పుట:హరివంశము.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 2

47


మ.

పరిణద్ధోగ్రయుగాంతభానుపరిధి ప్రస్ఫారమయ్యున్ వెసం
బరదారైకపరాత్మకుం డయిన యప్పాపాత్ముపాపంబునం
[1]బరిహీణాత్మమహత్త్వమై తృణకణప్రాయస్వరూపంబుతోఁ
దిరిగెన్ మాదెస రాక యంతటన తద్దివ్యాయుధం బత్తఱిన్.

178


వ.

దాని కమ్మూఢుండు విస్మితుం డయ్యును దనయహంకారంబున నిశ్శంకవృత్తి
నుండె నే నది యెయ్యదియు నెఱుంగ నాలోనన యాశౌచదినంబులు గడచిన
నుర్వీసురోత్తములచేతం గృతస్వస్త్యయనుండనై ససైన్యంబుగాఁ బురంబు వెలు
వడిన నవ్విరోధియు నా కెదురై నడిచె నివ్విధంబునం దలపడి.

179


క.

మూఁడుదినంబులు తద్దయు, వాఁడి యగురణంబు సేసి వరబాణాగ్నిన్
[2]మాడించితి నయ్యధమునిఁ, బోఁడిమి చెడి తద్బలౌఘములు వెస విచ్చెన్.

180


వ.

ఇ ట్లాయుగ్రాయుధుండు నిహతుం డయిన నటమున్ను వానిచేత రాజ్యభ్రష్టుం
డయి పోయిన పృషతుండు నాపనుపునఁ గాంపిల్యనగరంబు గైకొని యహి
చ్ఛత్రసహితంబుగా నేలెఁ బిదప ద్రుపదు గెలిచి యర్జునుండు ద్రోణున కప్పురం
బులు రెండు నొసంగినం బరిగ్రహించి గురుండు కాంపిల్యనగరంబు ద్రుపదున
కిచ్చి యహిచ్ఛత్రంబు తాను గొనియెఁ [3] బ్రసంగంబున నే నుగ్రాయుధునిగీ టణం
గించినచందంబునుం జెప్పితి నింకఁ బితృసమారాధనఫలానురూపం బగుకౌశికా
త్మజులచరితంబు మార్కండేయుండు నాకు నుపన్యసించినది నీకు నెఱింగించెద
విను మవ్విప్రు లేడ్వురపేళ్ళును వరుస వాగ్దుష్టుండును గ్రోధనుండును హింస్రుం
డును బిశునుండును గవియు ఘస్మరుండును బితృవర్తియు నన నిట్లు క్రియాను
రూపంబులై యొడఁగూడె నీదృశనామకరు లయిన వారు.

181


తే.

తండ్రి సచ్చినపిమ్మటఁ దమతమంత, వారలయి గర్గుఁ డనుమునివరునిఁ జేరి
శిష్యవృత్తిమైఁ బరిచర్య చేయుచును స, మంచితాధ్యయనంబు గావించి రర్థి.

182


క.

న్యాయాగత మగు గురుసొ, మ్మాయతకపిలాంగి యైనయావొకటి సమ
చ్ఛాయగలక్రేపుతోడిది, యాయేడ్వురుఁ గూడి కాతు రాతనియాజ్ఞన్.

183


సీ.

ఒక్కనాఁ డాఁకలియును నీరువట్టును నధికమై యోర్వలే కడవిలోన
నందఱు బాల్యంబునందలి చాపలంబును విమోహంబును నెనయుబుద్ధి
నగ్గోవుఁ జంపి యాహారంబు గొనుట గర్జంబుగాఁ గోరి నిశ్చయము సేసి
రందులోఁ గవియును నాఘస్మరుండును దగ దని పెక్కువిధములఁ జెప్పి


తే.

రెంత చెప్పిన మానరై రితరు లప్పు, డాత్మఁ దలపోసె పితృవర్తి యనునతండు
మనకు నెబ్భంగులను దీనిమాంస మిష్ట మేనిఁ బిత్రర్థముగ వధియించుడొప్పు.

184


వ.

అ ట్లయిన నిమ్మొదవుఁ బుణ్యగతి పడయు మనల నధర్మంబుం బొంద దనిన నట్ల

  1. బరిహీనాత్మ
  2. మూఁడించితి
  3. బవరంబున