పుట:హాస్యవల్లరి.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అ - నాకు జామారు కావాలి.

జా - కడంవాళ్ళకో?

అ - ఎమో!

జా - పోనీ మా ముగ్గురం మా జామార్లు ఆరు పంచెల కిందా ఉత్తరిస్తాం. ఆరుగురం పుచ్చుకుందాం.

ఆ - నా కల్లా పనికి రాదు.

ఓబయ్య - పోనీ ప్రతిజామారూ నిలువుగా చీరిస్తే రెండేసి జామార్లు అవుతుంది. అందరికీ తలోజామారూ వస్తుంది.

అ - అది బాగానే ఉంది.

అని మెచ్చుకోడానికి ఓబయ్యని ఒక్కటి కొట్టాడు. మేం మళ్లీ అరుగులమీదికి వచ్చాం. ఆపొడుగుటాయన (అనగా అచ్చయ్య) కన్యాప్రదాతని అమాంతంగా లాక్కెళ్లారేమిటని పంతులు జానికిరామయ్యని అడిగాడు. అందుకు జానికిరామయ్య “వాడికి కాలినరం ఓటిపట్టు పడుతూంటుందండి. అలాంటప్పుడు వాడు పరిగెత్తితే సద్దుకుంటుంది.” అని చెప్పాడు. “ఆ నరానికీ చేతులో ఏదో నరానికి కూడా సంబంధం ఉండి ఉండాలండి. అందుకనే ఆయన చెయ్యి ఊరుగోదు” అని పంతు లన్నాడు. పొద్దుకూకేదాకా మేం అరుగుమీదే కూచున్నాం. మేం లోపాయికారీగా కొత్త యెత్తు ఏదైనా ఆలోచించుకోడానికి వీల్లేకుండా వాళ్ళు మమ్మల్ని వదలకుండా పట్టుగున్నారు. ఇంకా ఏమాటమీద ఏం వస్తుందో సమర్ధించుకోలేక చావాలని భయం అందరికీ వేసింది. రాత్రి భోజనాపేక్ష ఎవడికీ లేదు. వెళ్ళిపోతే బాగుండునని ఉంది. రాత్రి అడవిలో వెళ్ళడం భీతిగానే ఉంది. మళ్ళీ జానికిరామయ్య ఓయెత్తువేశాడు. "పంతులుగారూ! తమ ఆస్తి వగైరాల దస్తావేజులు ఒక్కసారి కంటపడెయ్యాలి!” అన్నాడు. “అడ్డమా!” అని పంతులు అని తనూ గిరిజాలాయనా లోపలికి వెళ్ళారు. మేం అంతా మళ్ళీ లేవండి అనకుండానే తిండికి సిద్ధం అవుతాం ఎమోఅని గిరిజాలాయన భయం. రాత్రి ప్రయాణాల గురించి యింతలో ప్రసంగం వచ్చింది. వెన్నెలకూడా వచ్చింది. మాకు అల్లాంటి ప్రయాణాలు సరదాయే అన్నాం. అక్కడికి ఓకోసు దూరంలో ఉన్న గూడెం వెళ్ళి గిరజాలాయన రెండు బళ్ళు కట్టించుగొచ్చాడు. మేం లేచాం. దస్తావేజులు చూడ్డం అందరూ మరిచినట్టు నటించాం. ఉత్తరం రాస్తాం అని చెప్పి అందరిదగ్గిరా సెలవు పుచ్చుకుని బళ్ళుఎక్కి బయల్దేరాం, బళ్లవాళ్లు మళ్లీ మూట జేర వేస్తారేమో అని మేం కిక్కురుమనకుండా పడుకుని నిద్రపోయాం . ఉదయానికి అడవిచివరికి వెళ్ళాం, బళ్లతో సహా మావూరుదాకా వెడితే ఇతర చిక్కులుంటాయని చెప్పి వాళ్లని వెనక్కిపొమ్మన్నాం. కడం పాతిగమైళ్లూ నడిచి స్వగ్రామంలో పడ్డాం.

మర్నాడు జానికిరామయ్య పంతులికి ఉత్తరం రాశాడు. దాన్లో వృత్తాంతం ఏమిటీ? మేం ఇంకా మావూరు జేరుకోక పూర్వమే పెళ్లి కూతురు మసీసగం వచ్చి కాలంచేసిందనిన్నీ, ఘటనకి ఏమి చెయ్యలేం అనిన్నీ, విచారించవద్దనిన్నీ!! దాని మీదట, ఆ పంతులు పరామర్శపూర్వకంగా రామయ్యకి వేసిన జావాబులో, “మీకు వచ్చిన ఆపత్తు ఇంతా అంతా కాదు, గుండె నీరైపోయింది. విచారించకండి. నేనే బయర్దేరి మీ ఊరొచ్చి, సౌ|| అక్కగార్నీ మిమ్మల్నీ సమదాయించిందాకా, నాకు తోచటంలేదు,” అంటూ

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

135

హాస్యవల్లరి