పుట:హాస్యవల్లరి.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దగ్గొచ్చి సకిలించాడు, అంతేగాని వాడిజిహ్వెట్టుగుని వాడు మమ్మల్ని, "ఏం నాయనా! వచ్చారు! ఎండంతా మీపరం అయిందిగదా పాపం రండి! ఇదిగో కాళ్లు కడుక్కోండి, అదుగో మడికట్టుగుందురు గాని ఉండండి!” అని ఛస్తే అన్లేదు సరిగదా, “మీరెవరు? ఎందుకొచ్చారు?” అని కూడా అడగలేదు. రామయ్య రెండిళ్ళ మధ్యా చెట్టు నీడని కూచోపడ్డాడు. అరుగులమధ్య ఉన్న మెట్లలో ఆఖరు మెట్టుమీద నేను కూచున్నాను. అవడం మాలో అంతా ఒకటోరకం పేచీకోరులే అయినా అప్పటిస్థితిని బట్టి అందరికీ అస్త్రశస్త్రా లుడిగాయి కాని, అచ్చయ్య మాత్రం ఇంకా ముందే కయ్యానికి కాలుదువ్వుతాడేమో అని జానికిరామయ్య వాణ్ణి కాస్త ఎడంగా లాక్కెళ్ళాడు. వాళ్లిద్దరూ వీధిలో పచారు చేస్తున్నారు. కామయ్య ఓబయ్యలు మెట్లెక్కి తిన్నగా అరుగుమీది ఆసామీ దగ్గరికి వెళ్ళారు.

కా - మాది పొన్నూరండి.

ఓ - మరేనండి

కా - (ఓబయ్యతో) ఊరుకో! (అని ఒక్క దెబ్బ కొట్టాడు వాణ్ణి).

ఆయన (ఇద్దరి కేసీ చూసి ఊరుకున్నాడు.)

కా - తమరు నిరతాన్న ప్రదాతలని ప్రతీతి

ఓ - తమరు కేవలం నప్రతిగృహీతలని కూడా వినికిడి.

కా - (ఓబయ్యని మళ్లీ కొట్టాడు)

ఆయన - (ఓబయ్య మాట్లాడింది ఏదో తిట్టనుకుని ఓబయ్యని కొట్టబోయాడు.)

కా - తమకీర్తి ఈ అడవి దాటి అనేక సీమల వ్యాపించింది.

ఆయన - (పోక చెక్క నోట్టోవేసుగుని టక్కుమనిపించాడు)

ఓ - తమరు అతిథిపూజా ధురంధరులు

కా - (ఓబయ్యని ఓటి కొట్టి) మాకీ చిక్కులన్నీ ఒకానొక కుంకవల్ల వచ్చాయండి. వాడూ మాకు తప్పుడు దారి కనపరిచాడు.

ఓ - వాడు గుర్రంమీద కుడా తగులడ్డాడండి. అది బొత్తిగా బుక్కా గుర్రం.

ఆయన - (గుమ్మం కేసి తిరిగి) రామచిలకా! కాస్త సున్నం తెచ్చి పెట్టు! పోనీలో! వద్దు! నువ్వు ఇవతలకి రామోకు, నేనే తెచ్చుగుంటా!

అని లోపలకి వెళ్ళాడు.

ఈసమయంలో ఎవడో మనిషివాడు వీధి గుమ్మంలోకి వచ్చాడు.

మనిషి - చెల్లమ్మగార్ని వంటకి బేగీ రమ్మంతున్నారండి

నేను - వంటెక్కడ?

మ - కరణంగారింట్లో తద్దినం అండి.

నే - ఆపై యిల్లు కరణంగారిదా?

మ - అవును.

నే - ఇప్పుడు వంట మొదలెట్టి చచ్చినవాడికా బతుకున్నవాడికా తద్దినం పెట్టడం?

పాపం వారింట్లో భోక్తలు కుదిరారా? కావాలా?

మ - ఒకాయన యిందాకానే వచ్చారండి, రొండో ఆయన చిన్న కరణంగారండి.

నే - ఆయ నెవడు?

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

129

హాస్యవల్లరి