పుట:హాస్యవల్లరి.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వడితగ్గలేదు. అవసరం మాదేగనక, నేను రోషం చంపుగుని "ఏదేనా ఊరు త్వరగా జేరడానికి దారి చూపించండి బాబూ!” అని ఆయన్ని కోరాను. ఆయన, ఏం ఆలోచించుకోడానికో ఓలిప్త నిదానించి, మమ్మల్ని తూర్పుగా తిరిగి (దణ్ణం పెట్టమన్లేదు గాని) గబగబా వెళ్లమన్నాడు. ఎల్లనో లేచి మేం తూర్పుకి ఎగబడ్డాం, అన్నింటి తోడు అప్పుడు ఎదురెండ కూడాను. కొంత దూరం డేకేసరికి ఆదారి మాయమైంది. మాకందరికీ నామీదా, గిరజాలవాడి మీదా మంటేసు కొచ్చింది. 'ఆపీసుగుని అడక్కపోయినా తీరిపోను' అనుకున్నాను. నా మాటవినడం గోతులో దిగడం అన్నాడు ఓబయ్య. ఈ మాటు ఆ గిరజాలవాడు కనిపిస్తే నెత్తురు కళ్ల చూస్తానని అచ్చయ్య, వాడి గుఱ్ఱం ఉత్త కోటిపిల్లి తట్టనిన్నీ, దాని నడుం కొడవలిలా ఉందనిన్నీ, అది మరో మైలు వెళ్ళేసరికి వాడేదాన్ని మొయ్యాలనిన్నీ రామయ్య, వాణ్ణి ఆ మాటు కలుసుకోడంతోటే చందా పోగుచేసి అదెట్టి వాడి గిరజాలు మంగలిచేత నున్నగా తీయించేస్తానని కామయ్య, “మనికి ఈ వేళ దినమందు అన్న ప్రాశన ముహూర్తం లేదేమోరోయ్” అని జానికిరామయ్య. ఇల్లా తిట్టుగుంటూ తిమ్ముగుంటూ వుసూరుమంటూ వెనక్కి తిరిగి కూడలిదగ్గరకు మళ్ళీ వచ్చి గిరజాలాయన వచ్చిన దారివెంటే మళుపులు తిరుగుతూ కొంతసేపు వెళ్ళేసరికీ మూడు ఇళ్ళు కనిపించాయి. అది తప్పకుండా గిరజాలాయన ఊరనిన్నీ, మేం అంతా తన ఇంటిమీద దిగితే ఇల్లు తినేస్తాం అనే భయం చొప్పున మమ్మల్ని తప్పుదారి పట్టించడానికి వాడు ఎత్తు వేసి ఉంటాడనిన్నీ మాకు స్పురించింది.

అప్పటికి మిట్టమధ్యాహ్నం అయింది. మా పటాలం అంతా ఓమాటే కనిపిస్తే, ప్రతి గృహస్థూ వెంటనే అవతలికి పొమ్మంటాడేమో, ఒక్కొక్కడే ఊళ్లో ప్రవేశిస్తే బాగుంటుందని జానికిరామయ్య చెప్పాడు. అది చాలా బాగా ఉందని అందరూ ఒప్పుగున్నారు. కాని ప్రతీవాడు తను ముందు వెడతానని బయల్దేరాడు. అంచేత అంతా ఓమాటే వెళ్లాం. రెండిళ్లు దగ్గరసా ఉన్నాయి, ఓటి గిరవటేసి నట్టుంది. మొదటి యింటికీ రెండో యింటికీ మధ్య దొడ్డివుంది, దానికి వీధి వేపున చిన్న కోరడు ఉంది. దొడ్లో నూతి దగ్గిర ఓ ఆవిడ అంట్లు తోముతోంది. వీధిలో చింతచెట్టు తాలూకు నీడ ఉంది. మొదటి కొంప తాళం వేసి ఉన్నా అరుగుమీద ఓ ఆయన పడుకున్నాడు. " ఏమండోయ్! స్వామీ! ఇదేవూరు?” అని రాయ్య ఆయన్ని నిమ్మణంగా అడిగాడు. ఆయన వినిపించుగోక కళ్లు తెరవకుండానే పళ్లు పటపటా కొరుకుతూ అల్లానే పడుకున్నాడు. అచ్చయ్య వెళ్ళి ఆయన్ని నడ్డి విరగదన్నాడు. ఆయన లేవలేదు. తరవాత ఓబయ్య నడుంకట్టి ఆయన్ని అరుగుమీంచి కిందికి రోల్ని దొర్లించినట్టు దొర్లించాడు. అయినా సరే ఆయన లేవలేదు. తదుపరి రామయ్య బయల్దేరి ఆయన పిలక పట్టుగుని ఊడేపర్యంతం ఝాడించాడు. అప్పటికి ఆయనికి మెణుకువ వచ్చి, లేచి, మూతి వంకరగా పెట్టి, " ఆబావా బావ్. " అని మొరిగి మళ్లీ వెళ్లి అరుగుమీద పడుకున్నాడు. " ఒరేయ్ ! పాపం, మూగమనిషి గావున్రా ” అన్నాను నేను. "ఆ మాట మాత్రం చెప్పి ఏడవద్దుట్రా?” అంటూ రామయ్య ఇంకా కోప్పుడుతూనే ఉన్నాడు. ఈ సమయానికి రెండో యింటి అరుగు మీదకి ఓ ఆయన వచ్చాడు. కోరడు పక్కమ్మటే నడిచి మేం రెండోయిల్లు సమీపించాం. ఆరుగుమీదికొచ్చినాయన మాంచి బలంగా మా ఓబయ్య కంటే పెద్ద పన్నాగా ఉన్నాడు. కొంతసేపు అతగాడు ఏమి చలనం లేకుండా గుడిమీద బొమ్మలా కూర్చున్నాడు, తరవాత

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

128

హాస్యవల్లరి