పుట:హరివంశము.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

హరివంశము


మ.

మునివంద్యుండు వసిష్ఠపౌత్రుఁడు వినిర్ముద్రప్రభావాభివ
ర్ధనధరుండు పరాశరుండు నినుఁ బుత్రశ్రీసముద్దీప్తఁగా
నొనరించున్ భవదాత్మజుండును మహాయోగాఢ్యుం డేకాకృతిన్
జనువేదంబు చతుర్విభాగములుగా శాసించు ధీసంపదన్.

116


వ.

మఱియు మహాభిషుండను రాజు శంతనుండయి పుట్టిన నతనికిం బత్నివై చిత్రాంగద
విచిత్రవీర్యు లనుపుత్రులం గనియెదవు నీకన్యాత్వం బేమిటను వైకల్యంబు
నొందక యుండు నట్టిశుద్ధితోడన క్రమ్మఱ నెప్పటియోగస్థితిన పొందంగలదాన
వని యనుగ్రహించి రక్కన్యకయు నట్టిద యయ్యె నిట్లు చెప్పంబడిన రెండు
దెఱంగులపితృగణంబులు నమరులకుఁ బూజనీయు లని వెండియు.

117

పితృగణంబులలో మూ ర్తిసహితుల మూర్తిరహితుల వివరించుట

సీ.

వినుము దివంబున విభ్రాజములు నాఁగ వెలుఁగులోకంబులు గలుగువారు
బర్హిషదాఖ్యులై పరగినపితరులు సుతులు పులస్త్యున కతులధర్మ
మూర్తులు గణములు మూఁడయి వసియించే యక్షగంధర్వరక్షోహివిహగ
పతులచేఁ బూజలు సతతంబుఁ గాంతురు వారిమానస యైనవరతనూజ


తే.

యలఘుయోగాఢ్యపీవరి యనఁగ నొప్పు
నింక నప్పరాశరసుతుఁ డిద్ధతేజుఁ
[1]డరణిఁ గనియెడుపుత్రు నుదాత్తయోగ
ధరుని శుకుని భర్తగఁ బ్రమోదమునఁ జెందు.

118


వ.

అమ్మహాభాగుం డయ్యోగినియందుఁ [2]గృష్ణుండు గౌరుండు ప్రభుండు శంభుండు
ఋతుండు జయుండు భూరియు నన నేడ్వురు కొడుకులను [3]గీర్తిమతి యనుకన్య
కను గనంగలవాఁ డాకన్నియ యణుహుం డను రాజునకుం బత్నియై యోగ
సిద్ధుం డగు బ్రహ్మదత్తుం గనియెడు నిట్లు క్రమంబునఁ గీర్తింపఁబడిన వైరాజులు
నగ్నిష్వాత్తులు బర్హిషదులు ననుమూఁడుదెఱఁగులపితరులు మూర్తిరహితు లింక
మూర్తిసహితు లగువారిం జెప్పెద.

119


క.

జ్యోతిర్భాసము లనఁ బ్ర, ఖ్యాతంబులు సురపదములు గల వందుఁ [4]గడున్
బ్రీతి వసింతురు పితరులు, శ్రీతోడం బూరు లన వసిష్ఠతనూజుల్.

120


తే.

వారు పూజనీయులు విప్రవర్ణములకు, వారిమానస యగుకన్య వారిజాక్షి
గోసమాహ్వయ శుక్రునికూర్మిపత్ని, యయి వెలింగించె భార్గవాన్వయము నెల్ల.

121


క.

తనరును మరీచిగర్భము, లనులోకము లధికశుభము లంగిరసునినం
దను లగుపితరులు భాస్వరు, లనువారు వసింతు రచట నతులవిభూతిన్.

122
  1. ధరణి
  2. ఒకప్రతిలో నలుగు రని మొదటి నలుగురు వేఱొకప్రతిలో ఋతుండు జయుండు అనుటకు ఋరుంజయుం డని యార్వురని యున్నది.
  3. గృతి
  4. లసం ప్రీతి