా కాస్త తడిపించేనా నేను తెప్పించి ఉండేవాణ్ణి, ఊరేగడానికి వీలంటూ లేదు గనక పల్లకీ మానేశాం. లేకపోతే భాగ్యమా? మా విస్తళ్ళదగ్గిర రోజూ మేం పారేసే మెతుకుల పాటి విలవ లేదు మీరు కోరేవాట్ల విలవంతా! అది మాకు ఓ లెఖ్ఖా ఓ పత్రమా” అని సమర్ధించుకోవడం మొదలెట్టాడు. కన్యాప్రదాత, “ఇక్కడేనా కాస్తోకూస్తో దొడ్డిఅంటూ ఏడిసింది కాదుటయ్యా పోనీ యథాశక్తి దొడ్లోనే ఊరేగి ఉందుం. ఏదో రవంత పల్లకీ లాంటిది తీసుగొచ్చి మరీ ఏడవకపోయావూ! ఊరేగితే ఎవడేనా పట్టుగుంటాడుగాని, దొడ్డేగితే నీ కొంపేం ములిగిందీ!” అని అందుకున్నాడు.

వియ్యంకుడు - “వీల్లేక పోయిందని చెబుతున్నాను, గ్రహించండి. అక్కగార్ని నిమ్మళంగా ఇదవమనండి. ముహూర్తం ఇంకా కాలేదాయె మరి, ఇప్పణ్ణించీ ఊహూ రాగాలెందుకూ! అనుకున్న లాంఛనాల్లో ఒక్కటీ జరక్కపోయినా మేం నోరు నొక్కుకొని కుక్కినపేనుల్లా ఊరుకోలేదూ!” అన్నాడు.

కన్యప్ర - ఇప్పుడు నీకు లోటొచ్చిన లాంఛనాలేమిటోయ్?

వియ్యం - “ఏమోయ్” అనా, నన్నంటున్నావ్ (అని కళ్ళెఱ్ఱచేశాడు)

నేను - (పళ్ళు బిగించి) అబ్బ! నిమ్మళం! మెల్లి మెల్లిగా తిట్టుకోండి.

కన్యాప్ర - “ఏమోయ్” కాదు, "ఏమిరా” అని కూడా అంటాను మళ్ళీ నోరెత్తితే. తాంబూలాలనాడు నువ్వు అయిదు వందల ఎనభైయ్యీ లెఖ్ఖెట్టి పుచ్చుగున్నావ్, పూటా రూపాయిలని ఆరు తీసెయ్యించి, ఖంగున మోగేవి అందులో వేస్తేగాని ఉరెట్టుగుంటా నన్నావ్, అందులో లేవూ నీలాంఛనాలన్నీ!

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

142

హాస్యవల్లరి