పుట:హాస్యవల్లరి.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాస్త్రరీత్యా కన్యాప్రదాతకి ఏమి ప్రతిబంధకం లేదే? ఇయినా. పాపపరిహారం నిమిత్తమున్నూ, మీ పెద్దబ్బాయిగారి అనుమాన నివృత్యర్ధమున్నూ, మా రామయ్యకి మాత్రం భోజనం ఆ అవతల ఇంట్లో పెట్టండి!” అని జానికి రామయ్య సలహా ఇచ్చాడు. అంతాసరే అన్నమీదట మేం భోజనానికి కూచున్నాం, కరణంగారి యింట్లో వంట లేదని తెలిసినా, చిన్నకరణం ఉద్యోగానికి ఏం మొప్పుంవస్తుందో అని మడిగట్టుకు వెళ్ళాడు, మంత్రానికి పంతులు వెళ్ళాడు. అక్కడ వంటాలేదుట, పెంటలేదుట. ఆ రొండో బ్రాహ్మడే ఇంత అత్తీసరు తగలేశాట్ట. దాంతో అయిందనిపించారట. మాకు చెల్లమ్మగారే వడ్డించింది. రామయ్యకి రామచిలక వడ్డించింది. రెండో యిల్లు కొంత ఎడంగా ఉండడంవల్ల రామచిలక తన గొడవ అంతా రామయ్య దగ్గర, వెళ్లబోసుగోడంలో, తనకి బాల్యంలోనే ముడెట్టడం, ముడెట్టగానే అత్తారింటికి తీసిగెళ్లడం, అప్పణ్ణించీ పగలూ రాత్రీకూడా ఒక చీకటికొట్లో పెట్టి తనని తాళం వెయ్యడం, తన స్వజనం వచ్చినా వాళ్లతో తను మంచీ చెడ్డా అనుకోవాలంటే తమరి ఎదటే మాట్లాడాలనడం, వగైరా చెప్పుగు ఏడిచి “మీ అమ్మాయిని కూడా ఈ కొంపలో పారెయ్యకండి, నాయనా! అసలు మామరిది నిజంగా మూగాడే! ఆస్తితణఖా!” అందిట. అందుకు రామయ్య, “అమ్మా! అనుకుంటున్నాం.

మరి! పీటలమీద పెళ్ళిళ్లు అనేకం పేలిపోయినాయి. పీటల మీద భోయినాలు అనేకం దక్కకుండా పోయినాయి. ప్రాప్తం ఉండాలి దక్కాలి. అవాలి అనుకోవాలి. ఘటన!” అన్నాట్ట మేం భోజనాలై, అరుగుల మీద దొర్లుతూంటే (అప్పటికి నాలుగైంది) పంతులూ పెద్దకొడుకూ తద్దినం తెముల్చుకుని, కరణంగారిని వెంట పెట్టుకుని వచ్చారు, అప్పటిదాకా పెళ్లికొడుకు మొదటి యింటి అరుగుమీదే నిద్దరోతున్నాడు, బడలికవల్ల మాకు కొంచెం నిద్దరట్టింది. అయిదింటికి మేం లేచేసరికి పెళ్ళికొడుకుని ముస్తాబుచేసి, పంతులు ఇవతలికి వచ్చాడు. జానికి రామయ్య “పంతులు గారూ! తాంబూలాల ఆటంకంకూడా కానిత్తామా?” అన్నాడు. “వాళ్ళోచ్చి పిల్లని చూసుగోందే ఎల్లా? పైగా, తాంబూలాలు పెళ్ళికూతురుగారి ఊళ్ళో పుచ్చుగోవాలి!” అని ఓబయ్య తనని అడగందే చెప్పాడు. కొంచెం అయితే అచ్చయ్య వెళ్లి ఓబయ్య పళ్ళు గవ్వల్లాగా రాలకొట్టేవాడే! కాని, జానికిరామయ్య అచ్చయ్యని ఆగమని సంజ్ఞ చేసి, “ఏమంటారు పంతులుగారూ?” అన్నాడు. ఆయన “ఇక్కడా అక్కడా అంటూ నాకు పట్టింపులు లేవు. శుభస్య శీఘ్రం అన్నాడు గనక, అల్లానే!” అన్నాడు. సంబంధం ఇన్నాళ్లకి వచ్చింది, ఇది దాటిపోతుందేమో అని ఆయన బెంగ. సరే, తాంబూలాలు అయినాయి. నాకూ, రామయ్యకీ, జానకి రామయ్యకీ జామార్లు ఇచ్చారు. రామయ్యకి ఇవ్వడం జయప్రదం కాదని ఓబయ్య జ్ఞాపకం చేసినా వాళ్లూ విన్లేదు, రామయ్యా విన్లేదు. కడంవాళ్ల కివ్వలేదని కోపాలు బయల్దేరాయి. అచ్చయ్య మొహం జేవురించింది. వాడు మాటని పిలవకుండానే రామయ్యని రెక్కట్టుగుని కొంతదూరంగా తీసికెళ్ళి, “మీరు ముగ్గురూ జామార్లు లాగేస్తారా? నువ్వు ఉత్త బ్రహ్మచారివనీ, నంది మొహానికీ షష్ఠికీ తప్ప ఎందుకూ పనికిరావనీ వాడితో చెప్తానుజాగ్రత్త! నిన్ను కుళ్ళబొడుస్తారు!” అన్నాడట. రామయ్య “బాగా చెప్పుకో. చెప్పుకుని నాకు బంగారు చెప్పులు చేయించు,” అన్నాడట, అనేసరికి అచ్చయ్య ఫెడీమని రామయ్య దవడ ఊడిచాడు. తక్షణం మేం పరిగెట్టాం. పంతులు రాలేదు. సంగతి కనుక్కున్నాం.

జా - ఒరేయి ! ఇహ కాస్సేపుండరా, పోదాం.

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

134

హాస్యవల్లరి