పుట:హాస్యవల్లరి.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రా - నే చెప్పిందంతా వాళ్ళువినడం అయింది.

కే - అయితే, చెరిసహం నీదీ అయినట్టేగా!

రా - కాలేదేమో అని నా భయం. ఏమంటావా, వాళ్ళు విన్నది వాళ్ళకి తెలియాలి, తెలిసిన మీదట నచ్చాలి, నచ్చిన మీదట వాళ్ళు ఒప్పుకోవాలి.

158

కైవారపు శిఖరయ్యగారి క్షౌరకాండయొక్క మధ్యరంగంలో ఆయన మెడమీద కొంచెం కత్తితో ఒత్తవలిసొచ్చి, మంగలి, అమాంతంగా ఆయన బుర్రకాయ కిందికి వంచబోగా,

శి - (ఊపిరి సలపక) అబ్బ! అబ్బ! ఉండరా!

మం - మరి, వెనకాల కొంచెం ఒత్తాలండి.

శి - అయితే, పొట్టవేపునించి తిరిగి వీపువైపు, రా.

మం - రావచ్చుగాని, నేనవతల తొందరగా వాయింపు కెళ్ళాలండీ

159

కృష్ణుడు - ఒరేయి పానకం! నీకూ అమృతానికీ చెడిపేడీ అయిందిటా?

పా - అవదూ?

కృ - ఏమిటి కథా?

పా - ఆ ఏముందీ? ఏవో కొన్ని దంపుడుపద్యాలు కట్టి తెచ్చాడు. తెచ్చీ, బాగున్నాయా లేవా అని నన్ను చంపడం మొదలెట్టాడు. మొదలెడితే, పోరా నీకు కవిత్వం ఎమిటీ అన్నట్టు ఓ వందదోషాలు అయిదునిమిషాల్లో చూపించాను.

కృ - అయితే మరి దోషాల్లోంచి రోషాల్లో పడలేదూ మీ రిద్దరూనూ?

పా - వాడికి రోషంలేందేట్రా! వాడు ససవ! కాడంటావా?

కృ - అవును.

పా - ఎల్లాకనిపెట్టావ్?

కృ - లేకపోతే నిన్నడగడం ఏమిటి పద్యాలెల్లా ఉన్నాయనీ! మరోచవటని ఎవణ్ణడిగినా, తీరిపోను!

160

తొందరగానూ ఖంగారుగానూ ఇంట్లోకి జొరపడుతూ,

ఆయన - అమ్మకుంకా! చూడూ!

ఆవిడ - ఏమిటేమిటి?

ఆయన - పెసరయ్యగాడు!

ఆవిడ - ఏమన్నాడు?

ఆయన - తనతో నేను సమానం కాదుట.

ఆవిడ - మీ అంతవారు వాడితోనూ సమానం కాకపోవాలాయేమిటి ఊరుకుందురూ, వాడిలెఖ్ఖేమిటి, వాడిమాటలు లెఖ్ఖేమిటి పోనిస్తురూ! అసలు వాడు ముండల ముఠాకోరూ!

161

తమతమ రైళ్ళ వేగాలగురించి ముగ్గురు అభూతకల్పనలు చేసి మాట్లాడుకుంటూ,

ఒకడు - మారైలు చాలావేగంగా పోతుంది. అది వెడుతూంటే భూమేదో జలమేదో ఆకాశం ఏదో తెలియకుండా సర్వమూ ఒక్కటే గిలాబాలాగ ఉంటుంది.

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

112

హాస్యవల్లరి