పుట:హాస్యవల్లరి.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాశాడు. రామయ్య ఆ ఉత్తరం పట్టిగెళ్ళి జానికిరామయ్యకి చూపెట్టి “నువ్వే, ఇదంతా చేశావు! ఆ పీనుగు ఈ ఊరొస్తాడుకదా ఏమిటి మరి సాధనం?” అన్నాడు, ఆమట్టున, ఊళ్ళోకి ఎప్పుడొచ్చి వాకబుచేస్తాడో అనే భయం చొప్పున, ఊరవతల రోడ్డుపక్కనున్న రెస్ట్‌హౌసులోనే వండుకు తింటూ రాత్రింబగళ్లు మనిషి విడిచి మనిషి చొప్పున కాసి, ఒకనాడు తెల్లారకట్ట ఒకబండిలో ఆయన వస్తూంటే, బండీ ఆపుచేయించి, ఆయన్ని రెస్టుహౌసులోకి తీసికెళ్లి, ఆయన్ని వెన్నిట్లో కుర్చీలో కూచోబెట్టి, వీళ్ళిద్దరూ చూరుకింది చీకట్లో కూచుని మాట్లాడారట! అక్కడ జరిగిన ప్రసంగం, తరవాత, జానికిరామయ్య నాతో చెప్పాడు.

పం - (రామయ్యతో) మీది మహచెడ్డచిక్కండీ! రామయ్య బావా!

రా - (చప్పరించి, నవ్వు ఆపుగుని) ఎం జేస్తాం?

జా - రాతండీ, రాతా! నరుడికి వశమా?

పం - చూపులేనా అందలేదు కావును!

రా - పాపిష్ఠి కళ్లకి అదికూడానా!

పం - ఇక అక్కగారి దుఃఖం చెప్పనే అక్కర్లేదు పాపం!

జా - ఆవిణ్ణి ఆపడం మహాకష్టంగా ఉందండి. కంటికీ మంటికీ ఏకధార!

పం - అన్నట్టు అక్కగారు లోపలున్నారా? ఓమాటు చూద్దాం పదండి.

జా - ఆవిణ్ణి ఈవేళే పుట్టింటారు పరామర్శకి తీసిగెళ్ళారండి.

పం - ఈ యిల్లు ప్రయాణీకుల బసలా ఉంది, మీరిందులో ఉన్నారేం?

జా - పిల్లపోయిన నక్షత్రం మంచిదికాదండి. పైగా వాడ త్రిపాదికూడా కాదుట, వాడ షట్పాదిట. అంచేత చుట్టుపక్కల ఇళ్లు కుదరక, ఇల్లా వచ్చాం.

అని మరి ఆయన్ని మాట్లడనియ్యక, ఆయన్ని ప్రాతఃకాల స్నానం చెయ్యమని, ఇంత అన్నం వండిపెట్టి, ఆయన్ని ఊళ్లోకి తీసిగెళ్లక, తెల్లవారకుండానే ఆయన్ని బండి ఎక్కించేసి, పంపేశారు. మరి రెండు నెల్లకి ఆయన దగ్గర్నించి వచ్చిన ఉత్తరంలో మేం వచ్చిన వేళావిశేషం వల్ల తమ అబ్బాయికి మరో సంబంధం కుదిరి పెళ్ళి అయిందనిన్నీ, మేం యాత్ర వెళ్లేటప్పుడు అటు వచ్చి పోవలసిందనిన్నీ ఉంది. అది లగాయతు, మేం యాత్రకి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడూ కూడా, అక్కడ నాలుగేసి రోజులు ఆగుతూండేవాళ్లం! వాళ్లు భోజనం పెట్టేవాళ్లుగాని, కానైతే జామార్లు మాత్రం మళ్లీ ఇవ్వలేదు!

- జనవరి, 1928

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

136

హాస్యవల్లరి