పుట:హరివంశము.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము . ఆ. 2

37


మ.

కని యత్యంతము సంభ్రమంబు బెలయంగా భక్తిఁ బ్రత్యుద్గమం
బును బాదగ్రహణంబుఁ జేసి యెలమిన్ బూజించి [1]ప్రీతుండనై
నిను నాద్యం బగు దైవతంబుగ మదిన్ దేవా వితర్కించెద
న్నను ధన్యాత్తునిఁ జేయవే కృప భవన్మాహాత్మ్యముం దెల్పుటన్.

94


వ.

అనవుఁడు నప్పురుషుండు నామీఁద ననుగ్రహంబుతోడి పరిగ్రహదృష్టి దీపింప
నాపూర్ణస్వరం బగువాక్యంబున నిట్లనియె.

95


చ.

వనరుహగర్భుమానసభవప్రకరంబున కెల్లఁ బెద్ద నే
ననఘ సనత్కుమారుఁ డని యాగమకోటియు నన్ను సంప్రరీ
ర్తన మొనరించుఁ బుట్టువు మొద ల్దగ నిట్ల కుమారతాదశం
దనరుటఁ గీర్తితంబు నభిధానము నాకుఁ జగత్త్రయంబునన్.

96


వ.

మఱి మరీచ్యాదు లగు మదీయభ్రాత లేడ్వురు తపోవీర్యజ్ఞానంబులందు నన్ను
మన్నింతురు వారు ప్రజావంతులై నిజవంశంబు లెందును బ్రతిష్ఠించి లోకఛా
రణంబు సేయుచు సర్వసములై వర్తిల్లుదు రేము యతిధర్మపరాయణులము
నారాయణధ్యానతత్పరం బగుభావంబున నస్మద్భావనాపరులకు బ్రజాధర్మ
కామంబులు వర్ధిల్లం జేయుచు విహరింతుము నీవు భృగువంశపావనుండవు
నాదర్శనంబు గోరి తపంబు సేయుటవలనం బ్రసన్నుండ నైతి నెయ్యది యభీష్టం
బది వేఁడు మనిన నేను బితృగణంబుల ప్రథమసృష్టియుఁ దత్పూజాఫలంబులు
నీ యడిగినయట్ల యడిగిన నమ్మహాయోగీశ్వరుండు నా కిట్లనియె.

97

సనత్కుమారుఁడు మార్కండేయునకుం జెప్పిన పితృదేవతాప్రభావము

సీ.

అబ్జాననుఁడు తన్ను నర్థితో గుఱిచి యజించుట గోరి సృజించె సురల
నాతని విడిచి వా రాత్మఫలార్థులై యన్యముఖంబుల యజనవిధులు
[2]నడపఁగఁ గోపించి నలువ [3]తత్త్వజ్ఞాన మెడలునట్లుగ శపియించుటయును
భ్రష్టవిజ్ఞానులై వారలందఱుఁ గూడి త్రిదశులచేటునఁ ద్రిభువనములు


ఆ.

మోహవార్ధిలోన [4]మునిఁగిన నార్తులై, వార లాసమస్తవరదు శరణు
సొచ్చి రతఁడు గరుణ హెచ్చుగ [5]సర్వలోకాహితైకబుద్ధి నాదరించి.

98


క.

మీ రక్కట కష్టవ్యభి, చారము చేసితిరి దీని సైఁచితి నింకన్
బోరనఁ బ్రాయశ్చిత్త, ప్రారంభుల రగుఁడు బోధపరిణతి యొదవన్.

99


వ.

ప్రాయశ్చిత్తవిధియును మీతనయుల నడిగి [6]తెలిసికొని తదుక్తమార్గంబున నడువుం
డనిన నిర్జరులు నిజ[7]తనూజులపాలికిం [8]జని ప్రబోధం బభ్యర్థించిన వారు వాఙ్మనః
కర్మంబు లగుదుష్కృతులకుఁ గర్తవ్యంబు లగుమంగళాచరణంబులు దెలుపం
దెలుపఁ గర్మకాండతత్త్వంబు విశదం బగుటయు లబ్ధసంజ్ఞులై తదనంతరంబ.

100
  1. ప్రహ్వుండనై; బృహ్వుఁడనై.
  2. నడుపంగ
  3. తత్పరిబోధ
  4. మునుఁగఁగ
  5. లోకహితైకబుద్ధి వారి
  6. తెలుసుకొని
  7. తనయుల
  8. బోయి